
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాలంబన పాటించాలని ఇచ్చిన పిలుపును అనుసరించి ఇక కేంద్ర సాయుధ బలగాలు, సైన్యంకు స్వదేశీ వస్తువులనే అందుబాటులోకి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
పస్వదేశీ ఉత్పత్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఇచ్చిన పిలుపుకు మొదటగా హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. జూన్ ఒకటి నుంచి దేశంలోని అన్ని కేంద్ర బలగాల (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్) క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలని షా ఆదేశించారు.
దానితో కేంద్ర బలగాలకు చెందిన 10 లక్షల మంది సైనికులు ఇకపై స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్‌జీ, ఎస్ఎస్‌బీ బలగాలన్నీ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ కిందకు వస్తాయి.
స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనడం వల్ల రానున్న ఐదేళ్లలో దేశం నిజంగానే ఆత్మ నిర్భర్ భారత్ అవుతుందంటూ షా ట్వీట్ ఈ సందర్భంగా చేశారు. షా మార్గంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆర్మీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఆర్మీ క్యాంటీన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న త్రివిధ దళాల సైనికులతో పాటు మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కూడా ఉత్పత్తులు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. ఆర్మీ క్యాంటీన్లలో కూడా స్వదేశీ ఉత్పత్తులను అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఇద్దరి మంత్రుల నిర్ణయంతో దేశంలో స్వదేశీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడే అవకాశాలు కలుగనున్నాయి.