ISIS Magazine : తీవ్రవాదంతో మానవహక్కులను హరిస్తున్న అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ తాజాగా భారత్ పై పడింది. హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయాలంటూ పిలుపునిచ్చింది. అంతేకాదు.. తన మేగజైన్ పై శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తలను తీసేసి తన జెండాను ఎగురవేసిన ఫొటో ఉంచింది. ఇది ఇప్పుడు తీవ్ర వివాదమైంది. ఐసీస్ పై భారతీయులు, హిందుత్వవాదులు మడిపడుతున్నారు.

భారతదేశంలోని విగ్రహాలను ధ్వంసం చేయాలని ఐసిస్ మ్యాగజైన్ పిలుపునివ్వడంపై భారతీయులు భగ్గుమంటున్నారు. ఒక శివుడి విగ్రహాన్ని మార్ఫింగ్ చేసి తల తీసేసి ఐసిస్ జెండాను ఉంచి మ్యాగజైన్ కవర్ గా ఫొటోగా పెట్టి దుశ్చర్యకు దిగింది. ఈ కవర్ ఫొటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌చల్ చేస్తూ నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ చిత్రంలో ఉన్న విగ్రహం కర్ణాటకలోని మురుడేశ్వరాలోని శివాలయంలో ఏర్పాటు చేసిన భగవాన్ శివుని విగ్రహాన్ని పోలి ఉంటుంది.
కర్నాటకలోని కుమటాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దినకర్ కేశవ్ శెట్టి ఈ చిత్రాన్ని గమనించారు. ఈ చిత్రాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రభుత్వం ఐసిస్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కన్నడలో శెట్టి తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. “ముర్డేశ్వర ఆలయంలోని శివ విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కుట్రపన్నింది. వాయిస్ ఆఫ్ హింద్ అనే పత్రిక సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హిందూ దేవాలయాల రక్షణ.. అభివృద్ధి మా పార్టీ ప్రధాన సూత్రాలలో ఒకటి. అటువంటి బెదిరింపులకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు మా రక్షణ శాఖ పటిష్టమైనది. ఇప్పటికే హోంమంత్రికి ఫోన్ ద్వారా సమాచారం పంపాం. త్వరలో ముర్డేశ్వర ఆలయం వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తారు. పత్రికపై భారత ప్రభుత్వ చర్య లు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 2020లో అల్-ఖితాల్ మీడియా సెంటర్ ఐసిస్ అనుకూల మీడియా సంస్థ, జునుదుల్ ఖిలాఫహ్ అల్-హింద్ కలిసి ‘వాయిస్ ఆఫ్ హింద్’ పత్రికను ప్రారంభించాయి. ది ప్రింట్‌లో సెప్టెంబర్ 2021 నుండి వచ్చిన నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ – బంగ్లాదేశ్‌లలో ‘కాల్ సెంటర్ తరహా సెటప్’లో ఈ పత్రికను నిర్వహిస్తున్నారు. ఆ దేశాల్లోనే ఈ ప్రచార మ్యాగజైన్ తయారు చేయబడిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తెలిపింది. అర్హతగల గ్రాడ్యుయేట్లు.. అనువాదకులు ఈ పత్రికను నడిపిస్తున్నారని తెలిపింది.
మొదట్లో, ఈ పత్రిక ఆఫ్ఘనిస్తాన్ నుండి వెలువరించారని భావించారు. కాని తరువాత సాంకేతిక నిపుణుల సహాయంతో వారు దక్షిణ కాశ్మీర్ నుంచి దీన్ని తయారు చేశారని లింక్ లను పసిగట్టారు. మ్యాగజైన్ పాకిస్థాన్‌లో ఎడిట్ చేశారని తేలింది.. కంటెంట్ సృష్టికర్తలను మాల్దీవులు.. బంగ్లాదేశ్ నుండి నియమించుకున్నారని నివేదిక పేర్కొంది.
జూలై 2021లో ఎన్ఐఏ అనంత్‌నాగ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరిని ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్ మరియు రమీజ్ అహ్మద్ లోన్ అని గుర్తించారు. వీరు యువతలో ఐసిస్ ప్రచార కంటెంట్‌ను సేకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మ్యాగజైన్‌లో ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు, ఎస్‌డీ కార్డ్‌లు తదితర డిజిటల్ పరికరాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది.
ఆగస్ట్ 2021లో ఎన్ఐఏ కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన జుఫ్రీ జవహర్ దాముడి అలియాస్ అబూ హజీర్ అల్ బద్రీగా గుర్తించబడిన కీలకమైన ఇస్లామిక్ స్టేట్ ఆపరేటర్ ను అరెస్టు చేసింది. అమీన్ జుహైబ్ అనే మరో కార్యకర్తను కూడా అరెస్టు చేశారు. ఈ మ్యాగజైన్‌పై ఏజెన్సీ విచారణకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. అక్టోబర్ 2021లో ఐసిస్ ప్రచార పత్రిక ప్రచురణకు సంబంధించి ఎన్ఐఏ కాశ్మీర్‌లో అనేక దాడులు నిర్వహించింది. తాజాగా ఐసిస్ అన్నంత పనిచేసి భారతీయ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయాలని పిలుపునిస్తూ కవర్ పేజీ విడుదల చేయడం సంచలనమైంది.