30 LPA Job: పడిపోవడం తప్పు కాదు. పడిపోయినప్పటికీ లేవడం గొప్ప. ఓడిపోవడం తప్పు కాదు. ఓడిపోయినప్పటికీ గెలవడం గొప్ప. ఈ డైలాగులు సినిమాటిక్ లాగా కనిపిస్తుంటాయి. వాస్తవ జీవితంలో విజేతల చరిత్రలను చూస్తుంటే కచ్చితంగా ఈ డైలాగులు రియల్ లైఫ్ లో కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంటాయి.
అతడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశేషమైన అనుభవం ఉంది. బ్రహ్మాండమైన జీతంతో పనిచేశాడు. కూర్చుని పని చేయడం వల్ల అతడికి సయాటికా సమస్య వచ్చింది. ఒక దశలో కూర్చోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. వైద్యులను సంప్రదించాడు. వారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొద్ది నెలలపాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు. ఐ టి ఇండస్ట్రీలో ఒక్కసారి ఉద్యోగం నుంచి తప్పకున్న తర్వాత .. మళ్లీ కొత్త ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. ఇది అతడికి అనుభవంలోకి వచ్చింది. ఈ గ్యాప్ లో అతడేకంగా 36 ఇంటర్వ్యూలు ఫేస్ చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా జనరేషన్ ఏఐ నేర్చుకున్నాడు. టూల్స్ మీద పట్టు సాధించాడు. ఏఐ మీద విపరీతమైన గ్రిప్ సాధించడంతో.. అతడికి తిరుగులేకుండా పోయింది.
ఏఐ మీద పట్టు సాధించినప్పటికీ అతడు దాదాపు 36 కంపెనీల ఇంటర్వ్యూలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ అతడు తన ప్రయత్నాలను వదులుకోలేదు. ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. దూకుడుగా ముందుకు సాగాడు. తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకున్నాడు. ఫలితంగా అంతిమ విజయాన్ని సాధించాడు. అతడి నేర్పును.. ఓర్పును పరిశీలించిన యాజమాన్యం ఏకంగా 30 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. ఈ ప్రకారం నెలకు 500000 అతని జీతం. దీనిని బట్టి ఓపిక ఉంటే ఎంతటి అద్భుతాలు సాధించవచ్చో అతడు నిరూపించాడు.
తాను ఇంతకాలం ఇంటర్వ్యూలకు వెళ్లిన 36 కంపెనీల వివరాలను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంటర్వ్యూల సమయంలో తనకు ఎదురైన అనుభవాలను.. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అతడు పూసగొచ్చినట్టు చెప్పాడు. ప్రతి ఇంటర్వ్యూ తనకు కొత్త అనుభవాన్ని నేర్పినట్టు అతడు వెల్లడించాడు. స్థిర చిత్తాన్ని కోల్పోకుండా.. భయాన్ని దరి చేరనివ్వకుండా అతడు సాగించిన ఉద్యోగ ప్రయత్నం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది.. ఉద్యోగం లేదని.. ఉద్యోగం రాదని.. కంపెనీలు తీసుకోవని.. ఇలా ఏ సందర్భంలో కూడా అతడు భయపడలేదు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేసి చివరికి విజేతగా నిలిచాడు.