
Kingfisher Beers : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్ వేసి మరీ ప్రభుత్వం అమ్ముతోంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అంటే ఇదేనేమో. ఈ నేపథ్యంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం నడవడానికి ఇదే ఇంధనంగా పనిచేస్తోంది. దీంతో ఏ ప్రభుత్వం కూడా మద్య నిషేధం చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. గతంలో పాదయాత్ర సమయంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం విధిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇంకా దుకాణాల సంఖ్య పెంచి అందరిలో విస్మయం కలిగించారు. ఈ క్రమంలో మద్యం వ్యాపారం ప్రభుత్వాలకు కలిసొచ్చే పంటగా మారింది.
-కింగ్ ఫిషర్ బీర్లు..
దీంతో జగిత్యాల జిల్లాలో ఓ మద్యం ప్రియుడు ఏకంగా జిల్లా కలెక్టర్ కే కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని ఫిర్యాదు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. నకిలీ బీర్లతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్టు షాపులున్నా కింగ్ ఫిషర్ బీర్లు మాత్రం దొరకడం లేదు. దీంతో ఏవో బీర్లు తాగడం వల్ల మా ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడం గమనార్హం. మద్యం తాగాలనుకున్నా మంచి బీర్లు అందుబాటులో ఉండకపోతే మా ఆరోగ్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు.
-కలెక్టర్ కే ఫిర్యాదు
జగిత్యాల జిల్లా బీరం రాజేశ్ అనే యువకుడు తమకు బీర్లు దొరకడం లేదని జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకోవడం సంచలనం కలిగించింది. సాధారణంగా మంచినీరు, రోడ్లు, ఇతర సమస్యల గురించి పిటిషన్ ఇవ్వడం సాధారణమే. కానీ బీర్లు దొరకడం లేదని పిటిషన్ ఇచ్చాడు. తమ జిహ్వ చాపల్యానికి సరిపడ బీర్లు దొరకడం లేదన్నాడు. గ్రామాల్లో నకిలీ బీర్లు అంటగడుతూ మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడున్నారని వాపోయారు. జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
-ప్రజావాణిలో..
ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చిన అనంతరం రాజేశ్ మాట్లాడుతూ నాసిరకం బీర్లు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించాడు. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల వంటి చోట్ల సిండికేట్ గా మారి పనికి రాని బీర్లు విక్రయిస్తున్నారని వాపోయాడు. దీనిపై చర్యలు తీసుకుని మద్యం వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండేందుకు ఆదేశాలు జారీ చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి మా సమస్య తీర్చాలని మొరపెట్టుకున్నాడు.
