Telangana Municipal Elections Results 2026: రాజకీయాలు అంటేనే కంపు, మురికి కూపం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు పార్టీలకు సిద్దాంతాలు ఉండేవి. నేలు, కార్యకర్తలు విలువలకు కట్టుబడి పనిచేసేవారు. కానీ ప్రస్తుత ధనస్వామ్యంలో అధికారమే పరమావధిగా మారింది. పార్టీలు నిరుద్యోగుల ఆశ్రయ కేంద్రాలుగా మారాయి. దీంతో పదవులు దక్కించుకోవడానికి ఇష్టానుసారం పార్టీలు మారుతున్నారు. ఇక పార్టీలు కూడా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి.. పొత్తులు పెట్టుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వ్యవహారం చూస్తే.. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. అధికారం కోసం బీఆర్‌ఎస్–బీజేపీ, కాంగ్రెస్–ఎంఐఎం, బీజేపీ–కాంగ్రెస్, బీఆర్‌ఎస్–కాంగ్రెస్–ఎంఐఎం, బీఆర్‌ఎస్–సీపీఐ, కాంగ్రెస్ – సీపీఐ ఇలా ఇష్టానుసారంగా పొత్తులు పెట్టుకున్నాయి. ప్రజల తీర్పును అపహాస్యం చేశాయి.
పొత్తుల రాజకీయం ఇలా..
ఎన్నికల తర్వాత అనేక మున్సిపాలిటీల్లో ప్రత్యర్థి పార్టీలు కలిసి మేయర్, చైర్మన్ పదవుల కోసం పొత్తుల రాజకీయాలకు తెరతీశాయి. కాంగ్రెస్–బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్–బీజేపీ కలయికలు, కొన్ని చోట్ల మూడు పార్టీల కూటమి కూడా కనిపించాయి. ఇలాంటి దగ్గరి ఒప్పందాలు పార్టీ కార్యకర్తల్లో కూడా విభేదాలు సృష్టించాయి.
ప్రజాస్వామ్యం అపహాస్యం..
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ఈమేరకు తెలంగాణ పట్టణ ఓటర్లు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. కానీ, మ్యాజిక్ ఫిగర్ రాలేదన్న భావనతో అక్రమ పొత్తులకు తెరతీశాయి. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రజల తీర్పును అగౌరవపరుస్తూ అధికారం చేజిక్కించుకుంటున్నాయి.
ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే..
అక్రమంగా పొత్తులు పెట్టుకున్నాక ఇక ఎన్నికలు ఎందుకు.. ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది. ప్రత్యక్ష స్థానిక సంస్థల అధిపతులకు ప్రత్యక్ష ఎన్నికలే ఉండాలి. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాపరిషత్ అధ్యక్షుల వరకు ప్రత్యక్ష ఎన్నికలే జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. లేదంటే పరిస్థితి ఇంతకన్నా దారుణంగా మారుతుంది. భవిష్యత్ అంధకారం అవుతుంది. దీనిని ఎలా సరిదిద్దాలి అనేది ఆలోచించుకోవాలి. సరిదిద్దే మార్గాలు అన్వేషించాలి. ప్రజాస్వామ్యాన్ని తిరిగి గాడిన పెట్టే బాధ్యత ఓటర్లపైనే ఉంది. 75 ఏళ్ల చరిత్రలే అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అయ్యాయి. చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుంది.
పాలనా సంస్కరణలు..
పాలనా సంస్కరణలు తీసుకురావాలని చాలా మంది ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవికి కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అవి ఇప్పట్లో జరగకపోవచ్చు. కానీ స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. అందుకే స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ సిద్ధాంతాలు లేవన్న విషయం తాజా మున్సిపల్ ఎన్నికల పొత్తుల ద్వారా అర్థమైంది. ౖyð రెక్ట్ ఎన్నికలు జరిగితే ఈ ధనస్వామ్య సిస్టం మారుతుంది. ఎక్స్ అఫీషియోలకు ఓటు ఎందుకు. స్థానిక సంస్థల్లో రోల్ ఉండడం తప్పు కాదు. కానీ ఓటు ఎందుకు అన్నది సమాధానం లేని ప్రశ్న. నేరుగా ఎన్నికలు నిర్వహించేలా రాజ్యాంగ సవరణ చేయాలి.
మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ప్రజా తీర్పును అపహాస్యం చేశాయి. అధికారం కోసం అడ్డదారులు తొక్కాయి. స్థానిక సంస్థల్లో బలంగా ఉంటే భవిష్యత్‌లో మళ్లీ గెలుస్తామన్న నమ్మకంతో పార్టీలు ఓటరు తీర్పును తుంగలో తొక్కేశారు.