Nicolas Maduro: దేశాల అధినేతల మధ్య అహాలు పెరిగిపోతే.. ఆధిపత్యాల కోసం పోరాటాలు ఎక్కువైతే.. చివరికి ప్రజాస్వామ్యం అనేది కాలగర్భంలో కలిసిపోతుంది. ఆధిపత్య పోరులో గెలిచేవారే నిలబడతారు. ట్రంప్, మదురో మధ్య మొదలైన పోరాటంలో చివరికి ట్రంప్ నిలబడ్డాడు. మదురో భూమ్మీద నరకం లాగా పేరుపొందిన న్యూయార్క్ బ్రూక్లిన్ జైల్లో ఖైదీగా ఉన్నాడు.
న్యూయార్క్ బ్రూక్లిన్ జైలు అనేది భూమ్మీద నరకం గా పేరుపొందింది. ఇప్పుడు ఆ జైలు నుంచి బయటపడడం అంత సులభం కాకపోవచ్చు. మదురో, ఆయన భార్య సిలియా మీద అమెరికా మాదక ద్రవ్యాల నిరోధక బృందం నార్కో టెర్రరిజం కేసు నమోదు చేసింది. ఇంకా అనేక రకాలైన కేసులను వారిపై నమోదు చేసింది.
ఇన్ని కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు బయటపడడం అసాధ్యమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా కోర్టులో మదురో తనను తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అయితే ఇది అంత సులువైనది కాదు. అమెరికా ఫెడరల్ కోర్టు ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు. పైగా ప్రస్తుతం ట్రంప్ అధికారంలో ఉన్నాడు. ఇప్పటికే వెనిజులా మీద అమెరికా కంపెనీలను ఉసి గొలిపాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనిజుల ప్రాంతంలో అమెరికా ముద్రను తొలగించుకోవడానికి ట్రంప్ ఇష్టపడడం లేదు. అలాంటప్పుడు వెనిజుల అధ్యక్షుడి మీద బలమైన అభియోగాలు.. వాటికి తగ్గట్టుగా సాక్ష్యాలు సమర్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నేరం ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా శిక్ష తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే మదురో కు జీవిత ఖైదు పడవచ్చని.. మరణశిక్ష దాదాపు అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
లాటిన్ అమెరికా దేశాలు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడం.. వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం లేదంటే దాని మిత్రదేశాలు అమెరికాతో సంప్రదింపులు జరిపి మదురో విడుదల కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
మొదటి రెండు పద్ధతులు విఫలమైతే.. ఇక మూడోది అమెరికా, వెనిజులా మధ్య రాజకీయ ఒప్పందం కుదరాలి. అప్పుడు ఆయనను విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. మూడు ఆప్షన్లలో మూడోదానికి ఎక్కువ అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మదురో కు అత్యంత విశ్వాసపాత్రురాలైన డెల్సి రోడ్రిగ్జ్ వెనిజులా దేశానికి అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈమెకు అమెరికా చమురు ఇండస్ట్రీలోని రిపబ్లికన్లు, వాల్ స్ట్రీట్ వర్తకులతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె తలుచుకుంటే అమెరికాతో డీల్ కుదిరే అవకాశం ఉంది.