Telangana Political Controversy: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పుష్కరం పూర్తయింది. అయినా ఇప్పటికీ తెలంగాణ అంశం, ఉద్యమం, సెంటిమెంట్ ప్రజల్లో రగులుతూనే ఉంది. రాజకీయ నేతలు దానిని రగిలిస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో తెలంగాణ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రం 12 ఏళ్లు గడిచినా, ఆ అస్తిత్వం ఇప్పటికీ రాజకీయ యుద్ధభూమిగా మారుతోంది. ఇటీవలి పవన్ కల్యాణ్–పొన్నం ప్రభాకర్ వాగ్వాదం ఈ వాస్తవాన్ని మరోసారి బయటపెట్టింది. తెలంగాణ ఏర్పాటు దినోత్సవం సమయంలో హైదరాబాద్‌లో ‘నవనిర్మాణ సభ’ నిర్వహించాలని పవన్ కల్యాణ్ ప్రకటించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’’ అని పవన్ ప్రశ్నించిన దానికి ‘‘అవును, మా అయ్య జాగీరే’’ అన్న తీరుగా వచ్చిన సమాధానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
దశాబ్దాల పోరాట ఫలితం..
ఉద్యమం నుంచి జాగీరు మనస్తత్వం వరకుదశాబ్దాల పోరాటం, విద్యార్థుల త్యాగాలు, యువకుల ఆత్మాహుతులు, లక్షలాది మంది ప్రజల ఉద్యమ ఉత్సాహం.. ఇవన్నీ తెలంగాణను కేవలం ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా ఆత్మగౌరవ చిహ్నంగా నిలిపాయి. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘‘మా రాష్ట్రం, మా సంపద, మా నిర్ణయాలు’’ అన్న నినాదం ప్రజల హృదయాల్లో గాఢంగా నాటుకుంది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది నాయకులు ఆ స్ఫూర్తిని తమ కుటుంబం, తమ పార్టీ లేదా తమ ప్రాంతీయ ఆధిపత్యానికి పరిమితం చేస్తున్నారు. ‘‘ఇది మా అయ్య జాగీరు’’ అన్న మాటలు ఆ ఫ్యూడల్ భావనను స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఉద్యమ కాలంలో అణచివేతను ఎదిరించిన వారే ఇప్పుడు తమను తాము ‘‘యజమానులు’’గా చూసుకోవడం బాధాకరం.
ప్రజలదా? పార్టీలదా? బయటి వారిదా?
తెలంగాణపై మూడు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సొత్తా? పార్టీలదా..?, బయటివారిదా? అంటే ఇది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ఎవరి కుటుంబ వ్యాపారం కాదు.
ఏదైనా ఒక రాజకీయ పార్టీ లేదా కుటుంబం యాజమాన్యంలో ఉందా?
ఎవరి ఆధిపత్యంలోనూ ఉండకూడదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రం ప్రజల సార్వభౌమత్వానికి లోబడి ఉండాలి.
రాజకీయం చేయడం తప్పా?
భారత రాజ్యాంగం ప్రకారం ఏ భారతీయ పౌరుడికైనా దేశంలో ఎక్కడైనా రాజకీయ కార్యకలాపాలు చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ కార్యకలాపాలు స్థానిక భావాలను గౌరవించి, ఉద్యమ త్యాగాలను అవమానించకుండా జరగాలి. ‘‘వలసదారులు’’ అన్న మాటను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం కూడా ప్రమాదకరం. పవన్ కల్యాణ్ గతంలో తెలంగాణ ఏర్పాటుపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావాలను గాయపరిచాయన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో, స్థానిక నాయకులు ‘‘ఇది మా జాగీరు’’ అని చెప్పడం ఆ గాయాలను మరింత లోతు చేస్తోంది. రెండు వైపులా ఉన్న ఈ ధోరణి తెలుగు రాష్ట్రాల మధ్య సహజీవనానికి మంచిది కాదు.
అణచివేతకు వ్యతిరేకంగా..
తెలంగాణ ఉద్యమం అణచివేతకు వ్యతిరేకంగా పుట్టింది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు కొందరి రాజకీయ ఆధిపత్యం మరియు వ్యక్తిగత స్వార్థాలకు బలి అవుతోంది. ‘‘జాగీరు’’ మనస్తత్వం రాజకీయాలను కుటుంబ ఆస్తిగా మార్చేస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. నిజమైన అభివృద్ధి కావాలంటే తెలంగాణను ఎవరి యాజమాన్యంగా కాకుండా, అందరి హక్కుగా చూడాలి. నాయకులు యజమానులుగా కాకుండా సేవకులుగా పని చేయాలి. బయటి నాయకులైనా, స్థానికులైనా వారి పనితనం, వారి విధానాలు, వారి నిబద్ధత ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకోవాలి.
తెలంగాణ ప్రజలు దశాబ్దాల త్యాగాలతో సాధించిన ఆత్మగౌరవం ఇప్పుడు రాజకీయ లాభాల కోసం బలిపశువు కాకూడదు. ఈ ‘‘జాగీరు’’ వివాదం ఒక సంకేతం మాత్రమే. ఇది రాజకీయ వ్యవస్థలో ఇంకా ఉన్న ఫ్యూడల్ మనస్తత్వానికి అద్దం పడుతోంది తెలంగాణ ముమ్మాటీకి ఇక్కడి ప్రజలదే. మిగతా అన్నీ కేవలం రాజకీయ భ్రమలు మాత్రమే.
