Singareni Election: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లయినా.. గత సీఎం కేసీఆర్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఒకే ఒక్కసారి నిర్వహించారు. 2017 నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్(ప్రస్తుతం బీఆర్‌ఎస్) అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనేక హామీలు ఇచ్చారు. దీంతో జాతీయ సంఘాలను కాదని కార్మికులు ప్రాంతీయ సంఘానికి పట్టం కట్టారు. అంతకుముందు 2013లోనూ టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచింది. నాడు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సింగరేణి కార్మికులు కూడా స్థానిక సంఘాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు.
గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా..
2017లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన టీబీజీకేఎస్ పదవీకాలం నాలుగేళ్లు. 2021లో దాని గడువు ముగిసింది. కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దీంతో గడువు ముగిసినా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకాడుతూ వచ్చింది. దీంతో జాతీయ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. చివరి వరకు ఎన్నికలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఎట్టకేలకు డిసెంబర్ 27న ఎన్నికలు జరిగాయి.
మళ్లీ అరుణ పాతం రెపరెపలు..
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మరోమారు అరుణ పతాకం రెపరెపలాడింది. జాతీయ సంఘాలు సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో.. ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఐఎన్టీయూ సీపై దాదాపు 2 వేల ఓట్ల ఆధిక్యంతో ఏఐటీ యూసీ గెలుపొందింది.
ఎక్కువ డివిజన్లలో గెలిచినా..
సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించగా ఏఐటీయూసీ 5 డివిజన్లలో ఐఎన్‌టీయూపీ 6 డివిజన్లలో ప్రాతినిధ సంఘాలుగా విజయం సాధించాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్ పరిధిలోని రామగుండం–1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం–3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. ఐఎన్‌టీయూసీ ఎక్కువ డివిజన్లు గెలిచినా.. ఓట్ల పరంగా ఏఐటీయూసీకే ఎక్కువ శాంత పోలయ్యాయి. దీంతో ఎర్రజెండా యూనియన్ ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా ప్రకటించారు.