Udayam Newspaper Relaunch: సరిగా నిన్న ప్రభాత ఉదయం పేరుతో ఒక ప్రకటన కనిపించింది. దాని కింద అక్షరాల జైత్రయాత్ర అని సబ్ హెడ్డింగ్ పెట్టారు. ప్రతి ఉదయం తెలంగాణ తనతో తానే సంభాషణ సాగిస్తుందని.. వార్తల ప్రపంచాన్ని సందేహాలు కమ్ముకున్నాయని.. వాటిని చీల్చుకుంటూ కొత్త తరానికి సరికొత్త స్వరంగా ప్రభాత ఉదయం ముందుకు వస్తుందని.. బానిసత్వం అక్షరాలకు అలవాటు చేసిందని.. భజనపరత్వం.. ప్రేక్షకత్వం.. పాక్షికత్వం.. వంటి వాటిపై తిరుగుబాటు తప్పదని.. ఇకపై ప్రతి ఉదయం కొత్తగా ప్రభవిస్తుందని.. అవినీతికి ఆస్కారం లేదని.. అవకాశవాద అక్షరాలను చిత్తు చేసే మార్గం ఏర్పాటయిందని.. దిగంతాలకు చిల్లులు పడతాయని.. అగ్ని ధారలు కురుస్తాయని.. ప్రభాత ఉదయ్కిరణాలు ప్రసరిస్తాయని.. ఈ అక్షరాల జైత్రయాత్రలో పాల్గొనే ఉత్సాహం మీలో ఉంటే మాతో కలిసి రండని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభాత ఉదయం పేరుతో వచ్చిన ఆ ప్రకటనలో ఉదయం అనే అక్షరాలు అచ్చం దాసరి నారాయణరావు ఉదయం పత్రిక మాదిరిగానే ఉన్నాయి. అప్పట్లో ఈనాడు వీరవిహారం చేస్తున్నప్పుడు దాసరి నారాయణరావు మీడియా రంగంలోకి వచ్చారు. తారక ప్రభు పేరుతో మీడియా సంస్థ ఏర్పాటు చేసి.. ఉదయం అనే పేరుతో పత్రికను తెర మీదకు తీసుకొచ్చారు. అప్పట్లో ఉదయం పత్రిక ఒక సంచలనం. ఆ పత్రికలో వచ్చే కథనాలు విస్పోటనం లాగా ఉండేవి. ఉదయం పత్రిక ఒక దశలో ఈనాడును బీట్ కూడా చేసింది. అప్పట్లో దిగ్గజ పాత్రికేయులు మొత్తం ఉదయంలో పనిచేసేవారు. ఒక వెలుగు వెలిగిన ఉదయం ఆ తర్వాత చీకట్లో కలిసిపోయింది. అనేక సందర్భాలలో ఉదయాన్ని కొత్తగా తీసుకురావాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు.
2023 ఎన్నికల్లో ఉదయం పత్రిక తెరమీదకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. అందులో వాస్తవం లేకుండా పోయింది. చివరికి ప్రబాత ఉదయం పేరుతో ప్రకటన వచ్చిన నేపథ్యంలో.. అది దాసరి నారాయణరావు ఉదయం రీ లాంచ్ అని పాత్రికేయ వర్గాలలో చర్చ జరిగింది. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ప్రభాత ఉదయం పత్రిక అడ్రస్ కావూరి హిల్స్.. మాదాపూర్ గా పేర్కొన్నారు. ఈ మీడియా పబ్లికేషన్స్ కూడా ప్రభాత ఉదయం అని పేరు పెట్టారు. అయితే ఈ పత్రికలో న్యూస్ ఎడిటర్లు.. చీఫ్ సబ్ ఎడిటర్లు.. సీనియర్ సబ్ ఎడిటర్లు.. సీనియర్ రిపోర్టర్లు.. గ్రాఫిక్ డిజైనర్లు.. ఫోటోగ్రాఫర్లు.. ట్రైనింగ్ సబ్ ఎడిటర్లు.. ట్రైనీ రిపోర్టర్లు కావాలని ప్రకటన ఇచ్చారు. ఇటీవల కాలంలో ప్రింట్ మీడియా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. బాగుంటుందని నమ్మకం లేదు. అలాంటప్పుడు ప్రభాత ఉదయం పత్రిక ఆన్లైన్ ఎడిషన్ కి పరిమితమవుతుందా.. లేదా పత్రిక రూపంలో వస్తుందా అనేది చూడాల్సి ఉంది.