Sleep health risks: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు సరైన నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే నేటి కాలంలో రకరకాల కారణాలవల్ల కనీస నిద్ర గడియారాన్ని కూడా పాటించడం లేదు. కొందరు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం బిజీగా ఉండి అనుకున్న సమయంలో నిద్ర పోకుండా.. ఉదయం అలసంగా లేస్తున్నారు. అలాగే ఇంకొందరు రాత్రులు ఎక్కువసేపు మెలకువతో ఉండి నిద్రను వృధా చేసుకుంటున్నారు. కొందరు వైద్యులు సూచిస్తున్న ప్రకారం 25 నుంచి 40 ఏళ్ల లోపు వారు ప్రతిరోజు ఏడు గంటల పాటు నిద్రపోవాలని అంటున్నారు. ఒకవేళ ఏడు గంటల పాటు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
శరీర ఆరోగ్యానికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరమని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఈ నిద్ర తగ్గిపోతే మానసిక సమస్యలు వస్తుంటాయి. వీటిలో భాగంగా ఏకాగ్రత తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. అతి చిన్న విషయానికి చిరాకు, కోపం వచ్చి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు. అలాగే డిప్రెషన్ తో కూడిన ఆందోళన ఉండడంతో నిత్యం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక సమస్యలు మాత్రమే కాకుండా శారీరక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తికి సరైన నిద్ర లేకపోతే గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. నిద్ర చెడిపోతే డయాబెటిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అనుకోకుండా బరువు పెరుగుతూ.. హార్మోన్ల అసమతుల్యత ఉండే అవకాశం ఉంది.
కొన్ని రోజులపాటు ఏడు గంటల నిద్రపోకపోతే రోజువారి జీవితంపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. చేసే ప్రతి పనిలో పొరపాటు జరుగుతూ ఉంటాయి. సరైన నిద్ర పోనివారు డ్రైవింగ్ చేస్తే ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అలసట, నిద్రమత్తు ఉండడంతో రోజంతా నిద్రపోవాలని అనిపిస్తుంది.
శరీరానికి సరైన నిద్ర లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర గడియారాన్ని వృధా చేస్తే ఆయుష్షు తగ్గే అవకాశం ఉంటుంది. మెదడు త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్లిపోవడం.. ఏ పని చేసినా ఆసక్తిగా ఉండకపోవడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు.. వృద్ధులు ఏడు గంటల పాటు నిద్రపోవాలని అంటున్నారు.
అయితే చాలామంది రకరకాల కారణాలవల్ల సరైన నిద్ర పట్టడం లేదని అంటున్నారు. నిద్ర సమస్య ఎదుర్కొనే వారు మానసిక ప్రశాంతతను ఏర్పాటు చేసుకోవాలి. అన్నిటికి మించి ముందుగా ధ్యానం చేయాలి. ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఉండి నిద్రపోయే ప్రయత్నం చేయాలి.