zombie drug india : జాంబి రెడ్డి సినిమా చూశారా.. అందులో ఉన్నట్టుండి మనుషులు వంగిపోతుంటారు. భయానకంగా ప్రవర్తిస్తుంటారు. దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా తీస్తుంటారు. అటువంటివారిని జాంబీలు అని పిలుస్తారు. ఇటువంటి వారు ఉన్నారా? లేదా? అనే విషయాలను పక్కన పెడితే.. పాశ్చాత్య దేశాలలో మాత్రం జాంబీలు ఉన్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. వాళ్ల ఆధారంగానే సినిమాలు రూపొందాయని తెలుస్తోంది.
హాలీవుడ్ వారి సినిమాలను రీమేక్ లేదా కొంత నాటకీయతను కలిపి సినిమాలు రూపొందించడం తెలుగు దర్శకులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. జాంబిరెడ్డి సినిమా కూడా ఆ కోవలోనిదే. జాంబిరెడ్డి సినిమాలో మనుషులు ఉన్నట్టుండి మారిపోతారు. క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. వంగిపోయి.. దాడులకు కూడా పాల్పడుతుంటారు. అయితే ఇప్పుడు అటువంటి జాంబీ లు మనదేశంలోనూ ఉన్నారు. వారికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చాయి. అందులో ఉన్న దృశ్యాలను చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది.
తూలుతూ నడవడం.. ఒకచోట ఆగిపోవడం.. గంటల తరబడి అలానే ఉండిపోవడం వంటి దృశ్యాలు.. ఇటీవల కాలంలో ముంబై, బెంగళూరు, చండీగఢ్, లుధియానా ప్రాంతాలలో కనిపించాయి. అయితే వీరంతా జాంబి లు కాదట. మత్తు కోసం జంతువుల నొప్పి నివారణకు ఉపయోగించే బైలాజిన్ అనే పదార్థాన్ని వాడారట. పోలీసుల విచారణలో ఇది తేలింది. దీనిని జాంబి డ్ర* అని పిలుస్తారట. ఇటీవల కాలంలో యువత ఈ స్థాయిలో బైలాజిన్ పదార్థానికి బానిసగా మారిపోయి.. జాంబీలుగా వ్యవహరించింది. దీంతో పంజా పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ మొదలుపెట్టారు. పోలీసులకు విచారణలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో బైలాజిన్ అనే పదార్థాన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలని వెటర్నరీ మెడికల్ షాప్ నిర్వాహకులకు పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది.
“కొంతమంది యువత పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. వంగి వంగి నడుస్తున్నారు. ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. వారిని చూస్తుంటే మిగతావారు భయపడిపోతున్నారు. అలా భయపడి పోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. మేము ఆరా తీసి విచారణ చేపట్టాం. దీంతో అసలు వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని” పంజాబ్ పోలీసులు చెబుతున్నారు.