Venezuelan President Nicolas Maduro: వెనిజుల అధ్యక్షుడిని అమెరికా అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అదే కాదు, మదురో ను అరెస్ట్ చేసిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికా సైన్యం విజయవంతమైన పని చేస్తుందని అందులో రాసుకోచ్చారు. మదురో ను అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్తున్న ఫోటోలు ట్రంప్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది.
మదురో అరెస్ట్ తర్వాత వెనిజులా ప్రాంతంలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో అమెరికా ఏం చేస్తుంది? తనకు నచ్చిన వ్యక్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తుందా? ఉన్న ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని.. తోలుబొమ్మ లాగా ఆడిస్తుందా.. ఈ ప్రశ్నలకు మరి కొద్ది రోజుల్లోనే సమాధానాలు లభిస్తాయి.
మదురో ను అరెస్ట్ చేసిన తర్వాత అమెరికా సంబరాలు చేసుకుంటున్నది. వాస్తవానికి మదురో ఓవర్ నైట్ లో వెనిజులా దేశానికి అధ్యక్షుడు కాలేదు. అతడు చిన్న స్థాయి నుంచి తన జీవితాన్ని మొదలుపెట్టాడు. ఒక బస్సు డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చాడు. క్రమ క్రమంగా ఎదిగాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. వెనిజులా అధిపతి హ్యూగో చావేజ్ కు ప్రధాన అనుచరుడిగా మారిపోయారు. ఆ తర్వాత రాజకీయాలలో ఎదిగారు.
చావెజ్ కన్ను మూసిన తర్వాత 2013లో వెనిజులా దేశానికి అధ్యక్షుడయ్యారు. అయితే ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ఇదే క్రమంలో మదురో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని విమర్శలు వినిపించాయి. చివరికి అమెరికా మాదక ద్రవ్యాలను సాకుగా చూపించి.. వెనిజులా మీద దాడి చేసింది. మదురో ను అరెస్ట్ చేసింది.
మదురో మొదటి నుంచి కూడా స్వయం ప్రతిపత్తి కల నాయకుడు. అనేక సందర్భాలలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. ఇది సహజంగానే అమెరికాకు కడుపు మంటగా మారిపోయింది. దీంతో సమయం కోసం ఎదురుచూసిన ఆ దేశం. మదురో కు చెక్ పెట్టింది. అనేక విషయాలలో ఆయనకు అడ్డు తగిలింది. చివరికి దేశం మీద దాడి చేసి.. సైన్యాన్ని మోహరించి.. అరెస్టు చేయించింది. మదురో ను అరెస్ట్ చేసిన తర్వాత.. అతడిని అమెరికా తన అదుపులో ఉంచుకుంటుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాతనే బయటికి విడుదల చేస్తుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ విడుదల చేసినా.. సొంత దేశంలో అతడిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి.. కాలగర్భంలో కలిపేలా చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.