
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల మెడకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైందా? మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం హెచ్చరికలు పంపిందా? ఇక త్వరలోనే చంద్రబాబును, లోకేష్ ను మూసేసే ప్లాన్ చేసిందా అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.. తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అలానే అనిపిస్తోందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు ఎలాగైనా సరే జైలుకు పంపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే అమరావతి రాజధాని కుంభకోణంపై పడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు పాలనలో అవినీతిని నిగ్గుతేల్చాలని కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఈ అవినీతి సాగినట్టు సబ్ కమిటీ తేల్చింది.ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడికి చెందిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ కు గత చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టినట్టు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతోపాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీడీపీ సర్కార్ హయాంలో ముఖ్యంగా నారా లోకేష్ ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్ తోపాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం.
మొత్తంగా 2015-19 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.158.38 కోట్ల మేర అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించినట్టు సమాచారం.
ఈ రెండు స్కాంలలో ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ తోపాటు.. చంద్రన్న కానుకల్లో అవినీతిలో నాటి సీఎం చంద్రబాబు అవినీతి ఉందని కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ లు బుక్కైనట్టేనని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.