Home Blog Page 8495

ఇక సాయుధ బలగాలకు స్వదేశీ ఉత్పత్తులే..

ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాలంబన పాటించాలని ఇచ్చిన పిలుపును అనుసరించి ఇక కేంద్ర సాయుధ బలగాలు, సైన్యంకు స్వదేశీ వస్తువులనే అందుబాటులోకి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

పస్వదేశీ ఉత్పత్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఇచ్చిన పిలుపుకు మొదటగా హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. జూన్ ఒకటి నుంచి దేశంలోని అన్ని కేంద్ర బలగాల (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్) క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలని షా ఆదేశించారు.

దానితో కేంద్ర బలగాలకు చెందిన 10 లక్షల మంది సైనికులు ఇకపై స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్‌జీ, ఎస్ఎస్‌బీ బలగాలన్నీ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌ కిందకు వస్తాయి.

స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనడం వల్ల రానున్న ఐదేళ్లలో దేశం నిజంగానే ఆత్మ నిర్భర్ భారత్ అవుతుందంటూ షా ట్వీట్ ఈ సందర్భంగా చేశారు. షా మార్గంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆర్మీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆర్మీ క్యాంటీన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న త్రివిధ దళాల సైనికులతో పాటు మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కూడా ఉత్పత్తులు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. ఆర్మీ క్యాంటీన్లలో కూడా స్వదేశీ ఉత్పత్తులను అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఇద్దరి మంత్రుల నిర్ణయంతో దేశంలో స్వదేశీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడే అవకాశాలు కలుగనున్నాయి.

కేసీఆర్ – జగన్ మధ్య చిచ్చు రాజేస్తున్న పోతిరెడ్డిపాడు

CM KCR Vows to Stop Andhra Irrigation Project

తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంతకాలం కేసీఆర్ ను కట్టడి చేయగలిగితే, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆయనతో స్నేహం పేరుతో ఆయన చెప్పిన్నట్లు నడుచుకొంటున్నారనే విమర్శలకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో ఇప్పుడు పోతిరెడ్డిపాటు ఇద్దరు మధ్య చిచ్చు రాజేస్తున్నది.

రాజకీయంగా పోతిరెడ్డిపాడు కేసీఆర్ – జగన్ లకు కీలకమైన, సున్నితమైన అంశం. వారి వారి ప్రాంత ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశం. ఈ అంశంపై రాజీధోరణి అవలంభిస్తే కాసులకోసం రాజీపడ్డారనే అపనింద పడవలసి వస్తుంది. అందుకు రాజకీయంగా సహితం భారీమూల్యం చెల్లింపవలసి వస్తుంది.

రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు చేపడితే నాడు కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ లోని పి జనార్ధనరెడ్డి, మర్రి శశిధరరెడ్డి వంటి నేతలు సహితం ఉగ్రరూపం దాల్చారు. అది చేబడితే తెలంగాణలో మహాబుబ్ నగర్ ప్రాంతం ఎడారిగా చేస్తుందని గగ్గోలు పెట్టారు.

ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను మరింత విస్తరించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుండటం ఒక విధంగా కేసీఆర్ ను ఇరకాటంలో పడవేసింది. ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ దోస్తీ, ఇద్దరి మధ్య ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రైతులు మండిపడుతున్నారు.

ఏపీ కట్టే ప్రాజెక్టుతో శ్రీశైలం ఖాళీ అవుతుందని.. పాలమూరు, నల్గొండ జిల్లాలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపాలంటూ రాష్ట్ర సర్కారు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

మరోవంక జగన్ కు బలం అంతా రాయలసీమ ప్రాంతం నుండే. వైసిపి ఎమ్యెల్యేలలో అత్యధికులు ఈ ప్రాంతం నుండే ఎన్నికయ్యారు. మూడు సీట్లను తప్ప అన్ని సీట్లను వైసిపి గెల్చుకొంది. అయితే టిడిపి హయాంలో రాయలసీమకు నీరు తీసుకురావడంలో కొంత చంద్రబాబునాయుడు విజయవంతం కావడంతో ఇప్పుడు నీటి సమస్యను చేపట్టాక జగన్ కు తప్పడం లేదు.

కృష్ణా నీటిని రాయలసీమకు తరలించాలనే నిర్ణయం రహస్యంగా ఏమీ జరగలేదు. ఏపీ సీఎంజగన్ బహిరంగంగానే ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ లో కడప జిల్లా పర్యటన సందర్భంగా పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు చెప్పారు. వెంటనే కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.

దానితో కేసీఆర్, జగన్ ల మధ్య లోపాయకారీ ఒప్పందం ఏదో జరిగిన్నట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దానితో కేసీఆర్ స్పందించి కృష్ణా బోర్డు కు ఫిర్యాదు చేయక తప్పదు. అయితే కృష్ణా బోర్డు జలవివాదాలు పరిష్కారంలో ఇప్పటివరకు చెప్పుకోదగిన కృషి చేసిన్నట్లు లేదు.

కృష్ణాలో అదనంగా నీటిని వాడుకొనే ఉద్దేశ్యం లేదని, తమకు హక్కు ఉన్న మేరకే వాడుకుంటామని ఈ సందర్భంగా జగన్ చెబుతున్నా నమ్మశక్యంగా లేదు. ఈ వాదన తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించబోదు.

చంద్రబాబు, వెలగపూడి.. ఓ అపశకునం..

ఇంతటి కరోనా వైరస్ టైంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణలోని తన సొంతింట్లో ఉండిపోయారు. ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తున్నా.. మరణాలు సంభవిస్తున్నా.. విశాఖలో గ్యాస్ లీక్ అయినా రాకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

చంద్రబాబు గత ప్రభుత్వంలో ఏరికోరి కట్టించుకున్న వెలగపూడిలోని సచివాలయమే ఆయన కొంప ముంచిందన్న టాక్ వినిపిస్తోంది. తన పదవి ఊడిపోవడానికి.. తనకు ఈ దుస్థితి పట్టడానికి.. ఉపద్రవాలకు ఆ వెలగపూడి సచివాలయమే కారణమని చంద్రబాబు భావిస్తున్నాడట.. అందుకే ఈ కరోనాటైంలో ఏపీలో ఉండలేక చంద్రబాబు హైదరాబాద్ మకాం మార్చాడని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా ‘వెలగపూడి’ సెంటిమెంట్ అన్నది ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి.

చంద్రబాబు గత ప్రభుత్వంలో ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు ఏరికోరి మరీ వాస్తు పట్టించుకోకుండా వెలగపూడిలో సచివాలయం కట్టించాడు.అక్కడి నుంచే పాలించాడు. అది చిన్న వర్షానికే నీళ్లు చీరి.. లీక్ అయ్యి ఎంత రాద్ధాంతం అయ్యిందో అందరికీ తెలిసిందే.. కానీ అప్పుడు జరిగిన వరసు ఉపద్రవాలు ఆ సచివాలయం వల్లేనని టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. చంద్రబాబుతో వెలగపూడి సచివాలంలో మీటింగ్ అయిన వారందరికీ ఏదో ఒక అపశకునం ఎదురైంది నాడు. ఆ తర్వాత బాబుతో మీటింగ్ అపశకునమా..? అన్న చర్చ మొదలైంది. వెలగపూడిలో ఆయన్ను కలిశాకే కొందరి ప్రాణాలు పోయాయి.. మరికొందరు పదవులు ఊడిపోయాయన్న ప్రత్యర్థుల నిజమేనా? అసలు వెలగపూడి సచివాలయం సాక్షిగా ఏం జరిగిందనేది చర్చించుకుంటున్నారు.

అప్పట్లో సినీ నటి, కం రాజకీయ నాయకురాలు జయసుధ భర్త హఠాన్మరణం చెందారు.. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనతో ఆయన చనిపోయారని వార్తలు వెలువడ్డాయి. కానీ అంతకుముందే జయసుధ భర్త వెలగపూడిలో చంద్రబాబును యాదృశ్చికంగా కలవడం గమనార్హం. అలా కలిసిన తర్వాతే జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక అంతకుముందు కూడా ఇలానే నంద్యాల ఎమ్మెల్యే సీనియర్ నేత భూమా నాగిరెడ్డి కూడా చంద్రబాబును వెలగపూడిలో కలిసిన తర్వాతే గుండెపోటుతో మరణించడం యథాలాపమా..? లేక యాదృశ్చికంగా జరిగిందో కానీ.. వెలగపూడి సచివాలయానికి మాత్రం ఆ మరక అంటింది. .

ఇక తర్వాత తమిళనాడు సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం కూడా చంద్రబాబును వెలగపూడిలో కలిశాక అమ్మ జయలలిత చనిపోవడం.. పన్నీర్ సెల్వం పదవి ఊడిపోవడం జరిగింది… దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు బాబును వెలగపూడిలో కలిస్తే ఏదో ఉపద్రవం జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఇలా ముగ్గురు కలిశారు.. ముగ్గురికి ఏదో జరిగిందని ఊదరగొడుతున్నారు..

ఇక వెలగపూడి నుంచే పాలించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు.. వాస్తు ప్రకారం ఇక్కడ ఉండడం వల్లే ఇన్ని అనర్థాలు, ఓటములు ఎదురయ్యాయని ఓ ప్రముఖ పండితుడు చెప్పాడట.. అందుకే బాబు ఇప్పుడు అవన్నీ తలుచుకొని హైదరాబాద్ లోనే ఉండిపోతున్నాడని టీడీపీలో ప్రచారం సాగుతోంది.

ఈ ప్రచారం ఎలా ఉన్నా కానీ చంద్రబాబును వాళ్లు కలవడం.. వారికి అపశకునం జరగడం మాత్రం వాస్తవం. కానీ అది బాబు వల్ల కలిగిందా.? లేదా వారి స్వయంకృతాపరాధమా అన్నది విధి వైపరీత్యం.. పాపం ఈ మొత్తం ఎపిసోడ్ లో బాబు మాత్రం బుక్కైపోవడం గమనార్హం.

‘బాబు’ రాయలసీమ బిడ్డేవేనా?

శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవోపై మీ స్టాండ్ ఏమిటి అనేది చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశించారు. అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడతారు. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు మనసు రాలేదా అంటూ ట్వీట్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల కృష్ణా నీటిని ఎత్తి కుడి ప్రధాన కాల్వలోకి విడుదల చేయడంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను 30 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నెల 5న జీవో కూడా జారీ చేసింది. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం రాజుకుంది.

దీంతో ఎంపీ విజయ సాయిరెడ్డి శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి అనే విషయాన్ని వెల్లడించాలని కోరారు. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా, బాబూ నువ్వు రాయలసీమ బిడ్డవెనా అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ రోజు 4 గంటలకు ప్యాకేజీ వివరాలు!

కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన  ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా  ఆసక్తినెలకొంది. ఈ మెగా ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ వివరాలను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆమె మీడియాతో మాట్లాడనున్నారు.

రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నిన్న ఇది భారత జీడీపీలో దాదాపు 10 శాతమని ప్రకటించారు.

ప్యాకేజీ వివరాలన్నీ ఇపుడే ప్రకటిస్తారా లేదా విడతల వారీగా ఉపశమనాన్ని ప్రకటిస్తారా అనేది స్పష్టత లేదు. మొత్తం వివరాలను ఒకేసారి ప్రకటించకపోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే మొత్తం ప్యాకేజీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తించే అవకాశం లేదనీ, ఇది బహుశా కొన్ని సంవత్సరాలు అంటే 2022  వరకు లేదా అంతకు మించి వ్యవధిలో వుంటుందని అంచనా.  ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్న భూమి, కార్మికులు, చట్టం లాంటి  అంశాల్లో   సంస్కరణ చర్యల ప్రభావం  దీర్ఘకాలికంగా దాదాపు  3-5  సంవత్సరాలు వుండొచ్చని పేర్కొంటున్నారు.

దేవుళ్లను సైతం వదలని కరోనా

ప్రపంచ వ్యాప్తగా కరోనా ఎఫెక్ట్ కొనసాగుతోంది. కరోనా చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిపై ఒకే ప్రభావం చూపుతోంది. ఆఖరికి దేవుడికి సైతం కరోనా వదలలేదు. దేశంలో కరోనా కారణంగా 50రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. మే 17తో మూడో విడుత లాక్డౌన్ ముగియనుంది. మే 18నుంచి నాల్గోవిడుత లాక్డౌన్ కేంద్రం సిద్ధమవుతోంది. కాగా ఈ లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఇక దేవుడిని నమ్ముకొని దేవాలయాల్లో పనిచేస్తున్న అనేక మంది లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పరిస్థితి. దేవాలయాలు తెరుచుకోకపోవడంతో పూజారులు, ఆలయ సిబ్బంది, వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. .

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేవాలయాల్లో అర్చకులు నిత్య పూజల్ని మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. దేవాలయాల్లోకి భక్తులను అనుమతించటం లేదు. లక్షలాది భక్తులతో కళకళలాడాల్సిన దేవాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. వచ్చే లాక్డౌన్లో దేవాలయాలకు అనుమతిలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకముందులా భక్తులు దేవాలయాలకు పొటెత్తె పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో భక్తుల ద్వారా దేవాలయాలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోవడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతో దేవాలయాలను నమ్ముకొని జీవిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ప్రపంచంలోనే రోజువారీగా అత్యధిక ఆదాయంలో ముందుండేది తిరుమల తిరుపతి దేవాస్థానం. రోజువారీ ఆదాయం రూ.3.5కోట్లకు తక్కువ కాకుండా ఉండేది. అలాంటి గడిచిన ఎనిమిది వారాలుగా పూర్తిగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో సిబ్బందికి జీతాలిచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీ ఆదాయాన్ని ఆర్జించే టీటీడీ పరిస్థితే ఇలా ఉంటే చిన్న, చితక దేవాలయాల పరిస్థితి ఊహించడమే కష్టంగా మారింది. లాక్డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో టీటీడీని మినహాయిస్తే మిగతా దేవాలయాలన్ని కలుపుకొని చూస్తే దాదాపు 200కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు ఓ అంచనా. హుండీ ఆదాయం, ప్రసాదం, ఇతర సేవలు, విరాళాల ఆదాయం వంటి వాటిని పరిగణలోకి తీసుకొని అంచనా వేసినట్లు తెలుస్తోంది.

ఇక దేవాయాలను నమ్ముకొని వ్యాపారాలు చేసేవారు భారీగా ఆదాయం కొల్పోయినట్లు తెలుస్తోంది. దేవుడి దయతో దేవాలయాలు తిరిగి తెరుచుకుంటేనే వారి జీవనం పట్టాలెక్కేలా కన్పిస్తున్నాయి. అయితే లాక్డౌన్ అనంతరం భక్తులు దేవాలయాలకు ఏమాత్రం వస్తారనేదానిపై వీరి జీవనోపాధి ఆధారపడి ఉందనేది స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా మద్యం షాపులకు అనుమతులచ్చిన ప్రభుత్వం దేవాలయాలకు మాత్రం ఎందుకు అనుమతివ్వడం లేదనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. దీనిపై సర్కార్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే..!

కృష్ణా జలాలు సీమకు తరలించాలి: ఏపీ బీజేపీ

శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ కు నీళ్ళు ఇవ్వాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణ తో ఏపి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో ఏమీ చేస్తారో తెలియదని, రాయలసీమ వారికి మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాలని తెలిపారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బిజెపి పోరాటాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతకుముందు కన్నా రెడ్డిపాలెంలోని ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ తో కలసి బాధితుల పరామర్శించారు. ఈ సెంటర్ లో 120 మంది ఉన్నారు.

శ్రీశైలం మిగులు జలాలు వినియోగిచు కోవాలని ఏపీ బీజేపీ అంటుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కృష్ణానది జలాల దోపిడిని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎపి ప్రభుత్వ జీఓ నంబరు 203ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్, కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దీక్ష చేశారు.

రానా ఫీయాన్సీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

టాలీవుడ్లో మోస్ట్ బ్యాచిలర్ గా ఉన్న రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల తన లవ్ ప్రపోజల్ ను తన ప్రేయసి ఒప్పుకుందని సోషల్ మీడియాలో షేర్ చేయగా మెగాస్టార్ చిరంజీవితోసహా పలువురు విషెస్ తెలిపారు. పలువురు హీరోలు బ్యాచిలర్ పార్టీ ఎప్పుడంటూ సరదాగా వ్యాఖ్యనించారు. దీంతో బళ్లాలదేవురి పెళ్లి ముహూర్తం ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రానా ఫియాన్సీ గురించి తెలుసుకునేందుకు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతోన్నారు.

రానా ఫియాన్సీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే..
రానా ఫియాన్సి పేరు మిహీక. ఇమె హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. బంటీ-సురేష్ బజాజ్ దంపతుల కూతురు. చెల్సియా యూనివర్సిటీ నుంచి ఇంటీరియల్ డిజైన్లో మాస్టర్ డిగ్రీ చేశారు. మిహీక స్వయంగా డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను నడుపుతోంది. ఆమె ఇంటిరియల్ డిజైన్-డెకార్ బిజినెస్ స్పెషలిస్టు. మిహీక ఇన్ స్టాను పరిశీలిస్తే తన అభిరుచులు, ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మిహీకకు డిజైనింగ్, కుకింగ్, పుస్తకాలు చదవడం, రాయడం, ట్రావెలింగ్ పై ఆసక్తి ఉన్నట్లు తెల్సింది. మిహీక చిన్నప్పటి నుంచి ఖరీదైన నగరాల్లో డిజైనర్ ప్యాలెస్ ల సందర్శనతో కలర్ ఫుల్ గా కన్పించింది.

మిహీక తల్లి బంటీ ఒక మంచి డిజైనర్. జ్యువెలరీ బ్రాండ్ అయిన క్రిసాలా ఆభరణాల డైరెక్టర్-క్రియేటివ్ హెడ్. తన తల్లి అభిరుచి కారణంగానే మిహీక కూడా డిజైనింగ్ రంగంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. తన స్థాపించిన డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో వెనుక తన తల్లి స్ఫూర్తి నిలిచిందని ఇన్ స్ట్రా పోస్టు చేసింది. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో వివాహాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తుంది. త్వరలోనే లగ్జరీ గిఫ్టింగ్ కు అంకితమైన సంస్థను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు కుమారుడైన రానా ఓ బడా బిజినెస్ మ్యాగ్నట్స్ ను త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోన్నాడు. మొత్తానికి రానా ఓ ఇంటివాడవుతుండటంతో దగ్గుపాటి ఫ్యాన్స్ ఖుషీ అవుతోన్నారు.

కృష్ణా జలాలపై ఇప్పుడు బిజెపి రెండు కళ్ళ సిద్ధాంతం!

గతంలో కీలకమైన అంశాలపై నిర్దుష్టమైన విధానం లేకుండా `రెండు కళ్ళ సిద్ధాంతం’ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు అనుసరించేవారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశమై ఇదేవిధమైన ధోరణి అనుసరించి రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు.

ఇప్పుడు బీజేపీ సహితం శ్రీశైలం నుండి కృష్ణా జలాలను తరాయించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదం ఏర్పడిన సందర్భంగా ఇదే విధానం అనుసరిస్తుంది. ఒక వంక బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కృష్ణా జలాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోకు నిరసనగా రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు.

మరోవంక, ఆ జిఓను సమర్ధిస్తూ ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఏపీకి ఉందనిస్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తేల్చి చెప్పారు.

తెలంగాణతో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో, ఏమీ చేస్తారో తెలియదని… రాయలసీమకు మాత్రం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బీజేపీ పోరాటాలు చేసిందని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.

జాతీయ పార్టీ అని చెప్పుకొనే బీజేపీ ఒకొక్క రాష్ట్రంలో ఒకొక్క విధానం అనుసరిస్తూ ప్రజల భవోద్వేగాలతో ఆటలాడుకొనే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ప్రాంతీయ పార్టీలకు ఎట్లాగూ తమ ప్రాంత ప్రజల పక్షాన నిలబడక తప్పదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ సహితం ఒక స్పష్టమైన విధానం ఆవలంభించలేదా?

ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంజయ్ కుమార్ దీక్ష చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని బీజేపీ తప్పు పడ్తోంది. జీవో 203పై తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ బోర్డ్, కోర్టుకు వెళ్ళాలని బీజేపీ డిమాండ్ చేసింది.

నీళ్లు ,నియామకాలు ,నిధులు పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ స్వార్ధ బుద్ధితో మరోసారి నీళ్ల దోపిడికి గురి అయ్యే అవకాశం ఉందని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అపర భగీరథుడు గా తన వందిమాగధులు చేత పొగిడించు కుంటున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.

భారత్ లోకి దొడ్డిదోవన చైనా పెట్టుబడులు!


భారత్ లో చైనా పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమని చట్టం తీసుకు వచ్చినా చైనా దొడ్డిదోవన ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మన దేశంలో ఉన్న చైనా పెట్టుబడులు నేరుగా కన్నా దొడ్డిదోవనే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

భారతీయ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాశతో నేరుగా కాకుండా హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి దేశాల ద్వారా భారత్‌లో పెట్టుబడుల్ని చైనా పెడుతున్నది. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న షియామీ చైనాకు చెందిన సంస్థే. అయితే ఈ కంపెనీ సింగపూర్‌ ద్వారా భారత్‌లో రూ.3,500 కోట్ల పెట్టుబడిని పెట్టడం గమనార్హం. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో ప్రస్తుతం సింగపూర్‌దే మొదటి స్థానం.

ఇక మన స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో చైనా మొబైల్‌ సంస్థల వాటా ఎంతలేదన్నా 4 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. చివరకు భారతీయ స్టార్టప్‌లైన ఉడాన్‌, డెల్హివరి, స్విగ్గీ, బిగ్‌ బాస్కెట్‌, బైజూస్‌, స్నాప్‌డీల్‌, ఓలా, ఓయో రూమ్స్‌, పేటీఎంల్లోనూ చైనా సంస్థలు టెన్సెంట్‌, అలీబాబా పెట్టుబడులు పెట్టాయి. గ్లెన్‌మార్క్‌ ఫార్మాలో హెచ్‌ఎస్‌బీసీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సుమారు 3.29 శాతం వాటాను కొనుగోలు చేసింది.

అయితే గణాంకాల ప్రకారం చూస్తే భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థల్లో చైనా స్థానం దాదాపు చివరే. సింగపూర్‌, మారిషస్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, జపాన్‌ సంస్థలే తొలి ఐదు స్థానాల్లో నిలుస్తాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా సంస్థలు భారత్‌లో కేవలం 2.34 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్‌ గోయల్‌ ఆ మధ్య పార్లమెంటులో ప్రకటించారు.

కాగా, దొడ్డిదారిన హాంకాంగ్‌, సింగపూర్‌ దేశాల మీదుగా దేశంలోకి అడుగుపెట్టిన చైనా పెట్టుబడులు 4.2 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక దేశీయ స్టార్టప్‌ల్లో చైనా సంస్థల పెట్టుబడుల విలువ ఎంతలేదన్నా 3.9 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది.

203 జీవోపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ పిర్యాదు!

ఏపీ ప్రభుత్వం పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి, శ్రీశైలం నుంచి కొత్త ఎత్తిపోతల పథకంను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ మేరకు ఏపీ 203 జీవో ను కూడా చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ సర్కార్ శ్రీశైలం నుంచి 3 టీఎంసీ నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని ఈ కొత్త ఎత్తిపోతల పథకంను ఏర్పాటు చేయడం అన్యాయమని లేఖలో ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 203 జీవోను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా రివర్ మేనేజ్‌ మెంట్ బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాలని, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని తెలంగాణ స్పష్టం చేసింది. టెండర్ల ప్రక్రియ నిలిపివేసేలా కృష్ణా బోర్డు చర్యలు చేపట్టాలని కోరింది.

ఇదే విషయంపై ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకి అన్యాయం చేయకుండా వరదల ద్వారా వచ్చి, సముద్రంలో కలిసిపోయె నీటిని మాత్రమే మా ప్రభుత్వం వాడుకోవలనుకుంటుదని ఆయన తెలిపారు. అందుకే 203 జీవో ను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

హాట్ టాపిక్.. వలస కూలీలకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలోని థానే నుండి 930 మంది వలస కూలీలతో ఒక శ్రామిక్ రైలు కర్నూల్ సిటీకి చేరుకుంది. అలా వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్ తెలడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వీరందరు గుంతకల్లు రైల్వేస్టేషన్‌ లో దిగారు. కర్నూలు జిల్లా కార్మికులు అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు.

ఇప్పటి వరకూ 254 మంది వలస కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 38 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఇందులో కర్నూలు జిల్లావాసులు 27 మంది, కడప జిల్లాకు చెందిన ఒకరు, అనంతపురం జిల్లాకు చెందిన 10 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించారు.

గతంలో  ఎమ్యెల్యే  హఫీజ్ ఖాన్ మద్దతు గల ఒక ప్రైవేట్ ఆసుపత్రి లాక్ డౌన్ సమయంలో కూడా యద్దేచ్ఛగా పనిచేయడంతో అది వైరస్ వ్యాప్తి కేంద్రంగా మారినట్లువార్తలు వచ్చాయి. దీంతో కర్నూల్ జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇప్పుడు థానే నుండి వచ్చిన వలస కూలీలకు కరోనా పాజిటివ్ రావడం కర్నూల్ ని నిద్రపట్టకుండా చేస్తుంది.

 కరోనా సామూహిక వ్యాప్తిపై అలజడి 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (సామూహిక వ్యాప్తి) దశకు రాలేదని కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ బలంగా వాదిస్తునప్పటికీ గత వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఆ మేరకు ప్రభుత్వ వర్గాలలో భయం నెలకొన్నట్లు కనబడుతున్నది. అందుకనే మే 17 తర్వాత కూడా నాలుగో దశ లాక్ డౌన్ అమలు పరచనున్నప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

మరోవంక గత వారం రోజులుగా నమోదవుతోన్న వివరాల మేరకు ‘పాజిటివ్’గా నిర్ధారణ అవుతోన్న వాళ్లలో చాలా మందికి ప్రయాణ చరిత్ర లేకపోవడం సహితం ఆందోళన కలిగిస్తున్నది. దానితో మూడో దశలోకి ప్రవేశించడంపై వాస్తవం తెలుసుకొనేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)’ కమ్యూనిటీ ఆధారిత సర్వేను చేపట్టింది.

దేశంలోని 21 రాష్ట్రాల నుంచి ర్యాండంగా ఎంపిక చేసుకున్న 69 జిల్లాల్లో దశలవారీగా ఈ సర్వేను నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సహకారంతో చేపట్టిన ఈ సర్వేకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారాన్ని కూడా తీసుకోనున్నారు.

ఈ సర్వేలో భాగంగా కొవిడ్-19 కేసుల నమోదును బట్టి ఆయా జిల్లాల్లోని 10 క్లస్టర్ల నుంచి 400 మందిని ర్యాండంగా ఎంపిక చేసి యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు చేపడతారు. అందరూ 18 ఏళ్లు పైబడిన, మొత్తం 24 వేల మందికి పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తి తీరుపై ఒక అంచనాకు వస్తారు. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తయారుచేసిన తొలి స్వదేశీ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

లాక్ డౌన్ విధించి ఇప్పటికి యాభై రోజులు పూర్తయినా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 70 వేలకు దాటగా, వారిలో 22,454 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 2,293 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008. సోమవారం రికార్డు స్థాయిలో నాలుగు వేల పైచిలుకు కొత్త కేసులు నమోదు కాగా… మంగళవారం కూడా కొత్తగా 3,604 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
మరోవంక కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని జనాభా ఆధారిత సెరో-సర్వే కూడా యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఐసీఎంఆర్ తాజా సర్వే కోసం తెలంగాణలోని కామరెడ్డి, జనగామ, నల్గొండ జిల్లాలను, ఏపీ నుంచి కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాలను ఎంపిక చేశారు. తుది ఫలితాలను బట్టి భారత్ స్టేజ్-3 లోకి ప్రవేశించిందీ, లేనిదీ నిర్ధారణ అవుతుందని ఐసీఎంఆర్ భావిస్తోంది.

జల వివాదంపై కేసీఆర్ అభ్యంతరం జగన్ బేతఖార్

కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఖాతరు చేయబోమని సంకేతాన్ని ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. పైగా `మానవత్వం’ తో ఈ అంశం చూడాలని అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.

తాము అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ చేస్తున్న వాదనలను తిప్పికొట్టారు. కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని, దీనిపై రాజకీయం చేయడం సరికాదని అంటూ కేసీఆర్ కు హితవు చెప్పారు.

రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లులేని దుస్థితి ఉందని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని జగన్ ఈ సందర్భంగా కేసీఆర్ ను కోరారు. ,మరో వంక వైసిపి నాయకులు గతంలో జగన్ కలసినప్పుడు రాయలసీమకు పెద్ద మనసుతో నీళ్లివ్వడానికి అభ్యంతరం ఉండబోదని చెప్పిన మాటలను సోషల్ మీడియాలో, టివి ఛానల్స్ లో ఇప్పుడు రికార్డు ప్లే చేస్తున్నారు.

రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేస్తూ కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం లేద‌‌న్నారు. పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి కృష్ణా బోర్డు కూడా అంగీకరించద‌‌ని అంటూ తెలంగాణతో వాదనకు సై అంటున్నారు.

‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి చాన్స్ ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు మించి ఉండదు. ఆ 10 రోజుల్లోనే నీటిని తీసుకెళ్లాలి. శ్రీశైలంలో వాటర్ లెవెల్ 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే వెయ్యి క్యూసెక్కులు మాత్రమే వెళ్తుంది’ అంటూ జగన్ స్పష్టం చేస్తున్నారు.

కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్‌‌ నుంచి వెళ్లేది గరిష్టంగా 9 వేల క్యూసెక్కులు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే సాధ్యం అని జగన్ గుర్తు చేస్తున్నారు.

అదే తెలంగాణకు శ్రీశైలం నుండి 200 టిఎంసి నీరు తీసుకొనే సామర్ధ్యం ఉన్నదని అంటూ జగన్ ఎదురు దాడికి దిగుతున్నారు. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా శ్రీశైలంలో 800 అడుగులు ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీల మేర 90 టీఎంసీలు తరలించవచ్చని చెప్పారు.

కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారన్నారు. 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి 30 టీఎంసీలు, ఎస్‌‌ఎల్‌‌బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు కూడా 40 టీఎంసీలు తరలించవచ్చని అంటూ వివరాలతో సహా వాదనకు సిద్ధమవుతున్నారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వీరే..!

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర స్థాయిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్ గా వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించారు. జిల్లాల వారీగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులగా ఏఎస్పీ లను ప్రభుత్వం నియమించింది. గుంటూరు రూరల్ జిల్లా కు కె.ఆరిఫ్ హఫీజ్, తూర్పు గోదావరి జిల్లాకు గరుడ్ సుమిత్ సునీల్, విశాఖపట్నం రూరల్ జిల్లాకు రాహుల్ దేవ్ సింగ్ విశాఖ సిటీకి అజిత వేజెండ్ల, కర్నూలు జిల్లాకు గౌతమి శాలి, కృష్ణా జిల్లాకు వకుల్ జిందాల్, చిత్తూరు జిల్లాకు రిషాంత్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది.

ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రూపుదిద్దుకుంది.రాష్ట్రంలో అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని లక్ష్యంతో బ్యూరోను ఏర్పాటు చేశారు. ఆన్ని జిల్లాల వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను, అక్రమ మద్యాన్ని నిరోధించేలా ఈ యంత్రాంగం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయనుంది.

బండి సంజయ్ పై పోలీసు కేసు!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై కేసు నమోదైంది. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో కరోనా లాక్‌ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలపైన కేసు నమోదయ్యింది. అయితే లాక్‌ డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉన్న భౌతిక దూరాన్ని పాటించలేదు. దీంతో పెద్దవూర పోలీసులు సంబయ్‌ తో పాటు పలువురిపై 188 సెక్షన్‌ క్రింద కేసులు నమోదు చేశారు. రికార్డు స్థాయిలో బత్తాయి పండించే నల్లగొండ జిల్లాలో సంజయ్ పర్యటించారు. అందులో భాగంగానే పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను బండి సంజయ్ పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వమే బత్తాయిలను కొనుగోలు చేయాలని కోరారు.‌

‘మే’లొనే రాష్ట్రాన్ని పలకరించనున్న వర్షాలు!

 

తెలంగాణలో వర్షాలు మే నెలలోనే ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు (బుధవారం) నుంచి వరుసగా 4 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అండమాన్‌ దగ్గర అల్పపీడనం ఏర్పడేలా ఉంది కాబట్టి… దాని ప్రభావం తెలంగాణ పైనా పడనుంది. ఐతే… ప్రస్తుతం తెలంగాణలో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి.

మెదక్‌ లో మంగళవారం 42.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 41.2, హైదరాబాద్‌ లో 37.6 డిగ్రీలు నమోదైంది. సాధారణంగా హైదరాబాద్ కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. దానికి తోడు రాజధానిలో లో మంగళవారం అక్కడక్కడా వర్షం కూడా పడింది.

ఇక ఏపీలోనూ వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయల సీమలో అక్కడక్కడా వానలు పడేలా కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావం వల్ల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలోకి వెళ్తుందని చెప్పారు. దానికి తోడు మధ్యప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రలోని విదర్భ పైనుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతోంది. దాని వల్ల అక్కడక్కడా మేఘాలు అలా అలా గాల్లో తేలుతూ… అటూ ఇటూ వెళ్తున్నాయి. ఇవన్నీ వర్షాలు పడేందుకు ఛాన్స్ ఇవ్వబోతున్నాయి. ఐతే… ప్రస్తుతానికి ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వానలు పడుతున్నాయి.