Telangana Health Director: ” కెసిఆర్ తెలంగాణ బాపు. ఒక్కసారి కాదు వందసార్లు ఆయన కాళ్లు మొక్కుతా.” ఇలా అన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు. కానీ అదే సమయంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు చనిపోతే ఈ సార్ కు కనీసం కనికరం కూడా ఉండదు. పైగా దీనిని ప్రసారం చేయకూడదని మీడియా హౌస్ లకు ఫోన్ చేస్తుంటాడు. ఆమధ్య కొత్తగూడెం జిల్లా పరిధిలో ఓ ఎంపీపీ ఇంట్లో జరిగిన పూజల్లో పాల్గొని వార్తల్లో వ్యక్తి అయ్యాడు. తర్వాత ఏవో ఖండిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఈ సార్ కు కొత్తగూడెం నియోజకవర్గం పైన వల్ల మాలిన ప్రేమ ఏర్పడింది.. ప్రతిభవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. ఇంకేముంది వారానికి రెండుసార్లు ఇక్కడే వాలిపోతున్నాడు.. తన తండ్రి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు.

క్రీస్తు కరోనా తగ్గించాడట
ఈ మాట అన్నది సాక్షాత్తు ప్రజారోగ్య శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు. నిన్న కొత్తగూడెంలో తన తండ్రి పేరు మీద నెలకొల్పిన జి ఎస్ ఆర్ ట్రస్ట్ పేరిట సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించాడు.. ఈ సందర్భంగా పలు పాస్టర్లను సన్మానించాడు. మైక్ దొరికితే ఊగిపోయే ఈ అధికారి… ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.. ఏసుక్రీస్తు దయ వల్లే కోవిడ్ తగ్గిందని వ్యాఖ్యానించాడు. అదే ఏసుక్రీస్తును బాగా స్తుతించే పాశ్చాత్య దేశాల్లో ఇవాల్టికి కేసులు నమోదవుతున్నాయి.. పవిత్ర ప్రదేశంగా పిలవబడే వాటికన్ సిటీలో ఇవాల్టికి సందర్శనకు అనుమతి లేదు.. దీని గురించి గడల సార్ ఏం చెబుతారో? ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆయన వెంటనే ప్రెస్ నోట్ విడుదల చేశాడు. అది కూడా తన వ్యాఖ్యలు మీడియా వక్రీకరించిందని అంకమ్మ శివాలు ఎత్తాడు.. పాపం గడల సార్!

సార్ మామూలోడు కాదు
గడల శ్రీనివాసరావు.. చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే మీడియాలో ప్రచారం కోరుకునేందుకే అన్నట్టుగా అర్థమవుతున్నది. 2021లో కోవిడ్ బాగా ప్రబలినప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులు విడుదల చేస్తే అప్పట్లో వైద్యారోగ్య శాఖ కమిషనర్ గా ఉన్న వాకాటి కరుణ, శ్రీనివాసరావు కలిసి నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు కేంద్ర వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా… గడల శ్రీనివాసరావు తనకున్న పలుకుబడి ద్వారా దానిని వెలుగులోకి రానీయకుండా చేసినట్టు సమాచారం. అంతేకాదు ప్రగతి భవన్ కు అత్యంత ఇష్టుడైన ఈ అధికారి… వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్నట్టు సమాచారం.. అందుకోసమే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెం వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన సొంత సామాజిక వర్గంలో పట్టు పెంచుకునేందుకు డబ్బులు బాగా వెదజల్లుతున్నట్టు సమాచారం.. దీనిపై ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది గడల శ్రీనివాసరావును విభేదించగా… వారిని మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల కొత్తగూడెం వైద్యుడు కళాశాలను వర్చువల్ విధానంలో కెసిఆర్ ప్రారంభించినప్పుడు… గడల శ్రీనివాసరావు ఏకంగా ఆయన కాళ్ళను మొక్కాడు. అంతకుముందు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో కాళ్లకు బూట్లు ధరించి నృత్యాలు చేశాడు. సొంత ప్రాపకం కోసం ఏదైనా చేసే గడల శ్రీనివాసరావు.. ప్రజారోగ్యశాఖకు ఆశించినంత మేర పని చేయకపోవడం తెలంగాణ చేసుకున్న దురదృష్టం.