Sleep Deprivation: ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం లేదా పని, మొబైల్, వినోదం కోసం నిద్రను త్యాగం చేయడం సాధారణంగా మారింది. అయితే ఒక్కో రోజు నిద్రకుండా ఉండి.. ‘ఒక్క రాత్రే కదా’ అని చాలామంది భావిస్తుంటారు. కానీ ఆ ఒక్క రాత్రి సరైన నిద్ర లేకపోయినా శరీరంలోని అనేక కీలక వ్యవస్థలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. శరీరం తనను తాను మరమ్మతు చేసుకునే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. అయితే ఒక్క రాత్రి కూడా నిద్ర లేకపోతే శరీరంలో ఎటువంటి మార్పులో వస్తాయో తెలుసా?
ఒక్క రాత్రి కూడా తగినంత నిద్ర లేకపోతే మొదటగా మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికే కోపం రావడం, చిరాకు పెరగడం, ఒత్తిడి అధికమవడం, ఆందోళన వంటి సమస్యలు కనిపిస్తాయి. కొంతమందిలో నిరాశ భావన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రోజువారీ పనుల్లో ఆసక్తి తగ్గిపోవడం కూడా సాధారణమే.
రాత్రి సరైన నిద్ర లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు ఏర్పడి అధికంగా తినాలనే కోరిక పెరుగుతుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనే ఆసక్తి ఎక్కువవుతుంది. నిద్ర సమయంలో శరీరంలో అనేక హార్మోన్లు సమతుల్యంగా విడుదల అవుతాయి. కానీ నిద్ర తగ్గితే కార్టిసోల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. అలాగే ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.
శరీరానికి అవసరమైన రోగనిరోధక వ్యవస్థ బలపడేందుకు నిద్ర కీలకం. ఒక్క రాత్రి నిద్రలేమి కూడా రోగనిరోధక కణాల పనితీరును తాత్కాలికంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. నిద్ర సరిపోకపోతే రక్తపోటు తాత్కాలికంగా పెరగవచ్చు. గుండె వేగం మారడం, ఒత్తిడి హార్మోన్లు పెరగడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. తరచూ నిద్రలేమి ఉంటే భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అందువల్ల ఏ ఒక్క రోజూ అనుకోకుండా ప్రతీరోజూ కంటినిండా నిద్రపోవాలి. వయోజనులు ప్రతి రోజు కనీసం 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర పొందాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, యువతకు దీనికంటే ఎక్కువ నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని తగ్గించడం, కెఫీన్ అధికంగా తీసుకోకపోవడం, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం ద్వారా మంచి నిద్ర పొందవచ్చు.
