
ప్రపంచ వ్యాప్తగా కరోనా ఎఫెక్ట్ కొనసాగుతోంది. కరోనా చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిపై ఒకే ప్రభావం చూపుతోంది. ఆఖరికి దేవుడికి సైతం కరోనా వదలలేదు. దేశంలో కరోనా కారణంగా 50రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. మే 17తో మూడో విడుత లాక్డౌన్ ముగియనుంది. మే 18నుంచి నాల్గోవిడుత లాక్డౌన్ కేంద్రం సిద్ధమవుతోంది. కాగా ఈ లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఇక దేవుడిని నమ్ముకొని దేవాలయాల్లో పనిచేస్తున్న అనేక మంది లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పరిస్థితి. దేవాలయాలు తెరుచుకోకపోవడంతో పూజారులు, ఆలయ సిబ్బంది, వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. .
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేవాలయాల్లో అర్చకులు నిత్య పూజల్ని మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. దేవాలయాల్లోకి భక్తులను అనుమతించటం లేదు. లక్షలాది భక్తులతో కళకళలాడాల్సిన దేవాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. వచ్చే లాక్డౌన్లో దేవాలయాలకు అనుమతిలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకముందులా భక్తులు దేవాలయాలకు పొటెత్తె పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో భక్తుల ద్వారా దేవాలయాలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోవడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతో దేవాలయాలను నమ్ముకొని జీవిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రపంచంలోనే రోజువారీగా అత్యధిక ఆదాయంలో ముందుండేది తిరుమల తిరుపతి దేవాస్థానం. రోజువారీ ఆదాయం రూ.3.5కోట్లకు తక్కువ కాకుండా ఉండేది. అలాంటి గడిచిన ఎనిమిది వారాలుగా పూర్తిగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో సిబ్బందికి జీతాలిచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీ ఆదాయాన్ని ఆర్జించే టీటీడీ పరిస్థితే ఇలా ఉంటే చిన్న, చితక దేవాలయాల పరిస్థితి ఊహించడమే కష్టంగా మారింది. లాక్డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో టీటీడీని మినహాయిస్తే మిగతా దేవాలయాలన్ని కలుపుకొని చూస్తే దాదాపు 200కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు ఓ అంచనా. హుండీ ఆదాయం, ప్రసాదం, ఇతర సేవలు, విరాళాల ఆదాయం వంటి వాటిని పరిగణలోకి తీసుకొని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
ఇక దేవాయాలను నమ్ముకొని వ్యాపారాలు చేసేవారు భారీగా ఆదాయం కొల్పోయినట్లు తెలుస్తోంది. దేవుడి దయతో దేవాలయాలు తిరిగి తెరుచుకుంటేనే వారి జీవనం పట్టాలెక్కేలా కన్పిస్తున్నాయి. అయితే లాక్డౌన్ అనంతరం భక్తులు దేవాలయాలకు ఏమాత్రం వస్తారనేదానిపై వీరి జీవనోపాధి ఆధారపడి ఉందనేది స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా మద్యం షాపులకు అనుమతులచ్చిన ప్రభుత్వం దేవాలయాలకు మాత్రం ఎందుకు అనుమతివ్వడం లేదనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. దీనిపై సర్కార్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే..!