Rajasthan Farmer: ఎండ.. వాన.. చలి.. దేనితో సంబంధం లేకుండా భూమిని దున్నడం.. కష్టపడి పంట సాగు చేయడం.. సాగు చేసిన పంటను అమ్ముకోవడం.. ఇది మాత్రమే రైతుకు తెలుసు. పంటను పండించే క్రతువులో రైతు ఎన్నో కష్టాలు పడతాడు. మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అయినప్పటికీ వాటన్నింటిని ఎంతో ఇష్టంతో స్వీకరించి.. రైతు అనే పదాన్ని సార్ధకం చేసుకుంటాడు.
ఇంత కష్టపడి పంట పండించినప్పటికీ రైతుకు గిట్టుబాటు అనేది ఉండదు. అతడు చేసిన శ్రమకు విలువ లభించదు. ప్రభుత్వాలు పట్టించుకోవు. సమాజం లెక్క చేయదు. రైతు అంటేనే ఒక చులకనగా చూస్తుంటారు. వ్యవసాయం అనే పదాన్ని బూతు లాగా భావిస్తుంటారు. కానీ ఆ రైతు పంట పండించకుండా ఉంటే.. వ్యవసాయం ముందుకు సాగకుండా ఉంటే.. మనదేశమే కాదు ప్రపంచం మొత్తం పస్తులు ఉండాల్సిందే.. ఆకలితో ఇబ్బంది పడాల్సిందే.
ఎంతో కష్టపడి పంటలు సాగుచేసి.. డబ్బులు సంపాదించే రైతులు.. వాటిని అత్యంత జాగ్రత్తగా దాచుకుంటారు. అందులో నుంచి ఒక పైసా కూడా ఖర్చు పెట్టడానికి ఒప్పుకోరు. రాజస్థాన్లోని బలోత్ర ప్రాంతంలో మంగీలాల్ అనే రైతు కూడా ఇలానే పంటలు పండించి డబ్బులు సంపాదించాడు.. ఆ డబ్బులతో ఒక ప్లాట్ కొనుగోలు చేశాడు. ఆ ప్లాట్ కు ఇటీవల ధర పెరిగింది. దీంతో దానిని అతడు అమ్ముకున్నాడు. దానిని అమ్ముకుంటే అతనికి ఐదు లక్షల దాకా వచ్చాయి. ఆ డబ్బులను అతడు భూమి లోపల దాచుకున్నాడు.
ఆ ప్రాంతంలో దొంగలు విపరీతంగా ఉంటారు. అందువల్లే అతడు దాచుకున్నాడు. అయితే అతడు డబ్బులు దాచుకున్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇటీవల తన భూమి చుట్టూ కంచె నిర్మించడానికి తవ్వకాలు చేపట్టాడు. అందులో ఒక బ్యాగ్ లభించింది. ఆ బ్యాగు తెరిచి చూడగా కరెన్సీ కట్టలు కనిపించాయి. అయితే ఆ కట్టలకు చదలు పట్టింది. దీంతో సీరియల్ నెంబర్లు మొత్తం పోయాయి. ఆ నోట్లను బ్యాంకు వద్దకు తీసుకెళ్తే.. అధికారులు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆ రైతు పరిస్థితి దారుణంగా మారిపోయింది. కష్టపడి సంపాదించిన డబ్బు.. భూమిలో దాచుకోవడం ఆ రైతు పాలిట శాపంగా మారింది. తాను దాచుకున్న నోట్లు దొరికాయని ఆనందపడాలో.. అవి ఎందుకూ పనికి రావని కుమిలిపోవాలో తెలయని పరస్థితి ఆ రైతుది. అతడి బాధ చూసి తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.