spot_img
Homeజాతీయ వార్తలుSingareni: సింగరేణిలో జంగ్‌.. సాధారణ ఎన్నికల తరహాలో ప్రచారం!

Singareni: సింగరేణిలో జంగ్‌.. సాధారణ ఎన్నికల తరహాలో ప్రచారం!

Singareni: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి.. కేసీఆర్‌ సర్కార్‌ను ఆర్థికంగా ఆదుకున్నది ఈ సంస్థ కార్మికులే. ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ నల్లబంగారం వెలికి తీస్తున్న కార్మికులు సంస్థ లాభాలను ఏటా పెంచుకుంటూ పోతున్నారు. కరోనా సమయంలోనూ మంచి లాభాలను ఆర్జించారు. దీంతో సంస్థ ఆదాయాన్ని అప్పుగా తీసుకున్న కేసీఆర్‌ సర్కార్‌ వాటిని తిరిగి చెల్లించలేదు. మరోవైపు బొగ్గు కొనుగలు బకాయిలు కూడా భారీగా ఉన్నాయి. దీంతో సింగరేణిలో రెండేళ్లుగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ భయపడింది. కార్మిక సంఘాల అనేక పోరాటాల తర్వాత ఎట్టకేలకు గుర్తింపు సంఘం ఎన్నికలకు యాజమాన్యం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 27న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో దాదాపు ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా మేనిఫెస్టోలు రిలీజ్‌ చేస్తున్నాయి.

11 ఏరియాలు.. 39,748 మంది కార్మికులు..
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది పర్మినెంట్‌ కార్మికులు ఓటుహకు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ వంటి సంఘాలు పోటీపడుతున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ మధ్యనే కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు భంగపాటు తప్పేలా లేదు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌–సీపీఐ కూటమి అధికారంలోకి రావడం ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీలకు ప్లస్‌పాయింట్‌. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేసినా.. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేయడం లేదు.

84 పోలింగ్‌ కేంద్రాలు
ఇక ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్‌ కోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. కార్పొరేట్‌ ఏరియాలో ఐదు, కొత్తగూడెంలో ఆరు, ఇల్లెందులో మూడు, మణుగూరులో ఏడు, రామగుండం–1లో 11, రామగుండం– 2లో ఆరు, రామగుండం– 3లో ఆరు, భూపాలపల్లిలో 9, బెల్లంపల్లిలో 5, మందమర్రిలో 11, శ్రీరాంపూర్‌ లో 15 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ రోజు రాత్రే ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం 12 ఓట్ల లెకింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కార్మికశాఖ తెలిపింది.

గనులపై ప్రచార హోరు..
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కార్మిక సంఘాలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. భూగర్భ, ఓపెన్‌కాస్టు గనులపై గేట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నాయి. కార్మికులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. తాము గతంలో ఏం చేశాము.. ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తామో వివరిస్తున్నారు. ప్రస్తుత సంఘం టీబీజీకేఎస్‌ పాలనలో సింగరేణి ఎలా అప్పుల్లో కూరుకుపోయింది. కార్మికుల హక్కులు ఎలా హరిస్తుంది, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యాలను వివరిస్తున్నారు. దీంతో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది.

వాయిదాకు యత్నాలు
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ అసలివి జరుగుతాయా? అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లి ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ గతంలో ఎన్నికల వాయిదాకు అనేక ప్రయత్నాలు చేసింది. తాజాగా గెలిచే అవకాశం లేనందున ఎన్నికలు వాయిదా వేయించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular