
భారత్ లో చైనా పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమని చట్టం తీసుకు వచ్చినా చైనా దొడ్డిదోవన ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మన దేశంలో ఉన్న చైనా పెట్టుబడులు నేరుగా కన్నా దొడ్డిదోవనే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
భారతీయ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాశతో నేరుగా కాకుండా హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల ద్వారా భారత్‌లో పెట్టుబడుల్ని చైనా పెడుతున్నది. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న షియామీ చైనాకు చెందిన సంస్థే. అయితే ఈ కంపెనీ సింగపూర్ ద్వారా భారత్‌లో రూ.3,500 కోట్ల పెట్టుబడిని పెట్టడం గమనార్హం. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో ప్రస్తుతం సింగపూర్‌దే మొదటి స్థానం.
ఇక మన స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో చైనా మొబైల్ సంస్థల వాటా ఎంతలేదన్నా 4 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. చివరకు భారతీయ స్టార్టప్‌లైన ఉడాన్, డెల్హివరి, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, బైజూస్, స్నాప్‌డీల్, ఓలా, ఓయో రూమ్స్, పేటీఎంల్లోనూ చైనా సంస్థలు టెన్సెంట్, అలీబాబా పెట్టుబడులు పెట్టాయి. గ్లెన్‌మార్క్ ఫార్మాలో హెచ్‌ఎస్‌బీసీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సుమారు 3.29 శాతం వాటాను కొనుగోలు చేసింది.
అయితే గణాంకాల ప్రకారం చూస్తే భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థల్లో చైనా స్థానం దాదాపు చివరే. సింగపూర్, మారిషస్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ సంస్థలే తొలి ఐదు స్థానాల్లో నిలుస్తాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా సంస్థలు భారత్‌లో కేవలం 2.34 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఆ మధ్య పార్లమెంటులో ప్రకటించారు.
కాగా, దొడ్డిదారిన హాంకాంగ్, సింగపూర్ దేశాల మీదుగా దేశంలోకి అడుగుపెట్టిన చైనా పెట్టుబడులు 4.2 బిలియన్ డాలర్ల దాకా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక దేశీయ స్టార్టప్‌ల్లో చైనా సంస్థల పెట్టుబడుల విలువ ఎంతలేదన్నా 3.9 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.