Home Blog Page 8518

కరోనా కాలంలో..రంజాన్ మాసం..జాగ్రత్త!

కరోనా సంక్షోభ సమయంలో ఈ రోజు (ఏప్రిల్ 24) నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు ఇళ్ల‌లోనే ఉండి జరుపుకోవాలని పలువురు ముస్లిం పెద్దలు సలహాలిస్తున్నారు. “ముస్లిం సోద‌రులంతా ఈ ఏడాది ప్రార్థనలను, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని” కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ప్రతిఒక్కరు లాక్‌ డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఆయన కోరిన‌ట్లు చెప్పారు. వారితో తాను స్వయంగా మాట్లాడానని నఖ్వి పేర్కొన్నారు.

సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా మసీదులు మరియు మతానికి సంబంధించిన‌ ప్రదేశాలలో జరిగే కార్యక్రమాలను కూడా నిషేధించాయని నఖ్వీ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందరికీ హాని జరుగుతుందని, కరోనా వైరస్‌ ను తరిమికొట్టేందుకు అధికార యంత్రాగం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను విధిగా పాటించాలని కేంద్ర మంత్రి కోరారు.

కార్పొరేట్ రంగానికి భారీ ప్యాకేజి హులక్!


లాక్ డౌన్ తో జీవనోపాధి కోల్పోయిన పేద వర్గాలకు గత నెల కేంద్రం ప్రకటించిన రూ 1.70 లక్షల కోట్ల ప్యాకేజి తరహాలో కార్పొరేట్ రంగం సహితం భారీ ప్యాకేజి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం వైపు చూస్తున్నది. ఈ విషయమై భారీ కోర్కెల చట్టాలను సహితం ప్రభుత్వానికి సమర్పించాయి.

అయితే కేంద్రం ఆ దిశలో ఆలోచనలు చేయడం లేదని తెలుస్తున్నది. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పరిశ్రమలను మళ్లీ తెరిపించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కార్పొరేట్ వర్గాలు ఎదురు చూస్తున్న భారీ ప్యాకేజీ లభించే అవకాశాలు లేవని తెలుస్తున్నది.

అమెరికా, ఐరోపా‌ దేశాల మాదిరిగా మనదేశంలో భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావించటంలేదని, మధ్యస్థాయి ప్యాకేజీలు రూపొందించాలని భావిస్తున్నదని ఆర్థిక మంత్రికి ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దశలో విస్తృతమైన వనరులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.

అయితే బ్యాంకుల నుండి రుణాల విషయంలో మాత్రం ఇప్పటికే కొంత వెసులుబాటు కల్పించింది. రుణాల చెల్లింపులో కొంత ఉదారంగా ఉండమని బ్యాంకు లకు సూచించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా దివాలా చట్టం (ఐబీసీ) నిబంధనలను కేంద్రం సవరిస్తున్నట్లు తెలిసింది.

ఒక ఏడాది వరకు ఈ చట్టం అమలును నిలుపుదల చేయాలని నిర్ణయించింది. దీంతో రుణ ఎగవేతదారులపై దివాలా ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్లు కాగలదు. ఇందులో భాగంగానే సెక్షన్‌ 7, 9, 10 నిబంధనలను 6 నెలలపాటు సస్పెండ్‌ చేయనున్నట్లు చెబుతున్నారు.

ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేయనుందని చెబుతున్నారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇందు కోసం నిర్ణయం కూడా తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

ఐబీసీ నిబంధనల సవరణతో కార్పొరేట్లకు బ్యాంకులు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేందుకూ అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తీలను 90 రోజులకు మించి చెల్లించకపోయినైట్లెతే సదరు రుణగ్రహీతలను రుణదాతలు దివాలా ప్రక్రియకు లాగవచ్చు.

తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన హీరో


కరోనా మానవాళిపై చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. కన్న వారిని కడచూపు చూసుకొనే భాగ్యానికి కూడా నోచుకోనివ్వడం లేదు. బాలీవుడ్ సీనియర్ హీరో, డిస్కో డాన్సర్ ఫేమ్ మిథున్ చక్రవర్తి తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కావాలనుకొంటే లాక్ డౌన్ అడ్డం వచ్చింది . దాంతో తండ్రి అంత్యక్రియలకు మిథున్ చక్రవర్తి వెళ్ళ లేని పరిస్థితి ఏర్పడింది. మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి మంగళవారం అర్దరాత్రి మరణించారు. 95 ఏళ్ల బసంత్ కుమార్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దాంతో ఈ విషయాన్ని బసంత్ కుమార్ చిన్న కొడుకు అయిన నిమాషి చక్రవర్తి అన్నయ్య మిథున్ చక్రవర్తి కి తెలియ జేశాడు. కానీ మిథున్ చక్రవర్తి కడసారి చూపుకి నోచుకోలేక పోయాడు .

గత కొంత కాలంగా మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ముంబై హాస్పిటల్ చికిత్స పొందుతుండగా, మిథున్ చక్రవర్తి షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్లి లాక్‌డౌన్ కారణంగా బెంగళూర్ లో ఇరుక్కు పోయి తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేక పోయాడట ….దాంతో తమ్ముడు నిమాషి చక్రవర్తి అన్న మిథున్ చక్రవర్తి స్థానంలో తండ్రి కర్మకాండలు చేయాల్సి వచ్చింది .

ఇన్ డోర్ షూటింగ్ కి సిద్దమౌతున్న ఆచార్య


కరోనా ప్రభావం రోజు రోజుకి తీవ్రమౌతున్న తరుణం లో సినిమా రంగం పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన సినీ పెద్దల్లో చర్చనీయాంశం అవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకొన్న సినిమాలది  ఒక బాధ అయితే , సగం షూటింగ్ జరుపుకున్న సినిమాలది ఇంకో భాద. షూటింగ్ లేట్ అవ్వడం వలన పెట్టుబడి మీద వడ్డీలు విపరీతంగా పెరిగి పోతుండటం నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

జర్నలిస్టులకు బీమా కల్పించాలి: పవన్ కల్యాణ్

లాక్ డౌన్ తీసివేసిన తరవాత మే నుండి అయినా షూటింగ్స్ మొదలవుతాయని నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతలకు ఆ నమ్మకం రోజురోజుకి సన్నగిల్లు తోంది . పరిస్థితులను చూస్తుంటే లాక్ డౌన్ ఇప్పట్లో ఆగేలా లేదు . దీనితో కొందరు నిర్మాతలు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని ఇండోర్ సెట్స్ లో షూటింగ్స్ జరుపు కొంటే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో చిరంజీవి నటిస్తున్న 152 వ చిత్రం ఆచార్య చిత్ర యూనిట్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి .

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ముంబైలో హెల్డప్ అయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి కాజల్ అగర్వాల్ లేని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.

కాదేది నటనకు అనర్హం అంటున్న చిరు


కరోనా లోక్ డౌన్ వల్ల తెలుగు నాట వెబ్ సిరీస్‌లకు క్రేజ్ పెరుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు వెబ్ సిరీస్‌లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఓ సర్వేలో తేలింది . దరిమిలా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ లోకి స్టార్ హీరోలను తీసుకొచ్చి వెబ్ సిరీస్‌ల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీలో అదుపు గాని వైరస్… కేంద్రం సీరియస్

ఆ క్రమం లో ఓ టాప్ ఓటీటీ సంస్థ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి కి గోల్డెన్ అఫర్ వచ్చిందట …అందుకు చిరంజీవి పాజిటివ్ గా స్పందించి .‘డైరెక్టర్‌ను పంపిస్తే కథ వింటానని వారికి రిప్లై ఇచ్చాడట పనిలో పనిగా మంచి క్రేజీ కథలతో వచ్చే యంగ్ టాలెంట్స్ ను తనవద్దకు తీసుకురమ్మని మేనేజర్‌కు కూడా చెప్పడం జరిగిందట . దీంతో చిరంజీవి త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారని వార్త గుప్పుమంది ..

జర్నలిస్టులకు బీమా కల్పించాలి: పవన్ కల్యాణ్

150 వ చిత్రం తో తిరిగి వెండి తెరపై విజృంభిస్తున్న మెగాస్టార్ తన రూట్ మార్చి యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ క్రమంలో సురేందర్ రెడ్డి కి `సైరా` సినిమా ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాడు. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న మెగాస్టార్, ఈ సినిమా తర్వాత ముగ్గురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని తానే స్వయంగా చెప్పడం జరిగింది . యంగ్ డైరెక్టర్స్ సాహో సుజిత్, వెంకీ మామ ఫేమ్ బాబీ, బిల్లా ఫేమ్ మెహార్ రమేశ్‌లతో తన తదుపరి సినిమాలు ఉంటాయని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇపుడు వాటితో పాటు వెబ్ సిరీస్ కి కూడా సన్నద్ధమౌతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి .. .

మద్యం, మాంసం షాపులపై తనిఖీ!

కరోనా విజృంభన తొలి రోజుల్లో చికెన్ పై వచ్చిన వదంతులతో మాంసం డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్నగా చికెన్ పై వచ్చిన వార్తలు అసత్యం అని తేలడంతో మాంసం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంలో కంటే మాంసం ధరలను అధిక మొత్తంలో పెంచి గతకాలపు నష్టాలను పూడ్చుకునే పనిలోపడ్డారు అమ్మకం దారులు. విషయం తెలుసుకున్న తూనికలు-కొలతలు శాఖ అధికారులు హైదరాబాద్ లోని అంబేర్పెట్ లో అధిక ధరలకు మాంసం అమ్మే షాపులపై గురువారం తనిఖీ నిర్వహించారు. అంబేర్పెట్ లోని కొన్ని మాంసం షాపుల్లో అధిక ధరలకు మాంసం అమ్ముతున్నారని స్థానిక ప్రజల సమాచారం మేరకు అకస్మాత్తుగా తనిఖీ చేశారు.దీనితో అధికారులు అధిక ధరలకు అమ్మే షాపులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు ఇలా ఎక్కువ ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

అదే విధంగా లాక్ డౌన్ కారణంగా మద్యం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. దీనిని కూడా కొంతమంది అమ్మకం దారులు క్యాష్ చేసుకుంటున్నారు. రహస్య ప్రాంతాలలో బెల్ట్ షాపులు, కల్లు దుకాణాలు పెట్టి యధేచ్చగా మందు, కల్లును విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ ఎక్సైజ్ పి.యస్ పరిధి ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సహకారంలో‌ పలు బెల్ట్ షాపులు, కల్లు దుకాణాల పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మేడ్చల్ మండల్ ఘనపూర్ తాండాలోని భూక్య మిటీయా నాయక్ నుండి 72 విస్కీ బాటిళ్లు, ఇస్లావత్ వెంకటేశ్ వద్ద నుండి 76 విస్కీ బాటిల్స్ మరియు సైదోని గడ్డ తండాలో ఉంటున్న బాణావత్ సురేష్ వద్ద నుండి 30 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో వారిపై కేసు నమోదు చేశారు.

ఏపీలో అదుపు గాని వైరస్… కేంద్రం సీరియస్


ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ అదుపు కాకపోవడం, రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉండడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఈ విషయమై ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వశాఖల బృందాలను ఏపీకి కూడా పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును సమీక్షించేందుకు నియమించిన ఐఎంసీటీ బృందాలు ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో పర్యటించడం తెలిసిందే. ‌ ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా సీఆర్‌పీఎ్‌ఫను రంగంలోకి దించే అవకాశం కూడా ఉంటుంది.

రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదంటూ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి స్వయంగా తెలపడం గమనార్హం. అయితే క్షేత్రస్థాయి పరిష్టితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు గమనిస్తున్నారు.

గురువారం ఒక్కరోజే 80 కొత్త కేసులు నమోదవడంతో మరింత ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో మార్చి 12న తొలి కేసు గుర్తించిన తర్వాత ఒకేరోజు ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఏప్రిల్‌ 20వ తేదీన 75 కేసులే ఇప్పటి వరకూ అత్యధికం. పైగా, తొలి నుండి కరోనా అధికంగా ఉన్న పొరుగున ఉన్న తెలంగాణలో సహితం ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు.

గత నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 246 కేసులు వెలుగుచూశాయి.తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 893కి పెరిగిపోయింది. అంటే 900 సంఖ్యకు చెరువులోకి వచ్చింది. కర్నూలులో కొన్ని మానవ తప్పిదాలపై ఆరోపణలు రావడం గమనార్హం.

మరోవంక ప్రభుత్వం చెబుతున్న అంకెల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని బులెటిన్లలో అంకెల వ్యత్యాసం స్పష్టమవుతున్నది. కరోనా మరణాలను, కేసులను తక్కువగా చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీకి, టిడిపి నేతలు వరుసగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు పంపుతున్నారు.

స్థానిక పరిస్థితుల నేపథ్యంలో చాలాచోట్ల పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, లాక్‌డౌన్‌ నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయక పోవడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. స్వయంగా వైసిపి ఎమ్యెల్యేలు, ఎంపీలు నిబంధనలకు తిలోదకాలిచ్చి, సాంఘిక దూరం పాటించకుండా బహిరంగంగా, గుంపులుగా తిరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

మరోవంక, కర్నూలు జిల్లా నుంచి పొరుగున ఉన్న తమ ప్రాంతాలకు వైపతి చెందుతున్నట్లు తెలంగాణ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్‌ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. దానితో 25 రోజుల క్రితమే కర్నూల్ తో తెలంగాణ ప్రభుత్వం సరిహద్దును మూసివేసింది.

కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్‌ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్‌ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జర్నలిస్టులకు బీమా కల్పించాలి: పవన్ కల్యాణ్


దేశంలో లాక్డౌన్ ప్రతీఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా లాంటి విపత్కర సమయంలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, పోలీసులు కరోనాపై పోరాటం చేస్తుండగా క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇక పారిశుధ్య కార్మికులు వీధుల్లో ఉంటూ కరోనా మహమ్మరి ప్రబలకుండా చర్యలు చేపడుతున్నాయి. తాజాగా జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత తన ట్వీటర్లలో జర్నలిస్టులపై స్పందించారు. జర్నలిస్టులు సమాచార సేకరణలో భాగంగా వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ కుటుంబానికి మీ అవసరం చాలా ఉందని.. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా విపత్తులోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని ఆయన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జర్నలిస్టులు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ విధులు చేపట్టాలని ఆయన సూచించారు.

చైన్నెలో 25మంది, ముంబైలో 50మందికి పైగా జర్నలిస్టులు కరోనా బారినపడ్డారని గుర్తుచేశారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోని జర్నలిస్టులు క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిసిందని పవన్ తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, మీడియా సంస్థలు పాత్రికేయుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు, పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమా కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థిత్లుల్లోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

దాతల సాయాన్ని దోచేస్తున్నారు!


ట్రస్ట్ పేరిట కొందరు వ్యక్తులు దాతల సాయాన్నీ దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పేదలకు సాయం చేయకుండా తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కరోనా’ కేసులపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విపత్కర సమయంలో అసత్య ప్రచారాలు సరికాదని, ‘కరోనా’ కట్టడిపై శాస్త్రవేత్తలతో ప్రభుత్వం చర్చించాలని, రాజకీయాలపై కాకుండా పేదలకు సాయం చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్రంలో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా ఉందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని, జగన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మన రాష్ట్రంలో స్వస్థలాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలను, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన కూలీలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న సాయి పల్లవి


ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో హీరోయిన్ రష్మిక మందన్నకి స్టార్ స్టేటస్ వచ్చింది. ‘అల వైకుంఠపురములో’ వంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం ఉన్నప్పటికీ… ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రజాదరణ లో వెనక్కి తగ్గలేదు. ఆ క్రమంలో ఈ చిత్రం హిట్ రష్మిక కెరీర్ కు మరింత ప్లస్ అయ్యిందనే చెప్పాలి. కాగా ఈ చిత్రంలో ముందు హీరోయిన్ గా వేరే హీరోయిన్ ని అనుకొన్నారు . కానీ అదృష్టం రష్మిక నే వరించింది..

నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ గా ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవిని అనుకున్నారట. ఆ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సాయి పల్లవిని కలిసి కథ వినిపించాడట. అయితే ఆమె ఈ చిత్రంలో ఓవర్ గా రియాక్ట్ అవ్వడం..కామెడీ చెయ్యడం… సెకండ్ హాఫ్ లో అయితే హీరో వెనకాలే తిరగడం వంటివి నాకు నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేసిందట.

ఫిదా వంటి సెన్సిటివ్ మూవీ చేసిన తరవాత సాయి పల్లవి నటించిన ‘ఎం.సి.ఏ’ చిత్రంలో ఆమె పాత్ర జోవియల్ గానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ` ఎం సి ఏ ` చిత్రంలో సాయి పల్లవి పాత్రకు `సరిలేరు నీకెవ్వరు ` చిత్రం లో హీరోయిన్ కి ఉన్నంత ప్రాముఖ్యత కూడా ఉండదు. మరి ఆ సినిమాని ఒప్పుకున్న సాయి పల్లవి.. ‘సరిలేరు నీకెవ్వరు ` వంటి సూపర్ హిట్ ను ఎందుకు వదులుకుందో మరి. ఒక్కోసారి కథ విన్న దానికి భిన్నంగా తెరమీద ప్రెజెంట్ చేయడం జరుగుతుంది .బహుశా సాయి పల్లవి కూడా అలాగే పొరబాటు పడి ఉంటుంది .

కష్టం కాలంలో పంతులుగారి సూత్రం!

“చినిగిన చొక్కైనా తొడుక్కో గాని ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటకు కరోనా కష్ట కాలంలో విలువ చేకూరింది. ప్రస్తుతం ప్రాణాంతక కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌ డౌన్‌ ను ఎంతో మంది పుస్తక పఠనంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 23) ప్రముఖ ఇంగ్లీష్ రచయిత విలియం షేక్స్‌ పియర్‌ జయంతి- వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా 1995 నుంచి ప్రతీ ఏటా “వరల్డ్‌ బుక్‌ డే”ను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని..  ‘‘ప్రపంచమంతా కరోనా భయంతో అల్లకల్లోలం అవుతున్న సమయంలో పుస్తకాలు చేసే మ్యాజిక్‌ ఏంటో మనం తెలుసుకోవాలి. పుస్తక పఠనానికి ఉన్న శక్తి ఏమిటో… సరికొత్త రేపటిని నిర్మించుకోవడంలో అది ఏవిధంగా ఉపయోగపడుతుందో నేర్చుకోవాలి’’’ అని యునెస్కో ట్వీట్‌ చేసింది.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా.. ‘‘ నన్ను నేను సౌకర్యంగా ఉంచుకోవడంలో పుస్తకాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయాల్లో.. ఐసోలేషన్‌ లో బుక్స్‌ మనకు ఎంతో సహాయం చేస్తాయి. పుస్తక పఠనంలో ద్వారా వచ్చే శక్తిని ఈ వరల్డ్‌ బుక్‌ డే సందర్భంగా మనం సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అని ట్వీట్‌ చేశారు.

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని ప్రజాకవి కాళోజీ అన్నారంటే మనిషి జీవితంలో పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

పుస్తక పఠన గొప్పతనాన్ని గుర్తించిన కేరళ!

అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరొందిన కేరళలో.. లాక్‌ డౌన్‌ నిబంధనలు పాక్షికంగా సడలించిన నేపథ్యంలో నిత్యావసరాల షాపులతో పాటుగా పుస్తకాల షాపులు కూడా తెరవాలని ఆ రాష్ట్ర వాసులు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు విజ్ఞప్తి చేశారు. మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుస్తకాలను కొనుక్కునేందుకు కొన్ని గంటల పాటు బుక్‌ షాపులు తెరచి ఉంచాలని కోరుతున్నారు.  ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌ స్పాట్ ప్రాంతాల్లో పుస్తకాల షాపులకు మినహాయింపు ఇవ్వడంతో రీడర్స్‌ క్లబ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కరోనాఫై అల్లు అరవింద్ అంచనా


కరోనా కారణంగా ఎన్ని వందలు, వేల కోట్ల నష్టం సినీ పరిశ్రమ కి ఉంటుందో అంచనా వేయడం కష్టంగా ఉంది. రెండు నెలల్లో అంతా మామూలైపోతుందని అనుకున్న సినీ వర్గాలు ఇపుడు ఆలోచనలో పడ్డాయి. ఇంకో మూడు నెలలు అయినా కూడా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు.

ఈ క్రమంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుత సినీ పరిశ్రమ గురించి కొన్ని హెచ్చరికలు చేయడం జరిగింది. దసరాకు పరిస్థితులు మారతాయి సినిమాల సందడి మొదలవుతుంది అనుకుంటే..భ్రమే అని అరవింద్ తేల్చేశారు. ఆయన అంచనా ప్రకారం డిసెంబరు-జనవరి నాటికి కానీ సినిమా థియేటర్లు మామూలు స్థితికి రావని చెబుతున్నారు ఒకవేళ కరోనాకు మందు వచ్చినా కూడా.. ప్రేక్షకులు థియేటర్ల వద్ద గుంపులుగా కలవడానికి పూర్వం లా ధైర్యం చేయక పోవచ్చని అన్నారు .

థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి సాధారణ పరిస్థితులు రావడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుందని అరవింద్ అంచనా వేశారు ..చివరగా చిన్న సినిమాల గురించి చెబుతూ వాటికి గడ్డు కాలం తప్పదని.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినిమాలకు అయినంత ఖర్చును ఇచ్చి కొనుగోలు చేయవని చెప్పారు.విడుదలకు ఎదురు చూసే చిత్రాలు వడ్డీల్ని తట్టుకుని నిలబడే పరిస్థితి లేదన్నారు.

తగ్గుతున్న కరోనా కేసులు:కేసీఆర్

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను సూచించారు. వ్యాధికి సంబంధించి అనుమానితులపై నిఘా ఉంచాలని, వారు ఎవరెవరిని కలిశారనేది ముఖ్యమని, అందరికీ సంబంధించిన సమాచారం తీసుకోవాలన్నారు. అనుమానితుల్లో ఏ ఒక్కరూ తప్పించుకొని తిరగడానికి వీల్లేదన్నారు. కంటెయిన్‌ మెంట్‌ జోన్లపై దృష్టి సారించడం ద్వారా మిగిలిన ప్రాంతాలను విస్మరించొద్దని, జోన్లతో పాటు వాటిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ పర్యవేక్షణ సాగాలన్నారు. పలుచోట్ల లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, పూర్తిగా నివారించాలన్నారు. జన సంచారాన్ని పూర్తిగా నిరోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

కరోనా వైరస్‌ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

“బాధితులతో కాంటాక్టు ఉన్న వ్యక్తులందరనీ క్వారంటైన్‌ చేశాం. దీని కారణంగా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలిగాం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా సహకరించి నిబంధనలు పాటిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

రైతులకోసం బండి సంజయ్ రేపు ఉపవాసదీక్ష


తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం హైదరాబాద్ లోని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఉపవాసదీక్ష జరుపుతున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు.

లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే , బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల అధ్యక్షులు తమ తమ ఇండ్లలోనే ఈ దీక్ష చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికచ్చే సమయానికి విధించిన లాక్ డౌన్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. కూలీలు దొరకక, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యక, ఐకెపి సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గత వారం రోజులుగా బీజేపీ రాష్ట్ర శాఖ నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, ఎవ్వరు ధైర్యం కొల్పవద్దని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది సమృద్ధిగా పంటలు పండడంతో రైతులతో ధావత్ చేసుకోవాలని ఉందని ప్రకటించిన సీఎం కేసీఆర్ వారి కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదని సంజయ్ విమర్శించారు. మార్కెట్ లు బంద్ కావడంతో ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారని తెలిపారు.

ఐకెపి సెంటర్లలో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం అని సీఎం కేసీఆర్ ప్రకటించినా, క్షేత్ర స్థాయిలో అది జరగడం లేదని చెప్పారు. జిల్లాలో అధికారులు సమన్వయ లోపంతో కొనుగోళ్లు ఇప్పటికి ప్రారంభం కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే , బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల అధ్యక్షులు తమ తమ ఇండ్లలోనే ఈ దీక్ష చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.

‘మోడీ జై’కి కారణాలు అనేకం!

దేశంలో కరోనా వైరస్ కలకలంతో మోడీ సర్కార్ పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు సార్లు లాక్‌ డౌన్ పొడిగించి ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం ఏదీ కాదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.ఈ కోవిడ్-19పై పోరులో ప్రధాని మోడీ చేస్తున్న కృషిని చాలామంది భారతీయులు, ఇతర దేశస్థులు కూడా అభినందిస్తున్నారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా మోడీ పనితీరును ప్రశంసించాయి.

తాజాగా కోవిడ్-19పై పోరుకు మోడీ తీసుకున్న చర్యలు భేష్ అని 93.5 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. “మార్నింగ్ కన్సల్టీ”అనే సంస్థ మోడీకి 68 పాయింట్లు ఇచ్చి ప్రపంచంలోనే కరోనాని కట్టడి చేసే అగ్రనేతగా నిలిపింది. ఈ క్రమంలోనే ఐయాన్స్-సీఓటర్ కోవిడ్ 19 ట్రాకర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తొలి లాక్‌డౌన్ సందర్భంగా 76.8శాతం మంది ప్రజలు నమ్మకం ఉంచారు. ఇప్పుడు ఆ నమ్మకం మరింత పెరిగి ఏప్రిల్ 21నాటికి 93.5శాతంకు పెరిగింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 21వరకు కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అనుకుంటున్నారనే ప్రశ్నను ప్రజల ముందు ఉంచారు. దీనికి 93.5శాతం మంది బాగుందనే సమాధానం ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రపంచదేశాలకు కూడా సహాయం చేయడంలో ముందున్నారని అమిత్ షా కొనియాడారు.

ఏప్రిల్ 16వరకు 75.8శాతం మంది ప్రజలు మోడీ పనితీరును మెచ్చుకుని నమ్మకం ఉంచగా… రెండో సారి దేశం లాక్‌ డౌన్‌ లోకి వెళ్లగా ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడిందని సర్వే చెప్పింది. మొత్తం మీద ఏప్రిల్ 1నాటికి మోడీ సర్కార్‌ పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని సర్వే వెల్లడించింది. అదే సమయంలో మార్చి 31తో పోలిస్తే 89.9శాతం పెరుగుదల కనిపించిందని సర్వే వెల్లడించింది. మార్చి 25న 21 రోజుల పాటు లాక్‌ డౌన్ విధించిన మోడీ సర్కార్ అనంతరం మే 3వరకు పొడిగిస్తూ రెండో సారి నిర్ణయించారు. ఇదంతా దేశ ప్రజల ఆరోగ్యం కోసమే అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ విధంగా “మోడీ జై” వెనుక అనేక కారణాలు ఉన్నయి.

తమిళ్ ఉప్పెన లో విజయ్ వారసుడు


త్వరలో తెలుగులో రాబోతున్న చిత్రాలలో మంచి హైప్ తెచ్చుకొన్న చిత్రం “ఉప్పెన”. మెగా మేనల్లుడు , సాయి తేజ్ కి తమ్ముడు అయిన వైష్ణవ తేజ్ ఈ చిత్రం ద్వారా వెండితెర కు పరిచయం కాబోతున్నాడు అతనికి జోడీ గా కృతి శెట్టి పరిచయం కాబోతుంది. ఇక చిత్రానికి రచన , దర్శకత్వం వహించిన బుచ్చి బాబు సానాకి కూడా ఇది తొలి చిత్రమే …..ఇలా కొత్త తారలతో నిర్మించ బడ్డ ” ఉప్పెన ” చిత్రం నిర్మాణ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ క్రమంలో ఇపుడు తమిళం లో రీమేక్ కాబోతుంది.

కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి `ఉప్పెన `చిత్రంలో హీరోయిన్ తండ్రిగా , విలన్ గా నటించడం జరిగింది.దాంతో నిర్మాణ దశలోనే ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ కొని తమిళం లో నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఈ తమిళ చిత్రం లో హీరోగా ఒక కొత్త నటుడిని పరిచయం చేయాలను కొంటున్నాడు తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కుమారుడైన “జాసన్ సంజయ్ “ని ఈ చిత్రం ద్వారా హీరో గా కోలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు . ఇక హీరోయిన్ గా తెలుగులో నటించిన కృతిశెట్టి నే నటింప చేసే అవకాశాలున్నాయి. కాగా సేతుపతి విజయ్ తెలుగులో పోషించిన పాత్రనే తమిళం లో కూడా చేయ బోతున్నాడు. దర్శకుడి విషయం లో ఇంకా ఒక నిర్ధారణకు రాని విజయ్ సేతుపతి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారి తోనే తమిళ్ లో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నాడు .

సీఎంగారూ.. ఇంట్లో బోర్ కొట్టడం లేదా?

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పలు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ.. కరోనా కట్టడి పై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కానీ ఈ లాక్ డౌన్ పుణ్యమా అని ఒక్కరోజు కూడా జగన్ బయటకు రాకపోవడం గమనార్హం. మరోవైపు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు అప్పుడప్పుడు బయటకొచ్చి కరోనా కట్టడిపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ మాత్రం తన ఇంటికి, ఆ క్యాంప్ ఆఫీసుకి మాత్రమే పరిమితమయ్యారు.

“నాలుగు పదుల వయసున్న జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు కదల్లేని స్థితి లో ఉన్నారా?   జగన్  ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు.  ఆయన రాష్ట్ర నికి ముఖ్యమంత్రా లేక తాడేపల్లి కి ముఖ్యమంత్రా? ప్రజలకు ముఖ్యమంత్రా? ప్యాలెస్ కి ముఖ్యమంత్రా?”  అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. “రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే జగన్ మాత్రం ఏమీ పట్ట నట్లు ఇంట్లో కూర్చున్నారు.  ముఖ్యమంత్రి కరోనాకి భయపడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి పబ్జీ గేమ్ పై ఉన్న ఆసక్తి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరం.” అంటూ వివిధ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

కరోనా నివారణలో వైసీపీ  పని తీరును చూసి జనం తిరగబడతారేమోనని  బయటకు రాలేకపోతున్నారా? కరోనా విపత్తు సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, పశ్చిమబెంగాల్  ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, కేరళ ముఖ్యమంత్రి విజయన్ వంటి వారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ  ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. బాధితులు, వలస కార్మికులు, రైతులు ఇతర వర్గాలవారి కష్టసుఖాలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

ఏపీలో మరింత ఘోర కలి రాకముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని పలువురు సలహాలిస్తున్నారు.