Yuvraj Singh On Team India 2027 World Cup: టీమిండియాకు వైట్ బాల్ ఫార్మాట్ లో తిరుగులేదు. వన్డే, టీ20 లలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి జట్లకు సాధ్యంకాని రికార్డులను సాధిస్తోంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్, అంతకుముందు జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుతమైన ప్రతిభ చూపించింది.
వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా ఈస్థాయిలో రాణించడానికి ప్రధాన కారకుల్లో రోహిత్, విరాట్ తప్పక ఉంటారు. దరిద్రం వెంటాడింది కాబట్టి 2023 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి పాలైంది. ట్రోఫీ కలను మరోసారి సాకారం చేసుకోలేకపోయింది. కానీ, ఈసారి టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది.
వైట్ బాల్ ఫార్మాట్ లో వేగం ఉండాలి. అనుభవమున్న ఆటగాళ్లు కూడా ఉండాలి. వేగాన్ని నమ్ముకుంటే ఒక్కోసారి ఇబ్బందిపడక తప్పదు. అలాంటప్పుడు అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉంటే జట్టు భారీ స్కోర్ మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నం లాగా నిలిచే అవకాశం ఉంటుంది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం కూడా అదే.
2011 మాదిరిగానే 2027లో కూడా టీమిండియా అదే సూత్రాన్ని పాటించాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెబుతున్నాడు. ఇటీవల అతడు ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘2027 వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ ఫెవరెట్. కానీ, జట్టులో అనుభవం ఉన్న వారు కచ్చితంగా ఆడాలి. విరాట్, రోహిత్ శర్మకు జట్టులో స్థానం కల్పించాలి. వీరిద్దరూ టెర్రిఫిక్ గా ఆడగలరు. ఎలాంటి స్థితిలోనైనా బ్యాటింగ్ చేయగలరు. వారిని కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని’ యువరాజ్ పేర్కొన్నాడు.
రోహిత్ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకుంది. 2007 తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా దాదాపు 17 సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. రోహిత్ పోరాట పటిమ, ఫైనల్ లో విరాట్ వీరోచితమైన బ్యాటింగ్ టీమిండియాను విజేతను చేశాయి.
ఇటీవల ఓ కార్యక్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ జట్టుకు సంబంధించి గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అప్పటి వరకు జట్టులో ఎవరుంటారో, ఉండరోనంటూ పేర్కొన్నాడు. అతడికి కౌంటర్ గా యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని రోహిత్, విరాట్ అభిమానులు భావిస్తున్నారు.
