india us relations : అమెరికాకు భారత్ నమ్మదగిన మిత్ర దేశం.. మోదీ నాకు ప్రియ మిత్రుడు అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కుట్రలు చేస్తున్నాడు. తేనె పూసిన కత్తిలా వ్యవహరిస్తున్నాడు. పైకి తియ్యగా మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా వ్యూహాలు రూపొందిస్తున్నాడు. తాజాగా అమెరికా సెనేట్ రష్యాపై కొత్త ఆంక్షల బిల్లును ముందుకు తీసుకెళ్లడంతో భారత్‌కు మరో పెద్ద సవాల్‌గా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించే అవకాశం ఏర్పడింది. ఇది కేవలం వాణిజ్య చర్య మాత్రమే కాదు.. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్య సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
బిల్లు ఉద్దేశం, లక్ష్యాలు..
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా ఆదాయాన్ని తగ్గించాలనే లక్ష్యంతో అమెరికా ఈ చర్యలు తీసుకుంటోంది. రష్యా చమురు, వాయువు కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై భారీ టారిఫ్‌లు విధించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలని వాషింగ్‌ట్టన్ భావిస్తోంది. భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇది నేరుగా రష్యాపై కాకుండా, దాని ప్రధాన కస్టమర్ల ద్వారా పరోక్షంగా ఆంక్షలు విధించే వ్యూహం.
భారత్ ఎందుకు టార్గెట్..
ప్రస్తుతం భారత్ రష్యా చమురుపై గణనీయంగా ఆధారపడుతోంది. మధ్యప్రాచ్యంలోని హార్ముజ్ జలసంధి మార్గంలో ఇంధన రవాణా కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయ వనరుల అవసరం పెరిగింది. రష్యా నుంచి తగ్గింపు ధరలకు లభిస్తున్న చమురు భారత్‌కు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. అయితే ఈ ఆధారపడటమే ఇప్పుడు అమెరికా టారిఫ్ ముప్పుకు కారణమవుతోంది. 100 శాతం టారిఫ్‌లు అమల్లోకి వస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై భారీ సుంకాలు పడే అవకాశం ఉంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఇంధన భద్రతపై ప్రభావం
హార్ముజ్ మార్గంలో అంతరాయాలు ఏర్పడిన తరుణంలో రష్యా చమురు భారత్‌కు కీలకంగా మారింది. ఒకవేళ టారిఫ్‌ల ఒత్తిడితో రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాల్సి వస్తే, ప్రత్యామ్నాయ వనరుల కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులు పెరగడం వంటి దుష్పరిణామాలు ఉంటాయి.
అమెరికా ఈ చర్యను రష్యాను ఇరుకున పెట్టేందుకు తీసుకుంటున్నట్లు చెబుతున్నా, భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వాములపై ప్రభావం పడటం ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతకు దారితీయవచ్చు. భారత్ ఇప్పటికే బహుముఖ విదేశాంగ విధానం అనుసరిస్తూ వివిధ దేశాల నుంచి ఇంధనం సేకరిస్తోంది. టారిఫ్ ముప్పు నేపథ్యంలో మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలు, దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి చర్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.