US Iran tensions : ఇస్లామాబాద్ వేదికగా 21 గంటలపాటు సాగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి అంగీకరించకపోవడంతో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విఫలతను ప్రకటించారు. వెంటనే స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హర్మూజ్ జలసంధిని 15 యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లతో దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన ఈ జలసంధి చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేశాయి.
పాకిస్తాన్‌కు చిక్కులు..
ఈ ఉద్రిక్తతల మధ్య అత్యంత ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకున్న దేశం పాకిస్తాన్. ‘ఎంకిపెళ్లికి సుబ్బిచావు వచ్చినట్లు‘ పాకిస్తాన్ ఇరుకున పడింది. యుద్ధం మళ్లీ మొదలైతే 2025 సెప్టెంబర్‌లో కుదిరిన స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం, సౌదీ అరేబియాపై దాడిని పాకిస్తాన్పై దాడిగా పరిగణిస్తారు. ఇరాన్ సౌదీపై ప్రతీకార దాడులు చేస్తున్న నేపథ్యంలో, పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనాల్సిన బాధ్యత ఉంది. అమెరికా ఆదేశిస్తే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనాల్సిందే. గతంలో తాను సృష్టించిన తాలిబాన్లపైనే యుద్ధం చేసింది పాకిస్తాన్. మరోవైపు చర్చలు విఫలమైన వెంటనే, సౌదీ అరేబియా కోరిక మేరకు పాకిస్తాన్ తన ఫైటర్ జెట్లను రియాద్‌కు పంపింది. ఇది ఇరాన్–అమెరికా యుద్ధాన్ని ప్రాంతీయ యుద్ధంగా మార్చే ప్రమాదం ఉంది.
సివిల్ వార్ అంచున పాకిస్తాన్..
బయటి ఒత్తిళ్లతోపాటు, లోపల కూడా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్‌కు మద్దతుగా పాకిస్తాన్‌లో వేల మంది షియాలు నిరసనలు తెలిపారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్‌లో తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రభుత్వ ఆస్తులు, సైనిక కాన్వాయ్‌లపై దాడులు చేస్తోంది. పాకిస్తాన్ నమ్మదగ్గ మిత్రుడు కాదని, దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై పాకిస్తాన్ దాడి చేస్తే, దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమై, సివిల్ యుద్ధంలోకి నెట్టివేయబడే ప్రమాదం ఉంది.
డబుల్ గేమ్ బయటపడింది!
పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోందని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చల పేరుతో, పాకిస్తాన్ జెండాలతో అమెరికా నౌకలను హర్మూజ్ జలసంధి గుండా దాటించడం ఇరాన్‌లో ఆగ్రహం రేకెత్తించింది. ఇది పాకిస్తాన్‌ను ఇరాన్ కంటికి మన్నుగా మార్చింది. మరోవైపు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయెల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానిపై ఇజ్రాయెల్, అమెరికా మండిపడటం పాకిస్తాన్‌ను మరింత ఇరుకున పెట్టింది.
అమెరికా వ్యూహం..
అమెరికా ఇరాన్‌పై దాడికి బలూచిస్తాన్‌ను వాడుకోవాలని చూస్తోంది. ఇప్పటికే బలూచ్ తిరుగుబాటుదారులు ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అమెరికా వారికి ఆయుధాలు, నిధులు అందించి, ఇరాన్‌పై దాడులు చేయించే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్‌కు మరింత తలనొప్పిగా మారనుంది.
పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. యుద్ధంలో పాల్గొనమని అమెరికా, సౌదీ రేబియా ఒత్తిడి చేసే ప్రమాదం ఉంది. దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా సహాయం కోరుతోంది. లోపల తాలిబాన్లు, బలూచ్ తిరుగుబాట్లు దేశాన్ని అస్థిరం చేస్తున్నాయి. పాకిస్తాన్ అందరినీ బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతోంది. చర్చలు విఫలం కావడంతో, ఈ గందరగోళం మరింత పెరిగింది.
