Home Blog Page 8545

వెబ్ సిరీస్ లోకి అడుగు పెడుతున్న నాగ్ అశ్విన్


“ఎవడే సుబ్రమణ్యం , మహానటి ‘ చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న నాగ్ అశ్విన్ ఇపుడు తన రూట్ మార్చు కొంటున్నాడు. సినిమాలను పక్కన పెట్టి వేరే దారిలోకి వెళ్ళ బోతున్నాడు. నిజానికి కరోనా సమస్య రాకపోతే ప్రభాస్ నటించే 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫై చేయడానికి కూడా అంతా సిద్దమయ్యింది. అంతా సజావుగానే సాగుతున్నసమయంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రీ ప్రొడక్షన్ ఆగింది. అదీగాక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 20 వ సినిమా షూటింగ్ ఊదా ఆగింది. దీంతో నవంబర్ లో ప్రారంభించాలనుకున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా వెనక్కి వెళ్ళింది. అయితే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్ ని వృథా చేయకూడదని నిశ్చయించు కొని ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించాలను కుంటున్నాడు.

విన వస్తున్న దాన్ని బట్టి నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే ఈ వెబ్ సిరీస్ ని హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నాడట. 2004 లో బొమ్మలాట అనే చిత్రాన్ని, 2018 లో కేరాఫ్ కంచరపాలెం అనే చిత్రాన్ని సమర్పించిన రానా ఇపుడు వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలో కూడా అడుగు పెడుతున్నాడు.

కేసీఆర్ కు ‘రాములమ్మ’ మద్దతు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను తరుచూ విమర్శించే సినీనటీ, తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి లాక్డౌన్ పొడగింపు విషయంలో ఆయనకు సపోర్ట్ చేశారు. ఈమేరకు ‘రాములమ్మ’ సోషల్ మీడియాలో కేసీఆర్ నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు పోస్టు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్డౌన్ కొనసాగింపు మంచిదేనని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మీడియా నిర్వహించి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడారు. భారత్ లాంటి అధిక జనాభా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు లాక్డౌన్ ఉత్తమ మార్గమని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. కేసీఆర్ నిర్ణయంపై రాములమ్మ స్పందించారు. ‘లాక్డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్థిస్తున్నాను’ అంటూ విజయశాంతి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

అలాగే ఢిల్లీ జమాత్ సమావేశాలకు వెళ్లొచ్చినవారు స్వచ్చంధంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మర్కజ్ ప్రార్థననలకు వెళొచ్చినవారు వివరాలు స్వచ్ఛందంగా తెలియజేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీటిని దృష్టిలో ఉంచుకొని అలాంటివాళ్లు తమంతా తాము వివరాలను వెల్లడించాలని కోరారు. ఇది ఆయా వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా లాక్డౌన్ కొనసాగిస్తేనే మంచిదని ఎక్కువమంది అభిప్రాయం కన్పిస్తుంది. కేసీఆర్ ఈమేరకు ప్రధాని మోదీకి లాక్డౌన్ కొనసాగించాలని కోరనున్నట్లు తెలిపారు. కేంద్రం లాక్డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..

విజయవాడలో కనిపించని లాక్‌డౌన్‌ ప్రభావం


ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార నివాసానికి కూతవేటు దూరంగా ఉన్న, కరోనా వైరస్ వ్యాప్తిలో రెడ్ జోన్ గా భావిస్తున్న విజయవాడ నగరంలో లాక్‌డౌన్‌ ప్రభావం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి రోజు సమీక్ష జరుపుతున్నా, ఉన్నతాధికారులు అందరు సమీపంలో ఉన్నా ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

విజయవాడ నగరంలో ఇప్పటికే 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. అయినప్పటికీ జనం భౌతిక దూరాన్ని పాటించడం లేదు. ప్రధాన రోడ్లపై గుంపులు గుంపులుగా జనం సంచరిస్తున్నారు. రోడ్లపై వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పోలీసులు కేసులు పెట్టినా, వాహనాలను సీజ్‌ చేసినా జనం తీరు మారడం లేదు.

ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం నిర్ణీత సమయాన్ని ఇచ్చినప్పటికీ.. సమయం దాటిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో జనం రోడ్లపై తిరుగుతున్నారు. ఈ విషయమై పోలీసులు సహితం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

28 రోజులలోపు గృహ నిర్బంధంలో 1450 మంది ఉన్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో హాస్పిటల్‌లో 32 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 440 మంది నమూనాలు తీసుకున్నారు. వీరిలో 29 మందికి పాజిటివ్‌ వచ్చింది. 221 మంది రిపోర్టులు రావల్సి ఉంది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఒకరు ఒకరు కరోనా పాజిటివ్‌ లక్షణాలతో చనిపోయారు.

లాక్‌డౌన్‌ ను మరింత పకడ్బందీగా అమలు జరపని పక్షంలో ఈ వైరస్ మరింత పెరిగే అవకాశం ఉన్నదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పనుల సాకుతో రోడ్లపై తిరుగుతున్న యువతను కట్టడి చేయవలసిన పరిస్థితి నెలకొంది.

కేసీఆర్ బాటలో లాక్‌డౌన్‌ పొడిగింపుకు 6 రాష్ట్రాలు


దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడు వారాల లాక్‌డౌన్‌ ను మరింత కాలం పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన సూచనకు దేశ మద్దతు లభిస్తున్నది. కనీసం ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగించవలసిందే అని స్పష్టం చేసాయి.

గడువు ప్రకారం ఈ నెల 14న లాక్‌డౌన్‌ తొలగిస్తూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా తయారవుతాయని ఆయా ప్రభుత్వాధినేతలు భావిస్తున్నారు. దేశంలో నమోదవుతున్న కేసులలో మూడవ వంతు మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తెలంగాణలో ఉండటం గమనార్హం. లాక్‌డౌన్‌ను కొనసాగించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కోరుతున్నాయి.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 891 కేసులు నమోదు కాగా 45 మంది మృతి చెందారు. దానితో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో తాము లాక్‌డౌన్ కొనసాగింపు కోరుకుంటున్నామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె చెప్పారు. ‘ఏప్రిల్‌ 15 తర్వాత లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయబడుతుందని ఎవరూ అనుకోవద్దని’ మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్‌ తోప్‌ స్పష్టం చేశారు.

తబ్లిగీ జమాత్‌ కారణంగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఉత్తరప్రదేశ్‌ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నమోదైన 305 కేసుల్లో 159 తబ్లిగీతో సంబంధం ఉన్నవారివేనని, ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిన అవసరంలేదని వారు పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అసోంకు రావాలనుకునే వారిని అడ్డుకుంటామని, శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న వారికి కూడా కొంతకాలంపాటు ఐఎల్‌పీ (ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌)వంటి పరిస్థితి అవసరమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వా పేర్కొన్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ప్రభుత్వం విశ్వసించిన తర్వాత రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ప్రకటించారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ ప్రభుత్వాలు సహితం ఇటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ నిజమేనట


కొంత విరామం తరవాత రాజకీయాల తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వబోతున్నక్రమంలో వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. అందులో మొదటగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తిగాకుండానే క్రిష్ డైరెక్షన్లో తన 27 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టేసాడు. ఇక ఈ చిత్రం తరవాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ చిత్రం ఉంటుందని ప్రకటించేసాడు.. మరో పక్క తరువాతి చిత్రాల కోసం కూడా కథలు వింటున్నట్టు రూఢీగా తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ మల్టీ స్టారర్ కథని ఓకే చేసినట్టు తెలుస్తోంది

పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తం లో చేసిన ఒకే ఒక్క మల్టీ స్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’. ఈ చిత్రం డైరెక్ట్ చేసిన కిశోర్ పార్థసాని(డాలీ) తోనే ఇప్పుడు మరో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మల్టీ స్టారర్ చిత్రం లో రెండో హీరోగా మాస్ మహారాజ్ రవితేజ నటిస్తాడని తెలుస్తోంది. రవితేజ తో ‘నేల టిక్కెట్’ ‘డిస్కో రాజా’ చిత్రాల్ని నిర్మించిన ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మించ బోతున్నట్టు కూడా తెలుస్తోంది.
రవితేజ తో చేసిన ‘నేల టిక్కెట్’ ‘డిస్కో రాజా’ చిత్రాలు డిజాస్టర్ కావడం వల్ల పీకల్లోతు నష్టాలలో కూరుకుపోయాడు. నిర్మాత రామ్ తాళ్లూరి….ఇప్పుడు ఈయన్ని ఆ అప్పుల్లో నుండీ విడిపించడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది.

ఐటీ వ్యాపారవేత్త, సినీ నిర్మాత అయిన రామ్ తాళ్లూరి. ‘లీడ్ ఐటీ’ అనే సంస్థతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఈయనకు జనసేనాని పవన్ కల్యాణ్ మంచి మిత్రుడు. రామ్ తాళ్లూరిని రీసెంట్ గా “వ్యాపార దక్షతతోనే కాకుండా, సామాజిక స్ఫూర్తి పరంగానూ తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తున్న వ్యక్తి” అని కొనియాడగా దానికి “మీ అభినందనలే నాకు దక్కిన అపురూప గౌరవంగా భావిస్తాను” అని రామ్ తాళ్లూరి ధన్యవాదాలు కూడా తెలిపారు. అలాంటి బంధం వారిద్దరిది. అందుకే అడగ్గానే మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది .
a friend in need is friend indeed

పేద ప్రజలను ఏమైనా పట్టించుకుంటున్నారా!

High court

కరోనా వ్యాప్తిని నియంత్రణకు 21రోజుల లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేద ప్రజలు, కూలి పని చేసుకునేవారిని ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 9లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కెసిఆర్ సర్కారుకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పేదలను, కార్మికులను ఆదుకోవాలని, డాక్టర్ లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఈ నెల 3న దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లకూ వైరస్‌ సోకిందని, రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి మాస్కులు, డ్రెస్ కోడ్ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ఉన్న వారి ఇంటి వద్దకువెళ్లి కరోనా పరీక్షలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం ఇంటికే వస్తువులు సరఫరా చేయాలని, పేదలు, అసంఘటిత కార్మికులకు షెల్టర్ ఏర్పాటు చేయడంతోపాటు ఫ్రీ మీల్స్ అందించాలని పిటిషనర్‌ వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. కేంద్రం ఆదేశాల మేరకు కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై ఏప్రిల్‌ 9న మధ్యంతర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుది నివేదిక ఏప్రిల్ 15 వరకు సమర్పించాలని, విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

వైసిపి నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలు


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని వైసీపీ నాయకుడు ఇంట్లో అధికారులు భారీగా మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే గిద్దలూరు మండలం గండికోటలో ఎక్సైజ్ ఎన్ ఫోర్న్ మెంట్ సోదాలు నిర్వహించారు. గడికోట వైసీపీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ ఇంట్లో భారీగా మద్యం సీసాలు లభించాయి. ఈ ఘటనలో అధికారులు 1200 మద్యం సీసాలు స్వాధీనం, కారు సీజ్ చేశారు.’

ఇటీవల గడికోట ఎంపీటీసీగా శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం . పలుచోట్ల మద్యం భారీగా నిల్వలు ఉన్నాయనే సమాచారంతో దాడులు చేసినట్లు అసిస్టెంట్ కమిషన్ శ్రీనివాస్ తెలిపారు.

కరోనా నిర్ధారణకి పట్టె సమయం.. ఇంతేనా!

ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం పూణే ఇన్స్టిట్యూట్ పై ఆధారపడిన ఏపీ ప్రభుత్వం, ఇక నుండి ఆ అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో వైరల్‌ ల్యాబ్‌ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.కోటి 25 లక్షలతో ఈ ల్యాబ్‌ ను ఏర్పాటు చేశారు. దీంతో వైరస్‌ నిర్ధారణకు 6 గంటల సమయం పట్టనుంది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వైరల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 300 దాటాయి. నిన్నటి వరకు 266గా ఉన్న కరోనా కేసులు కొత్తగా మరో 37 కేసులు పెరిగి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 303గా నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించారు.కర్నూలు జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ మరో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. నెల్లూరు జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులను గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 42 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

సోమవారం కొత్తగా నమోదైన కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే, కర్నూలులో 18, నెల్లూరు 8, పశ్చిమ గోదావరి 5, కడప 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క పాజిటివ్‌ కేసు చొప్పున నమోదైంది. మరోవైపు ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకుని ఆరుగురు డిశ్చార్‌ అయ్యారు. ఇక మొత్తం జిల్లాల వారిగా చూస్తే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అత్యధికంగా కర్నూలు 74లో నమోదు అయ్యాయి.

ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే, నెల్లూరులో 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27, ప్రకాశం 24, పశ్చిమ గోదావరి 21, విశాఖపట్నం 20, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, అనంతపురం 6 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ‍ప్రకటన విడుదల చేసింది.

పాపం పండితే ఇలాంటి వైరస్‌లే వస్తాయి: జేసీ దివాకర్


కరోనా వైరస్‌ను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నాయని, కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లండని జగన్ తెలిసి అన్నాడో లేక తెలియక అన్నాడో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. పాపం బాగా పెరిగినప్పుడు దేవుడు గానీ, ప్రకృతి గాని ఇలాంటిది ఒకటి సృష్టించి కొంత జనాభాను తగ్గిస్తున్నాయని చెప్పారు. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటే కరోనా రాదని చెప్పారు. అందుకోసమే తాడిపత్రి పట్టణాన్ని వదిలి, జూటూరులో ఉన్న తోటలో ఉంటున్నానని జేసీ చెప్పారు. ఇక్కడ పండిన పంటలతో రూ. కోటి వరకూ సంపాదించానన్నారు. తన శేష జీవితం మొత్తం జూటూరులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో గడపాలని ఆశగా ఉందని జేసీ తెలిపారు.

మోడీ మౌనం.. ట్రంప్ సీరియస్!

“మా ఇంటికొస్తే నాకేమి తెస్తావ్.. మీ ఇంటికొస్తే నాకేమి ఇస్తావ్’ అని తెలుగులో ఒక సామెత ఉందిలే.. ప్రస్తుతం అమెరికా పరిస్థితీ అలానే ఉంది. ఒక వైపు యావత్ భూగోళం కరోనా భయంతో అల్లాడిపోతుంటే.. అగ్రరాజ్యం తన వ్యాపార లబ్ది కోసం మరియు తమ దేశంలో కరోనా కట్టడికోసం అనవసరమైన తప్పిదాలు చేయడం గమనార్హం.

అసలు విషయం ఏమిటంటే..అమెరికాలో 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల నిల్వలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇది కరోనా ని నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. అయితే ఈ ఔషధం కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదు. దింతో చాల దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల దిగుమతుల పై ఆంక్షలు విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి. ఈ ఔషదాన్ని ఎగుమతి చేసుకోవాల్సిందింగా అమెరికా, భారత్ ని కోరింది. కానీ ఔషధం కరోనాను ఎదుర్కొంటుందని ఎక్కడా తేలకపోవడతో మోడీ ప్రభుత్వం సందిగ్ధంలో పడి, ఈ ఔషధ దిగుమతుల పై స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. భారత్ మౌనం పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇదే విషయం పై ట్రంఫ్ మాట్లాడుతూ.. “అమెరికా భారత్ మధ్య దౌత్య సంబంధాలకు మించిన స్నేహబంధం ఉందని, ఈ రెండు దేశాల మధ్య స్నేహపూరక వాతావరణం ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ.. తాను ఆశించిన విధంగా భారత్ స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు.

భారత్, ఎందుకని హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల దిగుమతిపై మౌనంగా ఉంది?

ఈ ఔషధం కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదు. ఇప్పటివరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్, కరోనాను ఎదుర్కొంటుందని ఎక్కడా స్పష్టమైన సంకేతాలు రాలేదు. దీనికి తోడు ఈ ఔషధంపై ట్రంప్ మాట్లాడిన తర్వాత ఆ దేశ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అంత్ ఇన్ఫెక్టియస్ డిసీజస్ డైరెక్టర్ డాక్టర్ ఆంధోనీ ఫౌసీ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. డొనాల్డ్ ట్రంప్ కు డాక్టర్ ఫౌసీ అత్యంత విధేయుడు. అయినా సరే డ్రగ్ పై అతన్ని మాట్లాడనించకపోవడానికి కారణం ఏమిటో ఎవరికి తెలియదు. కేవలం వ్యాపార లబ్ధికోసం ఎగుమతి చేస్తున్నారు తప్ప కరోనా ని నియంత్రిస్తుందన్న నమ్మకం లేదు. అందుకే భారత్ ఈ విషయంపై మౌనం వహించింది. ఈ డ్రగ్ ను ఇప్పటికే అమెరికాలో సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు కరోనా రోగులకు కూడా ఇది లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటె.. చైనా నుంచి జర్మనీకి వెళుతున్న 2 లక్షల ఎన్-95 మాస్క్ లున్న విమానాన్ని అమెరికా దొంగిలించిందనే వార్త ఈ నెల 3వ తేదీన కలకలమే రేపింది. బెర్లిన్ పోలీస్ ఫోర్స్ ఈ మాస్క్ లను తమ దేశ అవసరాల కోసం చైనా లో ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ పై వస్తున్న జర్మనీకి వెళుతున్న 2 లక్షల ఎన్-95 మాస్క్ లున్న విమానాన్ని అమెరికా తమ దేశం వైపు మరల్చింది. ఇది సహేతుకమైన పని కాదని జర్మనీ ఖండించింది. జర్మనీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. ప్రపంచంలోనే కరోనా సోకిన నాలుగో అతిపెద్ద దేశంగా జర్మనీ నిలిచింది.

ఈ విధంగా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు, ఆయన వైఖరి ఆ దేశ లాభం తప్ప, ఇతరుల కష్టాన్ని వారు పట్టించుకోవడం లేదనే వాదన అనేక దేశాలలో వినబడతోంది.

డ్రోన్లతో కరోనా కట్టడికి శ్రీకారం


తెలంగాణలో కరోనా కట్టడికి పోలీసులు సాంకేతికను వినియోగిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవున్న ఏరియాల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని కట్టడి చేయనున్నారు. డ్రోన్ల సాంకేతికను వినియోగించుకునేందుకు రాచకొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న బాలాపూర్, పహడీషరీఫ్, మౌలాలి ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా ఉంచుతున్నారు. ఈమేరకు సైయంట్‌ కంపెనీ సహకారంతో రెండు డ్రోన్‌ కెమెరాలను సోమవారం సీపీ మహేష్‌ భగవత్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి పోలీసులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడికి అవసరమైన సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటి ద్వారా కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాల్లో జనాల రద్దీ ఎలా ఉంది..? భౌతిక దూరం పాటిస్తున్నారా..? లేదా? కర్ఫ్యూ సమయంలో మెడికల్‌ దుకాణాలు పని చేస్తున్నాయా..? వ్యాపార సముదాయాలకు అనుమతి లేకున్నా తెరిచి ఉంటే డ్రోన్‌ కెమెరాలతో తెలుసుకోవచ్చన్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించుకొని లాక్డౌన్‌ సమర్థవంతంగా నిర్వహించవచ్చని సీపీ వివరించారు.

ఈ డ్రోన్ల సహాయంతో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సూచనలు అందించవచ్చన్నారు. సరైన నిర్ణయాలను త్వరగా అమలు చేసేందుకు వీలుంటుందని సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు. డ్రోన్ కెమెరాలు ఫొటోలతోపాటు వీడియోలు తీసీ రాచకొండ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పంపిస్తాయని తెలిపారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో బహిరంగ ప్రకటనలు కూడా చేయవచ్చని ఆయన వివరించారు. రాచకొండ పోలీసులు చేస్తున్న వినూత్న ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు. రాచకొండ పోలీసులు దారిలోనే మరిన్ని కమిషనరేట్లు నడిచేలా కన్పిస్తున్నారు.

ఏపీలో దూకుడు తగ్గించిన కరోనా!


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 304 కి పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం సోమవారం సాయంత్రం ఈ రోజు ఉదయం వరకు ఒక్క కేసు మాత్రమే నమోదైందని స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 33, నెల్లూరు జిల్లాలో 42, ప్రకాశం జిల్లాలో 24, కడప జిల్లాలో 27, కృష్ణా జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, విశాఖపట్నం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 74 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 74 నమోదై కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ రోజు కడప జిల్లాలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తరువాతి స్థానంలో నెల్లూరు జిల్లాలో 42 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా, తాజాగా కర్నూలు లో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆరుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళ్లారని అధికారులు చెప్పారు.

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి


కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

రాష్ట్రంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా కరోనా వ్యాధి ప్రబలుతోందన్నారు. ఇప్పటికే 300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల పరిస్థితి దయనీయంగా తయారైందని తెలిపారు. మరో పక్క రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. నిల్వ చేసుకోలేని కూరగాయలు, పండ్లు వంటి పంటలు రైతులు అమ్మకోలేని స్థితి, వినియోగదారునికి అందుబాటులోలేని స్థితి నెలకొందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 7000 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా విపత్తుపై చర్చించేందుకు ప్రధాని సైతం ఈ నెల 8వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ లో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవలని డిమాండ్ చేశారు.

మూడో సంక్రాంతికి రెడీ అంటున్న అనిల్ రావిపూడి

సినిమా రంగంలో వరుస విజయాలు దక్కడం అంత ఈజీ కాదు అలాంటి తరుణం లో తెలుగులో ఇంతవరకు పరాజయం ఎరుగని దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. అన్నివర్గాల ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలో అనిల్ రావిపూడి .సిద్ధహస్తుడు. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడంలోను అందెవేసిన చేయి … గత ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకొంది..

ఇలా రెండు చిత్రాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా ఆయన ‘ఎఫ్ 3’ సినిమా చేయబోతున్నాడు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు . స్పీడ్ గా సినిమాలు తీసే అనిల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఎఫ్ త్రీ సినిమా షూటింగ్ ని కూడా స్పీడ్ గా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట ..

చిరంజీవి ఆత్మ కథకి శ్రీకారం


స్వయం కృషి తో మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. మరీ ముఖ్యంగా సినీ జగత్తులో తమ ఉనికిని బలంగా చాటుకోవాలనుకొనే నటులకు చిరంజీవి అనుభవాలు ఎంతో ఉపయోగ పడతాయనడం లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎన్ టి రామారావు , అక్కినేని నాగేశ్వర రావు, నటశేఖర కృష్ణ ,నటభూషణ శోభన్ బాబు వంటి నటులు తెలుగు తెరను ఏలుతున్న సమయంలో సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి తన ఉనికిని బలంగా చాటుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడిగా, మెగా స్టార్ గా చిరంజీవి ఎదిగారడు .. చిన్న చిన్న పాత్రలతో మొదలైన నట ప్రయాణం, ఆయనను అగ్ర సింహాసనంపై కూర్చోబెట్టింది. నెంబర్ వన్ హీరోగా మార్చింది .

ఇప్పటికే చిరంజీవి నట జీవితం ఫై పలు పుస్తకాలు వచ్చాయి. పసుపులేటి రామారావు , వినాయక రావు వంటి మేటి జర్నలిస్టులు ఆయన చిత్ర జీవితాన్ని నవలీ కరించారు. అయితే ఆత్మకథ రాయాలని ఉందనే విషయాన్నిచిరంజీవి కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే ఆయనకి అంత తీరిక లేకపోవడం వలన, ఆ ఆలోచన వాయిదాపడుతూ వచ్చింది. ఇపుడు లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే విశ్రాంతి తీసు కుంటున్న మెగా స్టార్ చిరంజీవి తన ఆత్మకథను గురించిన ఆలోచనను ఇపుడు ఆచరణలో పెట్టినట్టుగా తెలుస్తోంది . తన సినీ పయనం ఆరంభం నాటి విషయాలు, తొలినాళ్లలో ఎదురైన అనుభవాల లోని మంచి చెడులు , తదితర జ్ఞాపకాలను చిరంజీవి రికార్డు చేస్తున్నారట. త్వరలో ఈ సమాచారాన్ని ఒక రచయితకు ఇచ్చి, తన ఆత్మకథను పుస్తకరూపంలోతీసుకు రావాలి అని చిరంజీవి అనుకొంటున్నట్టు తెలుస్తోంది

ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్.. రెడ్ జోన్ లుగా 7 జిల్లాలు!


కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హై అలెర్ట్ అవుతున్నది. పైగా రాష్ట్రంలో గల 13 జిల్లాలో 7 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం `రెడ్ జోన్’ లుగా ప్రకటించినట్లు తెలియరావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నది. గ్రేటర్ హైదరాబాద్ కాకుండా, తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లు కావడం గమనార్హం.

లాక్‌డౌన్‌ అములలో మరింత కఠింనగా వ్యవహరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన జిల్లాల్లో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం తప్ప కోస్తా జిల్లాలు అన్ని ఉండడం గమనార్హం.

ఈ జిల్లాలపై మరింతగా ద్రుష్టి సారించి, మరిన్ని కఠిన చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు నిలిపివేయాలని, ఆ ప్రాంతాల్లో వైద్యశాఖ బృందాలతో రాపిడ్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. హాట్‌స్పాట్లలో మరింతగా నిఘా పెంచింది.

అలాగే పాజిటివ్‌ వ్యక్తులు ఉన్న ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. బాధితుల ఫోన్‌ నెంబర్లను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వారు ఇంటి నుండి కదిలితే వెంటనే సమాచారం పోలీసుశాఖకు వెళ్లిపో తుంది. క్వారంటైన్లో ఉన్న వారిని పర్యవేక్షించేందుకు హౌస్‌సర్జన్లను నియమిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తులకు నిరంతరం ఫోన్లో కాంటాక్టులో ఉండి వారి కదలికలను అంచనా వేస్తున్నారు.

లాక్‌డన్‌ సడలించినా పాజిటివ్‌ వ్యక్తులు, రెడ్‌జోన్లో ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేశారు. వారు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే దానిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

కొంతమంది క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తు న్నారని ఫిర్యాదులు వస్తుండటంతో నిఘాను పటిష్టం చేశారు. క్వారంటైన్లో ఉంటున్న 20 మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే హాస్టల్‌ వార్డెన్లనూ క్వారంటైన్‌ కేంద్రాల పర్యవేక్షణకు నియమించారు.

పట్టణ ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ఉండటంతో నిత్యావ సరాల వస్తువుల కొనుగోలు సమయాన్ని కుదించారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి వారికి కాంటాక్టులో ఉన్న వారికి పరీక్షలు దాదాపు పూర్తి చేశామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయిలో ర్యాపిడ్‌ సర్వే చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత ఐసోలేషన్‌, క్వారంటైన్లో ఉన్న వారందరూ ఎలా వ్యవహరించాలనే అంశంపై వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు, అధికారులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిం చాలని, క్వారంటైన్లో ఉన్న వారు బయటకు రాకుండా చూడాలని ఆమె సూచించారు.

పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు దగ్గరగా ఉన్న 65 ఏళ్ల పైబడిన వ్యక్తులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలని అధికారులను ఆమె కోరారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని కూడా రెడ్‌జోన్‌, హాట్‌స్పాట్లకు వెళ్లకుండా చూడాలని చెప్పారు.

కరోనా టెస్ట్ రిపోర్ట్ కు ఆరు గంటలు


ప్రస్తుతం ప్రస్తుతం కరోనా టెస్ట్ రిపోర్ట్ రావడానికి ఆరు గంటల సమయం పడుతోందని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. రాష్ట్రంలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషేంట్స్ ముగ్గురు మాత్రమేనాని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 900 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న 6 కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను, అన్ని జిల్లాలో మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలిపారు. కరోనా పరీక్షలకు పడుతున్న సమయాన్ని తగ్గించి గంటన్నరలో టెస్ట్ ఫలితాలు వచ్చే కిట్ల కొనుగోలుకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పదిరోజుల్లో ఇలాంటి 3 లక్షల కిట్లు వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర సేవలు ఆపేయాలని ఎలాంటి అదేశాలు లేవని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అలా చేస్తున్నాయి, దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కోరారు.