Homeజాతీయ వార్తలుDera Baba Nanak Railway Station: 1947 విభజన గాథకు నిశ్శబ్ద సాక్షి: పంజాబ్‌లోని ఈ...

Dera Baba Nanak Railway Station: 1947 విభజన గాథకు నిశ్శబ్ద సాక్షి: పంజాబ్‌లోని ఈ ’చివరి’ రైల్వే స్టేషన్‌ కథ తెలుసా?

Dera Baba Nanak Railway Station: 1947, ఆగస్టు 15న భారత దేశానికి బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం వచ్చింది. అంతకన్నా ముందే.. అఖండ భారతదేశం రెండుగా విడిపోయింది. ముస్లింలంతా పాకిస్తాన్‌గా విడిపోయారు. అయితే బ్రిటిష్‌ పాలనలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో రావి నది ఎడమ ఒడ్డున ఉన్న డేరా బాబా నానక్‌ రైల్వే స్టేషన్‌ 1947 నాటి దేశ విభజన వేదనను ఇప్పటికీ మౌన సాక్షిగా నిలిచింది. ఇక్కడికి వచ్చినవారు ఈ స్టేషన్‌ను చూసి ఆశ్చర్యపోతారు. […]

Dera Baba Nanak Railway Station: 1947, ఆగస్టు 15న భారత దేశానికి బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం వచ్చింది. అంతకన్నా ముందే.. అఖండ భారతదేశం రెండుగా విడిపోయింది. ముస్లింలంతా పాకిస్తాన్‌గా విడిపోయారు. అయితే బ్రిటిష్‌ పాలనలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో రావి నది ఎడమ ఒడ్డున ఉన్న డేరా బాబా నానక్‌ రైల్వే స్టేషన్‌ 1947 నాటి దేశ విభజన వేదనను ఇప్పటికీ మౌన సాక్షిగా నిలిచింది. ఇక్కడికి వచ్చినవారు ఈ స్టేషన్‌ను చూసి ఆశ్చర్యపోతారు. రైలు పట్టాలు సరిహద్దుకు కొన్ని వందల మీటర్ల ముందే అకస్మాత్తుగా ఆగిపోతాయి. ఆ ఆగిపోయిన పట్టాల వెనుక దాగి ఉన్న కథే ఈ స్టేషన్‌ను ప్రత్యేకం చేస్తోంది.

1927లో మొదలైన చరిత్ర
బ్రిటిష్‌ కాలంలో 1927లో నిర్మించిన ఈ స్టేషన్‌ అప్పటి అవిభక్త పంజాబ్‌ రైల్వే నెట్‌వర్క్‌లో ముఖ్యమైన భాగం. అమృత్‌సర్‌ నుంచి సియాల్‌కోట్‌ వైపు వెళ్లే మార్గంలో ఇది కీలక స్టాప్‌గా ఉండేది. రైళ్లు ఇక్కడి నుంచి నరోవాల్‌(సుమారు 37 కిలోమీటర్ల దూరం), కర్తార్‌పూర్‌ సాహిబ్, సియాల్‌కోట్, లాహోర్‌ వంటి ప్రాంతాలకు నడిచేవి. రావి నది వంతెన దాటి ప్రయాణాలు సాగేవి. ప్రయాణికులు, వ్యాపారులు, సైనిక సరఫరాలు అన్నీ ఈ మార్గం ద్వారానే జరిగేవి. స్టేషన్‌ చుట్టూ ఉన్న నివాస క్వార్టర్స్, వెయిటింగ్‌ రూమ్‌లు బ్రిటిష్‌ శైలి నిర్మాణాలతో కళకళలాడేవి.

విభజనతో తెగిపోయిన అనుబంధం
1947 సెప్టెంబర్‌ చివర్లో ఇక్కడి నుంచి పాకిస్తాన్‌వైపు వెళ్లిన చివరి రైలు ఆగిన తర్వాత ఇక ఆ దిశగా ప్రయాణాలు జరగలేదు. కొత్త సరిహద్దులు ఏర్పడటంతో నారోగేజ్‌ ట్రాక్‌ను శాశ్వతంగా నిలిపివేశారు. స్టేషన్‌ టెర్మినస్‌గా మారిపోయింది. ఒకప్పుడు రెండు ప్రాంతాల ప్రజలను, బంధుత్వాలను, వాణిజ్య సంబంధాలను కలిపిన మార్గం ఒక్కసారిగా తెగిపోయింది. ఇప్పుడు ఆ పట్టాలు పొదలు, చెట్ల మధ్య నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. విభజన కాలంలో శరణార్థుల రైళ్లు కూడా ఈ మార్గం ద్వారానే తిరిగినట్లు స్థానికులు చెబుతారు.

కర్తార్‌పూర్‌ కారిడార్‌తో కొత్త ఆకర్షణ
ఈ ప్రాంతం గురునానక్‌ దేవ్‌జీ జన్మస్థలానికి సమీపంలో ఉండటంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంది. 2019లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభమైన తర్వాత భక్తులు, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వచ్చి సరిహద్దు ముందే ముగిసిపోయిన పట్టాలను చూసి విభజన కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఒకప్పుడు రైలు మార్గం ద్వారా కలిసిన ప్రదేశాలు ఇప్పుడు కారిడార్‌ ద్వారా భక్తులను కలుపుతున్నాయి.

వారసత్వ పరిరక్షణ సవాలే..
ఇటీవల కాలంలో స్టేషన్‌లోని పాత నివాస క్వార్టర్స్‌ను ఆధునీకరణ పేరుతో కూల్చివేస్తున్నారు. స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని వారసత్వ సంపదగా పేర్కొంటున్నారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ వచ్చిన తర్వాత ఈ స్టేషన్‌ను హెరిటేజ్‌ గుర్తింపు ఇస్తారని ఆశించారు. కానీ, అది జరగలేదు. బ్రిటిష్‌ కాలం నాటి నిర్మాణాలు క్రమంగా కనుమరుగవుతుండటంతో చరిత్ర ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

కాలం మారినా ఈ చివరి రైలు పట్టా మాత్రం మారలేదు. అది రెండు దేశాల మధ్య తెగిపోయిన అనుబంధాలకు, ఆగిపోయిన ప్రయాణాలకు, వేలాది కుటుంబాల వియోగానికి నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తోంది. 1947 విభజన గాథను తరాలకు చెబుతున్న జీవంత చిహ్నం. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper