
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను తరుచూ విమర్శించే సినీనటీ, తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి లాక్డౌన్ పొడగింపు విషయంలో ఆయనకు సపోర్ట్ చేశారు. ఈమేరకు ‘రాములమ్మ’ సోషల్ మీడియాలో కేసీఆర్ నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు పోస్టు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్డౌన్ కొనసాగింపు మంచిదేనని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మీడియా నిర్వహించి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడారు. భారత్ లాంటి అధిక జనాభా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు లాక్డౌన్ ఉత్తమ మార్గమని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. కేసీఆర్ నిర్ణయంపై రాములమ్మ స్పందించారు. ‘లాక్డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్థిస్తున్నాను’ అంటూ విజయశాంతి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.
అలాగే ఢిల్లీ జమాత్ సమావేశాలకు వెళ్లొచ్చినవారు స్వచ్చంధంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మర్కజ్ ప్రార్థననలకు వెళొచ్చినవారు వివరాలు స్వచ్ఛందంగా తెలియజేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీటిని దృష్టిలో ఉంచుకొని అలాంటివాళ్లు తమంతా తాము వివరాలను వెల్లడించాలని కోరారు. ఇది ఆయా వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా లాక్డౌన్ కొనసాగిస్తేనే మంచిదని ఎక్కువమంది అభిప్రాయం కన్పిస్తుంది. కేసీఆర్ ఈమేరకు ప్రధాని మోదీకి లాక్డౌన్ కొనసాగించాలని కోరనున్నట్లు తెలిపారు. కేంద్రం లాక్డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..