Home Blog Page 8516

ఏపీలో ఆరు నెలల పాటు ఎన్నికలు వద్దు


క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, కేసులు అధికంగా న‌మోద‌వుతున్న జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమ‌ర్జ‌న్సీ ప్ర‌క‌టించాల‌ని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భాజ‌పా రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంద‌ని ఆరోపించారు. ఏపిలో నాలుగు జిల్లాల్లో 70శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంద‌న్నారు. ఆయా జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఓవైపు సామాజిక దూరం పాటించ‌కున్నా కూడా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేద‌న్నారు. వైసిపి ఎమ్మెల్యే లు, మంత్రులు లాక్‌డౌన్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడంలేద‌ని విమ‌ర్శించారు. హెల్త్ బులెటిన్‌లో కూడా అనేక లోపాలుంటున్నాసరిదిద్దుకోవడం లేద‌ని వ్యాఖ్యానించారు. కర్నూలులో ఒక‌ వైద్యుడు చనిపోతే తొలుత నెగిటివ్ అన్నార‌ని తర్వాత పాజిటివ్‌గా నిర్ధారించినా అప్పటికే పరిస్థితి మారిపోయింద‌ని తెలిపారు. ప‌విత్రమైన రంజాన్ మాసంలో దాతలు భోజనం పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చార‌ని ఇది సరైంది కాద‌ని దీనిపై పునరాలోచన చేయాల‌న్నారు. లౌడ్ స్పీకర్‌కు అనుమతి ఇవ్వడం ద్వారా అన్ని ప్రాంతాలలో కరోనా జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేయాల‌ని సూచించారు. ఏపి జాలర్లను కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోష‌దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. వైసిపి నేతలు సేవ పేరుతో వందల మందితో ర్యాలీ చేయడం, జన సమూహంతో తిరగడం సరికాద‌న్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులను ఆయా జిల్లాలకు పంపించి పరిస్థితి పర్యవేక్షణ చేసేలా చూడాల‌న్నారు. రైతుకు ఎకరాకు రూ.25వేలు సాయం‌ అందించాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇతర రాష్ట్రాలలో పంటలు విక్రయించే బాధ్యత తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కారంలో సిఎం ప్రత్యేకంగా సమీక్ష చేయాల‌ని కోరారు. కరోనా సమయంలో కూడా సిఎం జగన్ ఎన్నికల గురించి ఆలోచన చేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల పాటు ఎన్నికలు ఉండవని ప్రకటన చేయాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువని పేర్కొన్నారు. కోవిడ్-19 విషయంలో కేంద్రం సూచనలు రాష్ట్రం ఆచరించాల‌ని కోరారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ల్యాబ్‌ల సంఖ్య పెంచాల‌ని, రాష్ట్రం లో కొన్ని ప్రవేట్ ఆసుపత్రుల్లో అయినా అత్యవసర కేసులు చూసేలా ప్ర‌భుత్వం ఆదేశాలివ్వాల‌ని తెలిపారు.

ఎన్నికల కమిషనర్ వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంద‌ని, ఈ సమయంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంద‌న్నారు. వైసిపి ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకులు ఇస్తుంద‌న్నారు. ఏపిలో అధికార పార్టీలకు ఒక చట్టం.. విపక్షాలకు మరో చట్టం అన్నట్లుగా ఉంద‌న్నారు. నెహ్రూ యువజన కేంద్రం జాతీయ వైస్ ఛైర్మన్‌గా తాను ఉన్నాన‌ని అందువ‌ల్లే ఎమర్జెన్సీ కోటా కింద తాను అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్న‌ట్లు చెప్పారు. ఏపిలో తాను అతిధిగా ఉన్నాన‌న్నారు. సామాజిక దూరం పాటించి పనులు చేస్తున్న‌ట్లు తెలిపారు. కరోనా విధుల్లో పాల్గొంటున్న జర్నలిస్టులకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల‌న్నారు. వైసిపి నేతల నిర్లక్ష్యం వల్లే చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరగటం వాస్తవం అన్నారు. కారకులైన‌ వారందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా పాజిటీవ్ కేసులు ప్రభుత్వం ఉద్యోగులు, పోలీసులు, వాలంటీర్‌లకు‌ వచ్చింద‌ని మీడియా వాస్తవాలు చెబితే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌న్నారు. కరోనా వ్యాప్తి చెంద‌కుండా ఇప్పటికైనా ప్ర‌భుత్వం ప‌టిష్ఠమైన చర్యలు చేపట్టాల‌న్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం..!


దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడి, బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొందని వెల్లడించింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

అల్పపీడన ప్రభావం రాయలసీమలో శుక్రవారమే కనిపించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ నాలుగు రోజులపాటు రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కోస్తాలో రబీ పంట కోతలను ప్రారంభించాలనుకుంటున్న రైతులు ఈ నాలుగు రోజులు ఆగితే మంచిదని సూచిస్తున్నారు.

పొగాకు రైతులను ఆదుకోమంటున్న బాబు..!


లాక్‌డౌన్ కారణంగా ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబును కోరారు. ఆ మేరకు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఇప్పటికే 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందని, దీనిని అమ్ముకునే వెసులుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లో విక్రయించే అవకాశం రైతులకు ఉందని, కానీ పొగాకు రైతులకు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. మార్చి తొలి వారంలోనే జరగాల్సిన తొలి దశ వేలం కరోనా కారణంగా వాయిదా పడిందని, ఇది మరింత ఆలస్యమైతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. బోర్డు వెంటనే స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు జిల్లా పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో రైతులు పోగాకును సాగు చేసున్నారు. రైతుల వద్ద నుంచి పోగాకును పొగాకు ఉత్పత్తులు తయారు చేసే సంస్థలు, మరికొన్ని ఏజెన్సీలు మాత్రమే కొనుగులు చేస్తాయి. లాక్ డౌన్ కారణంగా పొగాకు ఉత్పత్తులు తయారీ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆ సంస్థలు కొనుగోళ్ళకు ముందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని పొగాకు రైతుల సంఘము చెబుతోంది.

పాత బస్తీ అదుపు తప్పడంతో కేంద్ర బృందం ఎంట్రీ


లాక్‌డౌన్‌ సక్రమంగా అమలు కాకపోవడంతో పాటు కరోనా వైరస్ సహితం అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్ తో పాటు నాలుగు ప్రధాన నగరాలకు కేంద్ర బృందాలను పంపుతున్నట్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గత రాత్రి ప్రకటించింది. మిగిలిన నగరాలు చెన్నై, అహ్మదాబాద్, సూరత్.

మొత్తం తెలంగాణలోని పాజిటివ్ కేసులలో దాదాపు సగం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా, వాటిల్లో సగానికి పైగా పాత బస్తీలోనే ఉన్నాయి.

ప్రతి రోజు రెండంకెలలో కేసులు తాజాగా ఇక్కడ నమోదవుతున్నాయి. రెడ్ జోన్ లుగా ప్రకటించి, పలు చోట్ల స్థానికులే తమ వీధులకు బారికేడ్లు ఏర్పాటు చేస్తుకున్నా లాక్ డౌన్ సక్రమంగా అమలు కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో వైరస్ కట్టడి అవుతున్నా పాత బస్తీలో కాకపోవడం, ప్రతి రోజూ కేసులు పెరుగుతూ ఉండడం అధికారులకు సహితం ఆందోళన కలిగిస్తున్నది. దానితో కేంద్రం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు కనిపిస్తున్నది.

కేంద్రం బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయనున్నది. ముఖ్యంగా.. లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలు, నిత్యావసర సరుకుల సరఫరా, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా?, వైద్య సదుపాయాల సన్నద్ధత, వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ, పేద ప్రజలు, కార్మికులకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితి.. తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది.

నగరంలో కేవలం 45 కుటుంబాలు 260 మందికి ఈ వైరస్ ను సోకేటట్లు చేశాయని స్వయంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడం పరిస్థితి తీవ్రతను వెల్లడి చేస్తుంది. తెలంగాణలో మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 983కు చేరుకోగా, వాటిల్లో దాదాపు సగం కేసులు కేవలం 113 కుటుంబాల నుంచే నమోదు కావడం గమనార్హం.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 485 కేసులు నమోదు కాగా, ఆ 45 కుటుంబాల నుంచి వచ్చిన పాజిటివ్‌ల సంఖ్య 268గా ఉంది. అంటే మొత్తం హైదరాబాద్ నగరంలోని కేసులలో నాలుగోవంతు ఉందన్నమాట. ఇంకా మర్కజ్ జమాత్ సమావేశాల నుండి తిరిగి వచ్చిన వారందరి ఆచూకీ ఇంకా పూర్తిగా లభించలేదని గత వారం ఆరోగ్య మంత్రి రాజేందర్ పేర్కొనడం గమనార్హం.

పాతబస్తీలో స్థానికుల సహాయ నిరాకరణతో పాటు రాజకీయ వత్తిడుల కారణంగా అధికారులు సహితం కఠినంగా వ్యవహరింపలేక పోతున్నట్లు తేలుతున్నది. పాత బస్తీలో నాలుగైదు కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి అధికారులు చేతులు దులుపుకున్నట్లు కనిపిస్తున్నది.

బారికేడ్లు ఏర్పాటు చేసినా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కనీస చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్‌, ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు తగు దృష్టి సారింపలేక పోతున్నారు.

కొన్ని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు యధేచ్చగా సాగుతున్నా పోలీసులు రాజకీయ కారణాలతో పట్టించుకోలేక పోతున్నారు. ప్రాంతాల వారీగా వివిధ విభాగాలతో నోడల్‌ అధికారులు, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు.

ప్రభాస్ సరసన కియారా అద్వానీ


సాహో తరవాత ప్రభాస్ చేస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంటే కరోనా లాక్ డౌన్ బ్రేక్ వేసింది . రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ తాజా చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే దీనిని రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేశారు. మరోపక్క, ఇప్పటి వరకు పూర్తయిన షూటింగుకు సంబంధించిన ఎడిటింగ్ పనులను చక్క బెడుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం తరవాత తెరకెక్క బోయే చిత్రం కూడా లాక్ డౌన్ ముగియగానే పట్టాలెక్కేందుకు సిద్ధమౌతోంది . …

కాగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫై అశ్విని దత్ నిర్మించ నున్నాడు .సుమారు 500 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మితమౌతున్న ఈ చిత్రాన్ని `మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి . ప్రభాస్ హీరోగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించ బడే ఈ భారీ చిత్రాన్ని ఒక సైన్స్ ఫిక్షన్ జానర్ లో నిర్మించడానికి వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ పాత్రకు ముందుగా దీపికా పడుకొనే ని అనుకొన్నారు. కానీ దీపికా పడుకొనే 20 కోట్ల పారితోషకంగా అడగటం తో పాటు కొన్ని కండిషన్స్ పెట్టడం తో ఇపుడు ఆమె స్తానం లో ` భరత్ అనే నేను’ , ‘ వినయ విధేయ రామ ` ఫేమ్ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది .

శ్రీ కాళహస్తిలో అలజడి రేపుతున్న కరోనా

స్వర్ణముఖి నదీతీరంలో నెలకొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నేడు కరోనా వైరస్ తో తీవ్రమైన అలజడికి గురవుతున్నది. తొలి రోజులలో అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల అహంకార ధోరణి కారణంగా వైరస్ అదుపు తప్పింది.

కరోనా కట్టడి విధులలో ఉన్న 17 మందికి కూడా ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వ విధులు అంటేనే భయపడుతున్నారు. కేవలం 85 వేల జనాభా గల ప్రశాంతతకు పేరొందిన ఈ పట్టణం నుండి చుట్టుపక్కల మండలాలకు సహితం ఈ వైరస్ వ్యాపించింది. దానితో మొత్తం పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించవలసి వచ్చింది.

చిత్తూర్ జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ ఇక్కడి నుండే వచ్చింది. ఇప్పుడు జిల్లాలో మొత్తం 73 కేసులు నమోదయ్యాయి, వారిలో మూడింట రెండు వంతులకు పైగా 50 వరకు ఈ చుట్టుప్రక్కలనే ఉన్నాయి.

మార్చి 12 తర్వాత లండన్ నుండి వచ్చిన వారు, తర్వాత ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ సదస్సు నుండి వచ్చిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారి నుండే ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందింది. వచ్చిన వారు నిర్లక్ష్యంగా పట్టణంలో తిరిగినా వారికి మాత్రం వైద్యం చేసి, వారి కుటుంబ సభ్యులకు, వారితో తిరిగిన వారిని పరీక్షించకుండా అశ్రద్ధ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.

మొదటగా, మార్చి 18న లండన్ నుండి వచ్చిన ఒక యువకుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా, వైరస్ సోకున్నట్లు 25న నిర్ధారణ అయింది. అతను అప్పటి వరకు కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో గడపడమే కాకుండా, ఉరి బైట ఉన్న డాబాల వద్దకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు.

ఆ యువకుడిని, కుటుంబసభ్యులను మాత్రమే క్వారంటైన్‌కు తరలించిన అధికారులు, అతడి ఇంటికి రాకపోకలు సాగించిన ఇరుగుపొరుగువారిని, స్నేహితులను విస్మరించారు. దానితో నెల తర్వాత అతడి ఇరుగుపొరుగున ఉన్న నలుగురికి, అతని స్నేహితుడొకరికి పాజిటివ్‌ అని తేలింది.

ఇక శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ మర్కజ్‌ జమాత్‌ సమావేశాలకు వెళ్లిన 13 మందిలో మార్చి 17న ఆరుగురు, 18న ముగ్గురు విమానంలో తిరుపతికి వచ్చి శ్రీకాళహస్తి చేరుకున్నారు. 19న నలుగురు రైలులో గూడూరు మీదుగా శ్రీకాళహస్తి చేరుకున్నారు.

కేంద్ర నిఘా విభాగం మార్చి 29న హెచ్చరించే దాకా వీరిని జిల్లా యంత్రాంగం గుర్తించలేదు. అప్పుడు హడావిడిగా 30,31 తేదీలలో వీరినీ, కొంతమంది బంధువులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

అయితే రిజర్వేషన్‌ లేకుండా ఢిల్లీ నుంచి వచ్చిన వారి గురించిన సమాచారం లేకపోవడంతో వారు పట్టణంలో ఇళ్లలోనే గడిపేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తినీ, అతని భార్యను క్వారంటైన్‌కు తరలించిన అధికారులు వీరి ఇద్దరు కుమారులను పట్టించుకోలేదు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్‌ చేసిన అధికారులు అతడి అన్న కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. వారు ఇంట్లోనే ఉంటూ సాధారణ జీవితం గడిపారు. ఈ నెల 21న అతడి అన్నకు, అన్న కుమార్తెకు వైరస్‌ సోకినట్టు తేలింది.

మరో ‘ఢిల్లీ వ్యక్తి’ పొరుగింట్లో ఉన్న మహిళకు కూడా అదే తేదీన పాజిటివ్‌గా తేలింది. ఇంకో ఢిల్లీ వ్యక్తి ఇంట్లోనే అద్దెకున్న ప్రభుత్వాస్పత్రి మహిళా ఉద్యోగి ఒకరు వైరస్‌ బారిపడినట్లు ఈ నెల 23న వెల్లడైంది. మొత్తం మీద నిర్లక్ష్యంపై శ్రీ కాళహస్తి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

మందు బాబులకోసం..డాన్ బాబుల హల్ చల్!

కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ ని అమలుపరుస్తున్నారు. ఈ లాక్ డౌన్ వల్ల మందుబాబుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. చుక్కకి అలవాటుపడ్డ నాలుకని లాక్ డౌన్ లాక్ చేసింది. ఎలాగైనా మందుకొట్టాలనే వారి కోరికను కొంతమంది అమ్మకం దారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ రూరల్ లో బార్లు, వైన్‌ షాపుల యజమానులు కొందరు బరితెగిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు తమ షాపునకు వేసిన సీల్‌ తొలగిస్తున్నారు. తాళాలు తీసి షాపుల్లోని మద్యం నిల్వలను అక్రమంగా మార్కెట్‌ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నర్సంపేటలో ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఓ వైన్‌ షాపు నిర్వాహకులు, పరకాలలో ఒక వైన్‌ షాపు యజమాని అడ్డంగా దొరికిపోయారు. వీరిపై ఎక్సైజ్‌, పోలీసుశాఖ అధికారులు వివిధ కేసులు నమోదు చేశారు.

లాక్ డౌన్ కారణంగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులను మూసివేసి సీలు వేశారు. దీంతో ఆయా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులు మూసి ఉండాల్సిందేనని, తాళాలకు వేసిన సీలు తెరువొద్దని ఎక్సైజ్‌ శాఖ అధికారులు షాపుల యజమానులకు చెప్పారు. దీంతో మార్కెట్‌ లో మద్యం కొరత ఏర్పడింది. బెల్ట్‌షాపుల నిర్వాహకులు అప్పటికే తమ వద్ద ఉన్న మద్యం నిల్వలను ధర పెంచి అమ్మారు. ఎమ్మార్పీపై రెండు నుంచి మూడు రెట్ల వరకు ధర పెరిగింది.
దీంతో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపుల యజమానులు పలువురు ఇదే అదనుగా భావిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు వేసిన సీల్‌ నిర్భయంగా తొలగించి మద్యం నిల్వలను మార్కెట్‌ కు తరలించి అధిక రేట్లపై అమ్ముతున్నారు.

ఆయా జిల్లాలలో జోరుగా మద్యం అమ్మకాలు

వరంగల్ లోని నర్సంపేటలో ఉన్న మానస బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు ఎక్సైజ్‌ అధికారులు వేసిన సీలు తొలగించి మద్యం నిల్వలు గుట్టుచప్పుడు కాకుండా బయటికి తీసి అమ్మారు. సమాచారం అందగానే ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఈ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పై కేసు నమోదు చేశారు. షాపు యజమానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. లాక్‌ డౌన్‌ తర్వాత దీనిపై ఎక్సైజ్‌ శాఖ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం పరకాలలో ఓ వైన్‌ షాపు యజమాని తన షాపునకు వేసిన సీలును తొలగించడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 7న డోర్నకల్‌ లో ఒక వైన్‌ షాపు నుంచి రూ.40వేల పైచిలుకు మద్యాన్ని తరలిస్తుండగా డోర్నకల్‌ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

13న మహబూబాబాద్‌ జిల్లా బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఒక వైన్స్‌ షాపు నుంచి మద్యాన్ని తరలించడాన్ని అధికారులు గమనించి ఆ షాపుపై కేసు నమోదు చేశారు.

ఈనెల 22న అర్ధరాత్రి కు వైరా మండలకేంద్రంలోని ఒక వైన్‌ షాపులో సరుకును మూడు వాహనాల ద్వారా తరలించే క్రమంలో స్థానికులు గమనించి మద్యం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇలాంటి సంఘటనలపై ఇటీవల ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి సీలు తొలగించి మద్యం అమ్మిన షాపుల లైసెన్సు రద్దు చేస్తామని ప్రకటించారు. సీలు తొలగిస్తున్నట్లు భావిస్తున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులకు తమ శాఖ నుంచి రెండో తాళం వేశారు. లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత ప్రతి బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులో మార్చి 21 క్లోజింగ్‌, ఓపెనింగ్‌ బ్యాలెన్సును పరిశీలిస్తామని, తేడా వచ్చిన షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్‌ అధికారి పీ శ్రీనివాసరావు చెప్పారు.

నెలాఖరు వరకు కరోనా ఉధృతి కొనసాగనుంది!


రాష్ట్రంపై కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. గత మూడు రోజులుగా అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రతి రోజు 60 నుంచి 80 వరకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మొత్తం కేసుల సంఖ్య వెయ్యికి చేరువైంది. గతంతో కరోనా స్వాబ్ టెస్టింగ్ సెంటర్లు తక్కువగా ఉండటంతో రోజుకు 2 వేల పరీక్షలే చేసేవారు. ట్రూనాట్ పరికరాలు, ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో పరీక్షల సంఖ్యను 7 వేలకు పంచారు. దీంతో రాష్ట్రంలో కేసుల పెరుగుతున్నాయని అధికారులు చెపుతున్నారు.

రాష్ట్రంలో మూడవ విడత సర్వేలో 32 వేల మంది కరోనా లక్షణాలతో ఉన్నారని గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అనుమానితుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ 32 వేల మంది అనుమానితులతో సుమారు 10 వేల మందికి ఇప్పటి వరకూ పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఈ నెలాఖరు వరకూ సమయం పడుతుంది చెబుతున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం పూర్తయిన అనంతరం కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు అనుమానితులకు పరీక్షలు పూర్తయిన అనంతరం కేసులు నమోదు కాకపోతే కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించినట్లే అవుతుంది. తాజాగా 72 కరోనా పాజిటివ్ కేసులకు మూలలు ఎక్కుడవనేది అంతు చిక్కడం లేదు. ఎటువంటి కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధికంగా ఉన్నాయి. అయితే ఈ నెలాఖరు వరకూ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఉధృతి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పీఎం కేర్స్ నిధిపై మరో వివాదం


కరోనా కట్టడి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు విరాళాల సేకరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన `పీఎం కెర్స్ నిధి’ కి ఒక వంక విశేషంగా విరాళాలు లభిస్తుండగా, ఇది తొలి నుండి వివాదాస్పదంగా మారింది.

ప్రధాన మంత్రి సహాయ నిధి ఉండగా, దీనిని ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ రూపంలో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందనే విమర్శలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి సమాధానమే లేదు.

మరోవంక దీనిని ప్రభుత్వ రంగ సంస్థల నుండి, పారిశ్రామిక వేత్తల నుండి పెద్ద ఎత్తున నిధులను సమీకరించడంలో కేంద్ర మంత్రులు తలమునకలవుతున్నారు. అంతే కాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి కూడా ఈ నిధి కోసం వారి జీతాలనుండి కొత్త విధిస్తున్నారు.

పైగా, ఈ నిధికి నిధులు ఇచ్చే వారికి మాత్రమే ఆదాయపన్ను రాయితీ కల్పించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కరోనా వైరస్ కట్టడికి ఇస్తున్న నిధులకు అటువంటి రాయితీలు సమకూర్చడం లేదు. రాష్ట్రాల పట్ల వివక్షతకు నిదర్శనంగా ఈ నిధిని చూపుతూ విమర్శలు చెలరేగుతున్నాయి.

తాజాగా, అన్ని ప్రభుత్వ నిధుల వ్యయంపై జరిపే కాగ్ ఆడిట్ ను ఈ నిధికి జరిపే అవకాశం లేదని తెలియడంతో పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘వివిధ వ్యక్తుల నుంచి, వివిధ సంస్థల నుంచి వచ్చిన విరాళం కాబట్టి స్వచ్ఛంద సంస్థను ఆడిట్ చేయడానికి మాకు ఎలాంటి హక్కూ లేదు’’ అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత ట్రస్టు వ్యక్తులు ఆడిట్ చేయమని అడిగితేనే తాము ఆడిట్ చేస్తామని, లేదంటే వారి అకౌంట్స్‌ను ఆడిట్ చేసే ప్రసక్తే లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. అయితే సంబంధిత ట్రస్టీలు ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర ఆడిటర్లు మాత్రమే పీఎం కేర్ ఫండ్‌ను ఆడిట్ చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అంటే ఈ నిధికి విరాళాలు వసూలు చేయడంలో, వాటిని వ్యయం చేయడంలో పారదర్శకత లేదని స్పష్టం అవుతున్నది.

లాక్‌డౌన్‌ లో విశ్వసనీయత పెంచుకున్న ప్రింట్ మీడియా


లాక్‌డౌన్‌ సమయంలో తీవ్రమైన వత్తిడులను ఎదుర్కొంటున్న రంగాలలో ప్రింట్ మీడియా ఒకటి. ప్రచురణ వ్యయంలో అత్యధికభాగం ప్రకటనల నుండి వస్తుండగా, ఇప్పుడు ప్రకటనలే లేకుండా ప్రచురించడం ఒక సవాల్ కాగా, వాటి పంపిణి మరో పెద్ద సమస్యగా మారింది. వీటన్నింటికి మించి వార్తా సేకరణలో ప్రమాదం నెలకొంది.

ఈ ఇబ్బందులను ఎదుర్కోవడానికి చాల దిన పత్రికలు పేజీల సంఖ్యను, ప్రతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. ఉద్యోగుల జీతాలతో కోత విధించాయి. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ వార్తలను అందజేయడంలో వాటి విశ్వసనీయత గతంలో కన్నా బాగా పెరిగిన్నట్లు వెల్లడి అవుతున్నది.

ప్రజలంతా ఇండ్లకే పరిమితమై ఉండడంతో వాటిని చదవడానికి ఎక్కువ సమయం కేటాయింప గలుగుతున్నారు. అదీ గాక సోషల్ మీడియా లో నకిలీ వార్తలు, పుకార్లు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని విశ్వసింపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో సహితం ఒక వంక రాజకీయ అజెండా, మరో వంక వార్తా కథనాలలో స్పష్టత లేకపోవడం, ఒకే వార్తను పలుసార్లు చూపిస్తూ ఉండడంతో ఎక్కువ సమయంలో టివి ఛానల్స్ కోసం కేటాయింపలేక పోతున్నారు.

దాంతో విశ్వసనీయ సమాచారం కోసం ప్రజలు దిన పత్రికలను ఎక్కువగా చదువుతున్నారు. గతంలో అర్ధగంట సేపు పత్రికలను తిరగేసినవారు ఇప్పుడు ఏకంగా గంట పాటు వాటితో గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు దిన పత్రికలు చదివేవారి సంఖ్య రెట్టింపైనట్లు మార్కెట్‌ పరిశోధన సంస్థ అవాన్స్‌ ఫీల్డ్‌ అండ్‌ బ్రాండ్‌ సొల్యూషన్స్‌ సర్వేలో తేలింది.

ఈ సంస్థ సర్వే ప్రకారం పాఠకులు ప్రతిరోజు దిన పత్రికలు చదివేందుకు గతంలో కన్నా 22 నిమిషాలు ఎక్కువ కేటాయించి సగటున గంట పాటు చదువుతున్నారు. గతంలో పత్రికలు చదివేందుకు సరాసరిగా 38 నిమిషాలు కేటాయించే వారు. గతంలో పత్రికల పఠనానికి 16 శాతం మంది ఎక్కువ సమయం కేటాయించగా, ప్రస్తుతం 40 శాతం మంది తాము గంటకుపైగా దినపత్రికల్లో మునిగితేలుతున్నామని చెప్పారు.

30 నిమిషాలపాటు చదివే పాఠకుల సంఖ్య ఒకేసారి 42 శాతం నుంచి 72 శాతానికి చేరుకొన్నది. లాక్‌డౌన్‌కు ముందు దినపత్రికలను చదువడంలో 15 నిమిషాలపాటు నిమగ్నమయ్యే పాఠకుల సంఖ్య 3 శాతం ఉండగా, ప్రస్తుతం అది 14 శాతంగా నమోదయింది. స్తుతం ఆ సంఖ్య 40 శాతానికి చేరింది.

సంక్రాంతికి వాయిదా కోరిన వకీల్ సాబ్

pawan


కరోనా ఎఫెక్ట్ తో సినిమాల విడుదలలో గందర గోళ ఏర్పడు తోంది ఇప్పటికే రెడీ అయిన సినిమాల సంగతి ఇంకా ఓ కొలిక్కి రాలేదు .అలాంటి సమయం లో ` వకీల్ సాబ్ ‘ చిత్రం మరో మారు డేట్ మార్చు కొంది. నిజానికి ఆ సినిమా మొదలు పెట్టినపుడు 2019 వేసవిలో మే 15 న విడుదల చేయాలని అనుకొన్నారు. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో దసరాకి రిలీజ్ చేయాలని భావించారు. కానీ తాజా అంచనాల ప్రకారం వకీల్ సాబ్ వచ్చే సంక్రాంతి కి విడుదల అవుతుంది అంటున్నారు. ఒకపక్క షూటింగ్స్ మళ్ళీ ఎపుడు మొదలౌతాయి అన్న విషయం ఇంకా తేల లేదు. ఒకవేళ ఆగష్టు, సెప్టెంబర్ నాటికి షూటింగ్స్ మొదలైనా కానీ, థియేటర్లు తెరుచుకొన్నాగాని జనాలు సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండరు అటువంటి స్థితిలో మామూలు పరిస్థితులు రావడానికి డిసెంబర్ దాకా పట్టొచ్చు. ఆ రకంగా ఆలోచించి వకీల్ సాబ్ చిత్రాన్ని సంక్రాంతి కోసం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

నిజానికి వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిలిచిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ దిల్ రాజుకి కాల్ చేసి కాల్ షీట్స్ గురించి వర్రీ కావద్దని చెప్పాడట. షూటింగ్స్ మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చాక తన డేట్స్ ఇస్తానని చెప్పాడట. అంతేకాదు వకీల్ సాబ్ చిత్రం పూర్తయ్యాకే వేరే సినిమా చేస్తానని అని హామీ ఇచ్చాడట.

ప్రాంతీయ అభిమానం చూపెడుతున్న నయనతార


దక్షిణ భారత చలన చిత్ర రంగంలో నయనతార స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగు తోంది. ఇపుడు ఆమెకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు .ఆమెతో సినిమాలు నిర్మించడానికి పలువురు నిర్మాతలు , దర్శకులు పోటీ పడుతుంటారు. అలాంటి పిరియడ్ లో నయనతార కి ఒక మళయాళ చిత్రం లో నటించే ఆఫర్ వచ్చిందట..కాగా .ఆ చిత్రంలో ‘నరసింహా’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’గా తరహా పాత్ర నయనతార కు లభించింది.అంతే కాదు ఆ సినిమా మలయాళం తో పాటు తెలుగు .తమిళ భాషల లో కూడా విడుదల అయ్యే అవకాశముంది . .

దాంతో ఎప్పటినుంచో నీలాంబరి తరహా పాత్ర కోసం వెయిట్ చేస్తున్న నయనతార వేరే ఏమీ ఆలోచించకుండా ఆ మళయాళ సినిమాకి సైన్ చేసిందట. అదీగాక సొంత గడ్డపై చాలా గ్యాప్ తరవాత సినిమా అనే సరికి నయనతార ఆ పాత్రను చేయడానికి వెంటనే అంగీకరించిందని తెలుస్తోంది పైగా పారితోషికం విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా నేను నటిస్తానని వారితో చెప్పిందట ..అంతేకాదు ఆ సినిమా ప్రమోషన్స్ కి కూడా వస్తానని చెప్పిందట. సాధారణంగా నయనతార వేరే ఏ భాషలో సినిమా చేసినా పారితోషికం విషయంలోను , ప్రమోషన్స్ విషయంలోను చాలా నిక్కచ్చిగా ఉంటుంది. అలాంటిది ఆ రెండింటిని ఆమె పక్కన పెట్టి తన ప్రాంతీయ అభిమానాన్ని చాటుకొంటోందని సినీ జనాలు అనుకొంటున్నారు.

సరిహద్దులు దాటిన కవిత సహాయం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభన నేపథ్యంలో అనేక దేశాలు లాక్‌ డౌన్‌ ని అమలుపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకి చెందిన ఆరుగురు విద్యార్థులు లండన్‌ లో చిక్కుకుపోయారు. వారు స్వదేశానికి రాలేక అక్కడే ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ విద్యార్థులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బాసటగా నిలిచారు.

నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ ఏడాది జనవరిలో మాంచెస్టర్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ లాంక్‌షైర్‌ లో ఎంబీఏ కోర్సులో చేరారు. లాక్‌ డౌన్‌ తో విమానాలు రద్దు కావడంతో వారు అక్కడే చిక్కుకుపోగా, అక్కడి ప్రభుత్వపరంగా కూడా వారికి ఎలాంటి సాయమూ అందలేదు. దీంతో వారు తమ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని ట్విట్టర్‌ ద్వారా మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న కవిత.. వారిని ఆదుకోవాలని తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్‌ బల్మూరిని కోరారు. ఆ విద్యార్థులను సంప్రదించిన సుమన్‌.. వారికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. బ్రిటన్‌ లో పరిస్థితులు చక్కబడేవరకూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఫైటర్ సినిమా ఆగిపోయే ఛాన్స్ ఉందట..


ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో తన టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకొన్న పూరి జగన్నాధ్ ఇపుడు రెట్టించిన ఉత్సాహం తో మరో సినిమా మొదలెట్టాడు .ఆ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘ఫైటర్’ చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్రెడీ షూటింగ్ కూడా కొంత జరిగింది. ముంబైలోని ‘ధారావి’ స్లమ్ ఏరియా నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఇక్కడే విజయ్ దేవరకొండపై చాలా సన్నివేశాలను తీయాలని కూడా షెడ్యూల్ వేసుకొన్నారట …ఆ క్రమం లో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. .ఇపుడు లాక్ డౌన్ అడ్డంకి కారణంగా షూటింగు ఆగిపోయింది.

అదలా ఉంటే ఇపుడు ఊహించని రీతిలో మరో అడ్డంకి వచ్చింది .ఇటీవల ‘ధారావి’ ప్రాంతం నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ను చాలా కాలం కొనసాగించే అవకాశం కనపడుతోంది. అదీగాక లాక్ డౌన్ తరువాత కూడా అక్కడ షూటింగ్ జరపడానికి అంత తేలికగా అనుమతులు లభించకపోవచ్చని పూరీ జగన్నాధ్ టీం భావిస్తోంది. ‘ధారావి’ కథా నేపథ్యంతో ముడిపడిన ఈ చిత్రానికి అదే ప్రాంతం లో షూటింగు జరుపుకునే అవకాశం లేకుండా పోవడంతో సినిమా పూర్తి అవుతుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి .

పవన్ కి జోడీగా నివేదా పేతురేజ్


ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో సినిమా షెడ్యూల్స్ , తారాగణం అన్నిట్లో మార్పులు చేర్పులు జరగడం తప్పని సరి అవుతోంది ఇంకా చెప్పాలంటే సినిమా ప్లానింగ్ అంతా మారిపోతోంది .ఇపుడు త్వరలో ప్రారంభం కాబోయే పవన్ కల్యాణ్ చిత్రం కూడా నటీనటుల విషయం లో చాలా తర్జన భర్జన జరుగు తోంది .పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది ఈ చిత్రం తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. ఇదొక పిరియాడికల్ మూవీ. మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా నిర్మితం అవుతోంది. పండగ సాయన్న అనే ఒక తిరుగుబాటు దారుడు కథ ఇది. ఇందులో కథ అంతా ‘కోహినూర్’ వజ్రం చుట్టూ తిరుగుతుంది అంటున్నారు . ఆ వజ్రాన్ని చేజిక్కించుకునే బందిపోటు దొంగగా పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను పలువురి పేర్లు పరిశీలన లోకి వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్ అని ఒకసారి , మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ పేరు ఇంకో సారి వినిపించాయి. ఇపుడు వాళ్లిద్దరూ పక్కకు పోయి తాజాగా నివేదా పేతురాజ్ పేరు తెరపైకి వచ్చింది. కథానాయికగా ఆమె ఎంపిక కన్ఫర్మ్ అయి పోయిందని తెలుస్తోంది. నివేదా పేతురాజ్ మంచి హైట్ .. అందువలన పవన్ కళ్యాణ్ సరసన జోడీ గా బాగుంటుందనే అభిప్రాయం తో సెలెక్ట్ చేశారట.`.చిత్రలహరి , .ఆల వైకుంఠపురంలో ‘ తరవాత నివేదా పేతురాజ్ మళ్ళీ మెగా ఫామిలీ మెంబర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించు కొనడం ఆమె కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

నరేష్ ఇప్పుడు మారిన మనిషి


దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ కొడుకుగా ఆయన దారిలోనే పయనించిన నరేష్ తొలి చిత్రం ‘అల్లరి’ నే ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్ అయ్యాడు. ఆ తరవాత తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా ‘అల్లరి’ నరేశ్ తనదైన ముద్ర వేశాడు. తొలి నాళ్లలో ` నేను ` ‘ ప్రాణం ‘ `గమ్యం ‘ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్ని పోషించినప్పటికీ అవి సత్పలితాలను ఇవ్వలేదు. దాంతో కామెడీ చిత్రాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి కెరీర్ కొనసాగించాడు. ఆ క్రమంలో `కితకితలు `, ` అత్తిలి సత్తిబాబు ‘ ` సుడిగాడు ‘ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రాలే కామెడీ హీరోని చేశాయి స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టాయి.

అయితే ఇపుడు కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గింది. ఒకరకం గా చెప్పాలంటే బుల్లితెర కామెడీ కి పెద్ద పీట వేయడం తో ఆ ఎఫెక్ట్ సినిమాల ఫై పడింది. అందుకే నరేష్ ఇపుడు మళ్ళీ సీరియస్ సినిమాల వైపు ద్రుష్టి సారించాడు. అలాంటి డెసిషన్ తీసుకొని ‘బంగారు బుల్లోడు’, ‘ నాంది ‘ వంటి చిత్రాలు చేసాడు. వాటిలో `బంగారు బుల్లోడు ` చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఇక ‘నాంది’ చిత్రం ఇంకా చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి వుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలు కానుంది.కాగా ఈ చిత్రం ఫై నరేష్ గంపెడు ఆశలు పెట్టుకొన్నాడు . ‘నాంది’ చిత్రం తన సినీ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాడు. అంతేకాదు తనకు నెగెటివ్ కేరక్టర్లు చేయాలని ఉంది అని కూడా చెబుతున్నాడు .అంతేకాదు వెబ్ సిరీస్ లలోను నటించడానికి నేను సిద్ధంగానే వున్నాను . అని మనసులోని మాట బైటపెట్టాడు .

మరో బయోపిక్ లో ‘మహానటి’?


‘నేను శైలజ’ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. హీరో రామ్ కు జోడీగా నటించి మెప్పించింది. తొలి మూవీతోనే కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత నాని మూవీలో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించింది. టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతూనే దక్షిణాది చిత్రాల్లో నటించింది. కాగా దర్శకుడు నాగశౌర్య దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’లో నటించి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకుంది. అలనాటి నటి ‘సావిత్రి’ క్యారెక్టర్లో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ దక్షిణాదిలో బీజీగా స్టార్ గా మారిపోయింది.

ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగులో కలిపి నాలుగు సినిమాల్లో నటిస్తుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతోపాటు గ్లామర్ పాత్రల్లో కనిపించనుంది. యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ మూవీలో నటిస్తుంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆమె మరో క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ కృష్ణ భార్య విజయనిర్మల జీవితాధారంగా ఆమె కుమారుడు నరేష్ ఓ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ బయోపిక్ లో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఆమె భారీగా డిమాండ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమ ఈ మూవీలో నటిస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ మూవీ ప్రారంభమయ్యే నాటికి విజయ నిర్మల నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రానుంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!