CID Case On RamojiRao : స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు నేపథ్యంలో సిఐడి అధికారులు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలను వెల్లడించారు.. డిపాజిట్ల సేకరణలో మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని పేర్కొంటున్నారు. చందాదారులు నెలవారీ మొత్తం చెల్లించకపోయినా, వాయిదాల మొత్తం చెల్లించకపోయినా ఆ ఖాతాలను మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో చూపించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఆ చీటీలను ఇతర వ్యక్తుల పేరుతో మార్పు చేశారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. చందాదారుడు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తం పై నాలుగు నుంచి ఐదు శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని ఓ రసీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్ గా స్వీకరిస్తున్నట్టే. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధం. చిట్ ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక రసీదు ముసుగులో డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల నివేదికలు, పెట్టుబడుల నివేదికలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచింది. ఇది చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ రెడ్ 28 విత్ 24 నిబంధనలకు విరుద్ధం.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టింది. ఇది చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధం. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మరింత లోతుగా పరిశీలించారు. మార్గదర్శి సంస్థ సమర్పించిన ఆర్థిక నివేదికల పరిశీలనకు చార్టెడ్ అకౌంటెంట్ ను నియమించడం ద్వారా పలు అక్రమాలను గుర్తించారు. చిటీల వారీగా లాభనష్టాల ఖాతా, బ్యాలెన్స్ షీట్లను సక్రమంగా నిర్వహించడం లేదు. బ్యాలెన్స్ షీట్లో నోట్ నెంబర్ 7 కింద రూ. 459.98 కోట్లు చూపించారు. కానీ పరిశీలించగా ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయింది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు మూడు అనుబంధ కంపెనీలు ఉన్నట్టుగా బ్యాలెన్స్ షీట్ నోట్ నెంబర్ 40 లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై, మార్గదర్శి చిట్స్ కర్ణాటక, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అనుబంధ కంపెనీలుగా చూపించారు. నిధులను నిబంధనలకు విరుద్ధంగా తరలించేందుకే ఇలా చేశారని సిఐడి అధికారులు అంటున్నారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఆ మూడు అనుబంధ కంపెనీల్లో 1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్ లో చూపించారు. కానీ ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా.. ఒక ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లోనే 88.5 శాతం వాటాతో రూ. 2 కోట్లతో పెయిడ్ అప్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చిట్ ఫండ్ చట్టం_1982 కు విరుద్ధం. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కున్న మూడు అనుబంధ కంపెనీలు అదే తరహా వ్యాపారంలో ఉన్నట్టుగా చూపించారు. కానీ ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్ ఫండ్ వ్యాపారంలో లేదు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఆ కంపెనీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 88.5 శాతం వాటా ఉంది. అంటే ఆ కంపెనీలో నిర్ణయాధికారం మార్గదర్శి సంస్థదే.
ఇక మార్గదర్శి దశాబ్దాలుగా డిపాజిట్లు సేకరిస్తూ వస్తోంది. అయితే ఆ సంస్థ (ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్) కార్యాలయాల్లోనే మార్గదర్శి డిపాజిట్స్ పేరుతోనే భారీగా డిపాజిట్లు సేకరించింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిపై ఫిర్యాదు రావడంతోనే కేసు నమోదు చేశారు. అప్పట్లో రిజర్వ్ బ్యాంకు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. తాము తప్పు చేశామని రామోజీరావు రామోజీరావు లిఖితపూర్వకంగా అంగీకరిస్తూ డిపాజిట్ దారులకు డిపాజిట్ మొత్తాన్ని ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇక డిపాజిట్ల సేకరణను నిలిపివేసిందని అందరూ భావించారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా రసీదుల రూపంలో అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైంది. ఈ క్రమంలోనే మార్గదర్శి పై కేసు నమోదు చేసి ఏ1గా రామోజీరావును, ఏ2గా మార్గదర్శి ఎండీ శైలజను చేర్చి కేసు నమోదు చేసింది.
ఈ కేసును ఏపీ సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. సిఐడి అధికారులను రంగంలోకి దింపారు. మార్గదర్శి లోతులను మరింత లోతుగా తవ్వుతున్నారు. ఇందులో అక్రమాలను మరింత లోతుగా వెలికి తీస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న నేపథ్యంలో ఈ విధంగా రామోజీరావు పై కక్ష కట్టినట్టు తెలుస్తోంది.. ఈనాడు కు గుండెకాయ లాంటి మార్గదర్శి మీద కత్తి ఎక్కుపెట్టారు.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రామోజీరావును జైలుకు పంపించేదాకా జగన్ ఊరుకునేటట్లు లేడని ఆయన సన్నిహితులు అంటున్నారు.
-సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇదీ..
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Apcid files cases on eenadu chairman ramojirao and margadarshi md sailaja after raids on margadarshi offices
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com