Home Blog Page 8517

సీఎం ఫొటోకు వంగి, వంగి దండాలు!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చర్యలు రోజు రోజుకూ వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోకి కొందరు క్రమ పద్ధతిలో నిలబడి వంగి, వంగి దండాలు పెడుతున్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనం ఇండియాలో ఉన్నామా…ఉత్తర కొరియా, ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే విజయనగరం జిలా నెల్లిమరలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ వాలంటీర్లు అందరికీ కరోనా నేపథ్యంలో బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయంలో పనిచేస్తోన్న వాలంటీర్లు అందరితో అక్కడి వైసిపి నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోకు వంగి, వంగి దండాలు పెట్టించారు. ఈ సంఘటనను ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు తప్పుబట్టారు.

https://www.facebook.com/KidariSravanKumarOfficial/videos/516477759019840/

ఆ వీడియోలు డీజీపీ అందించాం..!


రాష్ట్రంలో కార్మికులు, కూలీలు అందరూ ఆకలితో అలమటిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం పబ్లిసిటీ పిచ్చితో తిరుగుతున్నారని, ప్రజలకి కరోనా సోకడానికి కారణమవుతున్నారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి వీడియోలను తాము డీజీపీకి ఇచ్చామన్నారు. ఏపీలో ఒక్క రోజులో 61 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపారు. వైసీపీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టొద్దని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం సొంతంగా ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టలేదని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి ఇచ్చిన రూ.1000లో కూడా సగం కొట్టేశారని అన్నారు. శనగల పంపిణీలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పారు.

కేరళలో సమర్థవంతంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 13 రకాల నిత్యావసర సరుకులు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటింటికీ పంపారని తెలిపారు. ఏపీలో మాత్రం మాటలు తప్ప పనులు లేవని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే ర్యాలీ చేపట్టడంతో అక్కడ ప్రభుత్వ అధికారులకు కూడా కరోనా వచ్చిందన్నారు. ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పారు.

మన ముఖ్యమంత్రి తాడేపల్లిలో తన ఇంట్లోనే కూర్చుంటున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, ప్రధాని మోదీ నుంచి మేధావుల వరకు అందరితో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రోజా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. వైసీపీ నేతలకు చట్టాల మీద అవగాహన లేదని, ఇతర రాష్ట్రాల్లో ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడాలని చెప్పారు. పుచ్చిపోయిన కందులు వంటి సరుకులను అందిస్తున్నారని చెప్పారు.

శ్రీకాళహస్తికి నాలుగు లాక్ లు!

ఇటీవల శ్రీకాళహస్తి పట్టణంలో ఆ ప్రాంతపు ఎమ్మెల్యే  (వైసీపీ) బియ్యపు మధుసూదన్ రెడ్డి, ట్రాక్టర్లలో పెద్ద పెద్ద ఫోటోలు, హోర్డింగ్ లు పెట్టి కరోనా బాధితులకు బియ్యం పంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ శ్రీకాళహస్తి పట్టణం మొత్తం రెడ్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లింది. ఇతర గ్రామాల నుండి ఒక్కరు కూడా శ్రీకాళహస్తి కి రాకూడదు, పట్టణం నుండి ఎవరు బయటకు వెళ్లకూడదనే  రూల్ ఖచ్చితంగా అమలుచేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి వెలుపలికి రాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇళ్లలో కూడా భౌతికదూరం పాటించాలని సూచించారు.

హస్తిలో తాజాగా 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా మొత్తంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 73కు చేరింది. అందులో అత్యధిక కేసులు శ్రీకాళహస్తిలో నమోదయ్యాయి. నిత్యావసర సరుకులు అవసరమైన వారికి వలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేయిస్తున్నారు. ఈక్రమంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో హైపవర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నుంచి ఉద్యోగుల రాకపోకలను నిషేధించామన్నారు. మే 3 వరకు ఎలాంటి సడలింపులు లేకుండా లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. కేవలం 35వార్డులు ఉన్న పట్టణంలో ఇన్ని కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. 14రోజులపాటు కొత్త కేసులు నమోదు కాకుంటే ఆరెంజ్‌ జోన్‌ గా ప్రకటిస్తామని చెప్పారు.  కోవిడ్‌–19 ప్రత్యేకాధికారిగా సునీల్‌కుమార్‌రెడ్డిని ప్రభు త్వం నియమించిందని తెలిపారు.

శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్‌ జోన్‌ గా ప్రకటించిన నేపథ్యంలో  గురు వారం రాత్రి అధికారులు వాహనాల తో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ప్రజల ను అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తితో పాటు తిరుపతి, నగరి, పలమనేరు, రేణిగుంట, ఏర్పేడు,  చంద్రగిరి, నిండ్ర, వడమాలపేట, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పుత్తూరు, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో కొత్త కేసులు నమోదు కావడంతో వాటిని కూడా రెడ్‌ జోన్లుగా ప్రకటించామని కలెక్టర్‌ వెల్లడించారు.

నయతార షాకింగ్ నిర్ణయం.. ఏంటంటే?


సౌత్ క్వీన్ నయనతార సంచలనం నిర్ణయం తీసుకుంది. లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. ఆమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు పడిగాపులు కాస్తుంటారు. దీంతో ఆమె పెట్టే కండీషన్లకు దర్శక, నిర్మాతలు ఓకే చెబుతుంటారు. సినిమా డేట్ల విషయంలో నయన్ ఖచ్చితంగా ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో సినిమా ప్రమోషన్లో పాల్గొన్న నయనతార ఆ తర్వాత సినిమా ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఈ విషయంలో ఆమె దర్శక, నిర్మాత మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న సంగతి తెల్సిందే. అయితే నయనతార తాజాగా తన సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా న‌య‌నతార ఓ మ‌ల‌యాళ చిత్రంలో న‌టిస్తుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో తాను పాల్గొంటాన‌ని స‌ద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో న‌య‌న మల్టిషెడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించనుందని సమాచారం. దక్షిణాదిలో పలు సినిమాల్లో నయనతార నటిస్తూ బీజీగా ఉంది. ఇప్పటివరకు ఆమె సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోయినప్పటికీ నయనతార నటించిన చిత్రాలు విజయవంతం అవుతుండటంతో దర్మక, నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.

ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించిన దర్బార్, విజయ్ తో నటించిన ‘విజిల్’, మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘సైరా’ చిత్రం ప్రమోషన్లలో కూడా ఆమె పాల్గొనకపోవడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. నయనతార ‘సైరా’ ప్రమోషన్లలో పాల్గొనకపోవడంతో చిరంజీవి ఆమెను ఇన్ డైరెక్టర్ గా టార్గెట్ చేశాడు. సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నాను పొడుగుతూ నయనతారను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి నయనతార తన నిర్ణయాలపై సమీక్షించుకుంటోంది. తాజాగా ఆమె ఓ మలయాళ చిత్ర ప్రమోషన్లలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఎమ్మెల్యే ఆధిపత్యంతో కరోనా హాట్ బెడ్ గా కర్నూల్


కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం, ఒక విధంగా అధికార యంత్రాంగం చేతులు ఎత్తివేయడం, రాష్ట్ర ప్రభుత్వం సహితం నిస్సహాయంగా కనిపించడానికి అడ్డు అదుపు లేని స్థానిక ఎమ్యెల్యే ఆధిపత్యమే కారణమనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. రాజకీయ వత్తిడుల కారణంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం ఏమీ చేయలేక పోతున్నారని కధనాలు వెలువడుతున్నాయి.

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కు చేరుకోగా, కర్నూల్ జిల్లాలోనే 261 ఉన్నాయి. కర్నూల్ నగరం అంతా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఎమ్యెల్యే మద్దతు గల ఒక ప్రైవేట్ ఆసుపత్రి లాక్ డౌన్ సమయంలో కూడా యద్దేచ్ఛగా పనిచేయడంతో అది వైరస్ వ్యాప్తి కేంద్రంగా మారినట్లు స్పష్టం అవుతున్నది. చివరకు ఆ డాక్టర్ కూడా వైరస్ కు గురయ్యారు.

ప్రభుత్వ `నేరమయ నిర్లక్ష్యమే’ కుర్నూల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణం అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తక్షణం ఉన్నతస్థాయి విచారణ జరపాలని లీగల్ రైట్స్ ఆబ్సెర్వేటరీ డిమాండ్ చేసింది.

అధికార యంత్రాంగంపై కర్నూల్ ఎమ్యెల్యే హఫీజ్ ఖాన్ రాజకీయ వత్తిడులే ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పడానికి కారణం అంటూ ఈ సంస్థ మీడియా కథనాలను ఉటంకించింది.

ఢిల్లీలో తబ్లీఘి జమాత్ మర్కజ్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేయనీయకుండా ఈ ఎమ్యెల్యే అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు చెలరేగాయి. పైగా స్వీయ నిర్బంధ కేంద్రాలకు వెళ్లి, వారితో ఎమ్యెల్యే యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు ఛాతి నొప్పిగా చికిత్సఅంటూ ఆ వార్డ్ లో చికిత్స అందించితిన్ వ్యక్తికి సోదకడంతో చికిత్స అందించిన ఆ వార్డ్ లోని వైద్య సిబ్బంది అంతా భయకంపితులయ్యారు.

ఇలా ఉండగా, ఒక ప్రార్ధన స్థలంలో పెద్ద సంఖ్యలో అపరిచుతులు గుమికూడడంతో స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే మరుసటి రోజుకంతా వారందరిని ఖాళీ చేయించి, అక్కడ అపరిచితులు గుర్మికుడినట్లు కధనాలు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి, వేధించారు. వాస్తవాలు చెప్పిన వారిపై జిల్లా యంత్రంగం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది.

ఆ ప్రైవేట్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసిన డా. ఇస్మాయిల్ హుస్సేన్ ఏప్రిల్ 14న మృతి చెందాడు. మీడియా కధనాల ప్రకారం అతని కుటుంబానికిచెందిన ఆరుగురికు కూడా కరోనా పాజిటివ్ అని గుర్తించారు. వారందరిని స్వీయ నిర్బంధానికి పంపారు. ఏప్రిల్ 16న జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో ఆ ఆసుపత్రిని మార్చ్ 20 నుండి ఏప్రిల్ 16 వరకు సందర్శించిన వారందరిని వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోమని కోరింది.

ఈ ఆసుపత్రికి సందర్శించిన పొరుగున ఉన్న తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో కూడా చాలామంది కరోనా వైరస్ కు గురి కావడం గమనార్హం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఎందుకని లాక్ డౌన్ లో సహితం పనిచేయనిచ్చి, కరోనా వ్యాప్తికి దోహదపడ్డారో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ వత్తిడులే కారణం అని స్పష్టం అవుతుంది.

సీఎం అన్న బ్రాంతిలోనే చంద్రబాబు!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. విజన్ 2020 పేరుతో డప్పు కొట్టుకున్న బాబు రాష్ట్రంలో కనీసం 4 లేక 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉంటే కోవిడ్ నేపథ్యంలో ఎంతో ఊరట దొరికేదని ట్వీట్ చేశారు.

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ల సోది తప్ప ఊడబొడిచిందేమీ లేదని పేర్కొన్నారు. దోచుకునే ఛాన్స్ లేదని మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గాలికి వదిలేశాడన్నారు. తాను ఇప్పటికి సిఎం ఉన్నట్లుగా ఊహించుకుంటూ, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రాంతిలో బాబు మునిగి తేలుతున్నాడట అని వెల్లడించారు. సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహుకరించారని అంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రానిధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపి దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. WHO కూడా ఆరా తీస్తోందని ట్వీట్ చేశారు.

మహిళలకు జగన్ గుడ్ న్యూస్!

ఒకవైపు ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది, మరోవైపు సీఎం జగన్ మహిళలకు రెండు శుభవార్తలు చెప్పారు. ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. జులై 8 వైఎస్సార్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

“వైఎస్సార్‌ సున్నా వడ్డీ” పథకం ద్వారా 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడుతూ… 2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయిందని, కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సున్నా వడ్డీ పథకం ప్రారంభించామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మేలు జరుగుతుందన్నారు. జులై 8 వైఎస్సార్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. ‘

అంతేకాకుండా దిశ చట్టానికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారనే ఆశాభావాన్ని జగన్ వ్యక్తం చేశారు.వసతి దీవెన కింద 12 లక్షల మందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలల సంబంధించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా తల్లుల అకౌంట్‌ల్లో జమ చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు.

సర్పంచ్ లతో మోదీ ఏం మాట్లాడారంటే?


దేశం నుంచి కరోనా మహమ్మరి తరిమికొట్టేందుకు సర్పంచులు చేస్తున్న కృషి భారత ప్రధాని కొనియాడారు. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ సర్పంచ్ లకు పలు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధిలో తీసుకోవాల్సిన అంశాలపై వారితో చర్చించారు. అదేవిధంగా గ్రామాల్లో కరోనా కట్టడికి సర్పంచులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశాభివృద్ధిలో గ్రామాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అలాగే గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు లక్షా 15వేల గ్రామ పంచాయతీల్లో బ్రాండ్‌బ్యాండ్ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యాన్ని పక్బంధీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. ఈ-గ్రామ్ స్వరాజ్ కింద బ్యాంకు రుణాలను సులభంగా పొందవచ్చని తెలిపారు. అలాగే కరోనా వైరస్ ఎన్నో పాఠాలను నేర్పిందని ఆయన తెలిపారు. సర్పంచులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

శృతిమించిన కరోనా.. కళ తప్పిన రంజాన్!

ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ రంజాన్. కరోనా దెబ్బతో ప్రతి ఏటా జరుపుకునే విధంగా ఈ సంవత్సరం రంజాన్ వేడుకలు జరుపుకోలేరు. మసీదు లలో ప్రార్ధనలు, ఇఫ్తార్‌ విందులు, వస్త్రాలు, హోటళ్లు, అత్తరు పరిమళాలు, లాడ్‌ బజార్‌ గాజుల గలగలలు ఈ ఏడు ముగ బోయాయి.హలీం తినాలన్నా..ఇఫ్తార్‌ విందుల చేయాలన్నా మ‌రో ఏడాది ఆగాల్సిందే.

ఈ సంవత్సరం కోవిడ్‌19 ఎఫెక్ట్‌ తో హైద‌రాబాద్‌ లో రంజాన్ సంద‌ర్భంగా జ‌రిగే వ్యాపారం పూర్తిగా బంద్ అయింది. దేశంలోనే భాగ్యనగరంలో రంజాన్‌ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ముస్లింలు ప్రతి ఏటా ఈ పండుగను నెల రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. దీనికి తగ్గట్లుగానే రంజాన్‌ మార్కెట్‌ భారీగా ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో దాదాపురూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఒక అంచన. కానీ ఈ ఏడాది కోవిడ్‌ మహమ్మారి కారణంగా చరిత్రలోనే తొలిసారిగా రంజాన్‌ మార్కెట్‌ స్తంభించింది. పాతబస్తీలోని పటేల్‌ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్‌ గంజ్, ఘాన్సీబజార్, చార్‌ కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్‌ గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలన్నీ దెబ్బతిననున్నాయి. రంజాన్‌ మార్కెట్‌ లో ప్రతి ఏడాది వస్త్ర వ్యాపారాలు 3 వేల కోట్ల రూపాయలు జరుగుతాయని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. మక్కా మసీదు, లాడ్‌ బజార్, చార్‌ కమాన్, గుల్జార్‌ హౌజ్, పత్తర్‌ గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ, శంషీర్‌ గంజ్‌ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోనున్నాయి.

అదేవిధంగా రంజాన్ మాసంలో మాత్ర‌మే దొరికే హ‌లీమ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఉండ‌రు. చాలామంది హ‌లీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు హ‌లీం తిందామా అని కూడా వెయిట్ చేస్తుంటారు.అంతేకాకుండా రంజాన్ మాసంలో స‌మయంలో త‌ప్ప‌కుండా తినాలనిపించే ఆహార‌ప‌దార్థాలు చాలా ఉన్నాయి. హ‌లీం, ఖుర్బానీ కా మీఠా, డ‌బుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, ద‌హీవ‌డ ప్ర‌ధాన‌మైన‌వి. ఈ సంవ‌త్స‌రం రంజాన్ సంద‌ర్భంగా ఏ హోట‌ల్ లోనూ హ‌లీం త‌యారు చేయ‌రాద‌ని హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ నిర్ణ‌యం తీసుకుంది. ప్రతి రంజాన్ సీజన్‌ లో ఒక్క హైదరాబాద్‌.లోనే రూ.1200 కోట్ల మేర హలీం అమ్మకాలు జరుగతాయని అంచనా. ఇక్కడి నుంచి హలీం రుచులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ మార్కెట్ అంతా స్థంభించిపోయింది.

లాడ్‌ బజార్‌ గాజుల గలగలలు,ఆంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన జానిమాజ్‌ ఎగ్జిబిషన్‌, అత్తర్‌ గుబాళింపులు, రుచికరమైన సెమియా, ఖుర్బానీ కా మీఠా, డ‌బుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, ద‌హీవ‌డ రుచులు, చికెన్, మటన్, బీఫ్‌, ఒంటె… మాంసాల‌తో తయారు చేసే హలీంలు, పాతబస్తీలోని పటేల్‌ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్‌ గంజ్, ఘాన్సీబజార్, చార్‌ కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్‌ గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్తు, వస్త్రాల కొనుగోలు ఇత్యాది కార్యాలకు కరోనా బ్రేక్ వేసింది. దింతో రంజాన్ కళ తప్పింది. 2021లో ఈ రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు బహుఘనంగా జరుపుకోవాలని ఆశిద్దాం..

పంచాయితీ కార్యాలయాలకు రంగులు ఖరారు!


రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, పంచాయితీ కార్యాలయాలకు ఇతర కట్టడాలకు వేసే రంగుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తోన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గ్రామ పంచాయితీ కార్యాలయాలకు మట్టి రంగుతో పాటు తెలుపు, నీలం, ఆకుపచ్చని రంగులు వేయాల్సిందిగా సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా నాలుగు రంగులకు అర్ధాలు చెబుతూ ఉత్తర్వులలో వీటి అర్ధాలను వివరించింది. మట్టిని సూచిస్తూ టెర్రకోట రంగు, పాడి పంటలకు సూచనగా ఆకుపచ్చ, నీలి విప్లవానికి సూచనగా నీలం రంగు, పాల విప్లవానికి సూచనగా తెలుపు రంగులు వేయాల్సిందిగా కమిటీ సూచించినట్లు పేర్కొంది. ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు, భవనాలకు జాతీయ బిల్డింగ్ కోడ్ మేరకు ఈ రంగులు వేయాల్సిందిగా సూచనలు ఇచ్చింది.

ప్రభుత్వ భవనాలపై ఏ రాజకీయ పార్టీకి చెందిన చిహ్నాలు, రంగులు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.ప్రతీ ప్రభుత్వ విభాగం, స్థానిక సంస్థలు ఇతర ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించిన రంగును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు పంచాయతీలకు వైసీపీ రంగులు వేయడంపై దాఖలు చేసిన పిటీషన్ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణ అనంతరం ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. రంగులు తొలగించేందుకు 4 వారాలు ప్రభుత్వం గడువు అడిగితే మూడు వారాల గడువు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వేయాలిసిన రంగులకు సంబంధించి నియమించిన కమిటీ సూచనల మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

రాజధాని తరలింపుపై జగన్ కు ఎదురుదెబ్బ


ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా మహమ్మారిని సహితం లెక్క చేయకుండా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేడు హై కోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది. స్వయంగా రాష్త్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రాష్ట్ర హై కోర్ట్ ముందు ఇప్పట్లో రాజధాని తరలింపు చేయబోమని హామీ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.

రాజధానిని విశాఖపట్నంకు తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని అంటూ వైసిపి ఎంపీ వి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వాఖ్యాలను హై కోర్ట్ తీవ్రంగా పరిగణించడంతో ఈ విధమైన భరోసా ఇవ్వవలసి వచ్చింది. రాజధాని తరలింపుపై జేఏసీ హైకోర్టులో వేసిన ప్రజావాయిజా పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ పరిణామం జరిగింది.

ఒక వంక ఈ అంశం హైకోర్టు పరిశీలనలో ఉండగానే రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్‌ కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. దానితో రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు పాస్‌ అవ్వకుండా రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏజీ హైకోర్టుకు హామీ ఇచ్చారు.

ఇదే విషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రమాణపత్రం దాఖలుకు 10 రోజుల సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో హైకోర్టు 10 రోజుల గడువిచ్చింది.

కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది.

గాంధీ ఆస్పత్రిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు


తెలంగాణలోని కోవిడ్-19 ఆసుప్రతిగా వినియోగిస్తున్న గాంధీ ఆస్పత్రి కన్నా జైలే బెటరని ఎంఐఎం నేత, అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కరోనాకు సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిపై విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నరోగులు తనకు అక్కడ వాళ్లు పడిన ఇబ్బందులు తెలియజేశారని చెప్పారు. ఆస్పత్రిలో పారిశుధ్యలోపం ఉందని, రోగులకు మందుల పంపిణీ సరిగా ఉందని, పేషంట్లకు ఇచ్చే ఆహారం అధ్వానంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు అక్బరుద్దీన్ తెలిపారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రజలకే కేవలం అవగాహన కల్పిస్తేనే సరిపోదని విమర్శించారు. వైద్యసేవలందించే ఆస్పతుల్లో సరైన సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారని కానీ ప్రభుత్వం మాత్రం ఆస్పత్రుల్లో పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. సెక్రటేరియట్‌లోని కరోనా అనుమానితుల కోసం క్వారంటైన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టెస్టులు సంఖ్య కూడా పెంచాలని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా స్థానిక ఆస్పత్రుల్లో ఓపి సేవలను పునరుద్ధరించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. పెండింగ్‌లోని ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి.. పరిస్థితులు దిగజారితే ఓవైసీ గ్రూప్స్ ఆస్పత్రులు, వైద్య సిబ్బంది సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..!

కొనసాగుతున్న బండి సంజయ్ ఉపవాస దీక్ష


రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. రైతులకు సంఘీభావం బండి సంజయ్ ఒకరోజు ఉపవాస దీక్ష చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆయన నాంపెల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపవాస దీక్ష చేపడుతున్నారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా పేరుతో రైతుల సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు 30వేల కోట్లు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం జరగడం లేదన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసే వారు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వమే ప్రతీ గింజ కొంటామని చెబుతున్నా జాప్యం చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదన్నారు.

రైతుల సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపట్టినట్లు బండి సంజయ్ ప్రకటించారు. ఈమేరకు నేడు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు పూనుకున్నారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులందరు ఇంట్లోనే ఉపవాస దీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యుత్సాహంతో బీజేపీ శ్రేణులు రోడ్లేక్కద్దని, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. బండి సంజయ్ ఉపవాస దీక్షకు పూనుకోవడం బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో చంద్రబాబుకు స్థానం లేదు!


ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారని, ఆయనకు ఎపి రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో పొరపాటుగా టిడిపికి 23 అసెంబ్లీ, 3 ఎంపి స్థానాలు వచ్చాయని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు పార్టీకి ఇకపై అవి కూడా రావని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వుండదన్నారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని, హైదరాబాద్ లోని ఇంటిలో కూర్చుని బయటకు రాకుండా బాబు మాట్లాడుతున్నాడని చెప్పారు.

కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేత కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రతిపక్ష నేతగా జవాబు చెప్పాలన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

కానీ రాష్ట్రప్రభుత్వం చేసే ప్రతి పనిని బాబు బూతద్దంలో తప్పుగా చూస్తు విమర్శలు చేస్తున్నాడని తెలిపారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా కరోనా సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.

కోవిడ్ నేపథ్యంలో కేవలం నాలుగు వారాల్లో తొమ్మిది ల్యాబ్ లను ఏర్పాటు చేశామని, దేశంలో సగటు పరీక్షల కన్నా మూడు రెట్లు అంటే రోజుకు 961 టెస్ట్ లు చేస్తున్నాట్లు చెప్పారు. కోవిడ్ అనుమానిత వైద్య పరీక్షలు చేయడంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 7,900 మంది క్వారంటైన్ లో వున్నారని, వారికి అన్ని వసతులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం సీఎం టెలిమెడిసిన్ ను ప్రారంభించారని తెలిపారు. 14400 నెంబర్ కు మిస్ట్ కాల్ చేస్తే చాలు వైద్యులు వైద్య సహాయం కోసం అందుబాటులోకి వస్తారన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,034 మందికి కోవిడ్ పరీక్షలు చేశామని,

ముఖ్యమంత్రి ముందుచూపుతో ఇతర దేశాల నుంచి ర్యాపిడ్ కిట్ లను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారని తెలిపారు. చివరికి దీనిపైన కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాకులు, చెవాకులు మాట్లాడాడన్నారు. ఐసిఎంఆర్ అనుమతితో జరుగుతున్న పరీక్షలపైన కూడా విమర్శలు చేయడం దారుణమని, రాష్ట్ర ప్రజలకు వరప్రదాయినిగా ర్యాపిడ్ టెస్ట్ లతో కోవిడ్ ను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోందని చెప్పారు. చంద్రబాబు కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయాలకు తావిస్తూ విమర్శలు చేస్తున్నాడని తెలిపారు.

పేరు గొప్ప వూరు దిబ్బ


తెలుగు సినిమా రంగం లో తిరుగు లేని దర్శకుడు, అపజయం అన్నది ఎరుగడు ..అందుకే ఆయన సంపాదన కూడా ఆయన చిత్రాల్లా భారీగానే ఉంటుంది..ఆయన సంపాదన అంతా సినీ పరిశ్రమ నుంచి వచ్చిందే …. కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకొంటాడు అని గొప్పగా చెప్పేవారు మొన్నటిదాకా ….ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే … ఒక పక్క కరోనా లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ లో కార్మికులు పస్తులతో అల్లాడుతుంటే ఆయనకు ఇసుమంతైనా జాలి కలుగ లేదు .తెలుగు సినీ కార్మికుల సహాయార్థం సినీ పరిశ్రమ లోని పెద్దలంతా తమకు తోచిన రీతిలో సాయం చేస్తుంటే … ఈయన గారు సినిమా పరిశ్రమతో నాకేమి సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం చూస్తుంటే పేరు గొప్ప వూరు దిబ్బ అన్న సామెత గుర్తొస్తుంది అందరికీ ..

అదలావుంటే సదరు దర్శకుడు గారు టైం పాస్ ఛాలెంజ్ లతో హీరోలకు ఛాలెంజ్ లు విసురుతూ విరాళాల విషయంలో తనపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టిస్తున్నాడని సినీ కార్మికులు అంటున్నారు. ఇది చాలదన్నట్టు మీడియా లో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాకు ప్రమోషన్ చేసు కుంటున్నాడు.శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ అన్నట్టు ” నా వూరు నాకు చాలా ఇచ్చింది తిరిగి ఇవ్వకపోతే .లావెక్కి పోతాను ” అన్న డైలాగ్ ఈ పెద్ద మనిషి కి వర్తించదా అని సినీ జనాలు ఆడిపోసు కొంటున్నారు .

లాక్ డౌన్ వేళా ఇంట్లో పనులు చేస్తూ దానికి ఛాలెంజ్ అని సదరు దర్శకుడు నానా హంగామా చేయడం ద్వారా విరాళాల విషయం పక్కదోవ పట్టించాడని అంతా అంటున్నారు. నేడున్న పరిస్థితుల్లో సమాజంలో 90 శాతం మందికి పైగా ప్రజలు తమ పనులు తామే చేసుకొంటున్నారు . అందులో విశేషం ఏమీ లేదు. ఇంతకీ ఆ జగత్విఖ్యాత దర్శకుడు సినీ పరిశ్రమకు చేయాలనుకొంటున్న మేలు ఏమిటీ ? అది తేలిస్తే బాగుంటుంది.

నక్సలైట్ గా మారనున్న ప్రియమణి


మనకున్న మంచి నటీమణుల్లో ప్రియమణి ఒకరు. .జాతీయ ఉత్తమ నటి గా పురస్కారం అందుకొన్న ప్రియమణి ఈ మధ్య తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించింది .2016 లో చివరి సారిగా ` మనవూరి రామాయణం ` చిత్రం లోకనిపించిన ఈమె ఇపుడు రెండు తెలుగు సినిమాల్లో దర్శనమివ్వ బోతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న అసురన్ రీమేక్ `నారప్ప`చిత్రం లో నటించడం తో పాటు మరో తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమౌతోంది . రానా దగ్గుబాటి , సాయి పల్లవి కల్సి నటిస్తున్న “విరాట పర్వం1992 ” అనే పిరియాడికల్ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం లాక్ డౌన్ తీసేయగానే మిగతా భాగం పూర్తి చేయబోతోంది.

ఏపీలో అదుపు గాని వైరస్… కేంద్రం సీరియస్

తాజాగా ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘ విరాట పర్వం 1992 ` చిత్రం గురించి చెబుతూ ఇందులో తాను నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్టుగా తెలిపింది పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందు తున్న ఈ చిత్రం 1992 ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనలతో , నక్సలిజం నేపధ్యం లో సాగుతుంది. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం లో రూపొందు తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి , సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా లాక్ డౌన్ పరిస్థితులు అన్ని చక్కబడ్డాక ఈ సంవత్సరం ద్వితీయార్ధం లో ఈ సినిమా విడుదల కానుంది .

ఆర్మీ జవానుకు కరోనా.. జనగామలో కలకలం..


తెలంగాణలోని జనగామ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆర్మీలో పనిచేసే జనగామ జిల్లాకు చెందిన వ్యక్తికి తాజాగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గత వారంరోజులుగా ఆర్మీ జవాను కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన స్థానికులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది మూడురోజుల క్రితం అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా గురువారం రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని అతడిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కొద్దిరోజుల క్రితమే ఆర్మీజవాను ఢిల్లీ నుంచి స్వస్థలమైన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి బయలుదేరాడు. నెలరోజుల క్రితం ఇండినేషన్లు రామగుండానికి వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లోనే ఆర్మీ జవాను వచ్చినట్లు తెలుస్తోంది. ఇండోనేషియన్లు కరీంనగర్లో పర్యటించడంతో ఆ ప్రాంతంలో కరోనా సోకినా సంగతి తెల్సిందే. అయితే ఈ సంఘటన జరిగిన నెలరోజులకు జవానుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అయితే ఇతడికి ట్రైన్ జర్నీలో కరోనా సోకిందా? లేక స్థానికుల నుంచి కరోనా సోకిందా? అనే తేలాల్సి ఉంది. కరోనా పాజిటివ్ రావడంతో జనగామ జిల్లాలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.