Bats: రాత్రిపూట తిరుగుతుంటాయి. పగటిపూట పడుకుంటాయి. చెట్ల కొమ్మలకు విచిత్రంగా వేలాడుతుంటాయి. వాటి రూపం.. ఆకారం.. రంగు.. భిన్నంగా ఉంటుంది. చూస్తేనే భయం వేస్తుంది. అందువల్లే గబ్బిలాలను అపశకునం అని భావిస్తుంటారు. అవి కనిపిస్తే చాలు పక్కకు వెళ్తారు. ఒకవేళ అవి చుట్టు పక్కల ఉంటే.. ఆ పరిసరాల వైపు వెళ్లేందుకు కూడా సాహసించరు.
గబ్బిలాలు అపశకునానికి నిదర్శనం కాదని.. దరిద్రానికి హేతువులు కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని సూపర్ హీరోలు అని పిలుస్తున్నారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధన చేశారు. గబ్బిలాల ఆహారపు అలవాట్లు.. ఇతర అంశాలను ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు పరిశీలించారు. దీనికి సంబంధించిన విషయాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా లో ప్రచురితమయ్యాయి.
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న గబ్బిలాల మీద ఉస్మానియా యూనివర్సిటీ వైల్డ్ లైఫ్ బయాలజీ బృందం లో ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. గబ్బిలాలు ఏం తింటాయి.. అవి ఎలాంటి జీవన సాగిస్తుంటాయి.. అనే అంశాల మీద డిఎన్ఏ మెటబార్ కోడింగ్ అనే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా హనుమన హళ్లి అనే గుహలో ఉండే గబ్బిలం పరిశీలించారు. ఈ గబ్బిలాలను కోలార్ రౌండ్ లీఫ్ బ్యాట్ జాతికి చెందిన వారే పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే వీటి సంతతి కేవలం 300 కంటే తక్కువగా ఉంది. ఇవి గనుక అంతరించిపోతే పర్యావరణానికి ఇబ్బంది తప్పదు.
ఈ జాతికి చెందిన ఒక గబ్బిలం ఏకంగా 4100 రకాల కీటకాలను తింటుంది. డెంగ్యూ.. మలేరియా.. టైఫాయిడ్ వంటి రోగాలకు కారణమయ్యే దోమలు.. బ్యాక్టీరియాలను మోసుకువెళ్లే బొద్దింకలను కూడా ఇవి వేటాడు తింటాయి. టమాటా పంటకు అత్యంత ప్రమాదకరంగా మారే లీఫ్ మైనర్ చిమ్మెటలను ఇవి తినేస్తూ ఉంటాయి.. మనుషులకు ఇంత మేలు చేస్తుంటాయి కాబట్టి గబ్బిలాలను ప్రమాదానికి హేతువులుగా చూడకూడదు. దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా భావించకూడదు. ఈ గబ్బిలాలను కాపాడుకుంటేనే మనుషుల మనుగడ. వాతావరణంలో మార్పులు, ఇతర కారణాల వల్ల ఈ గబ్బిలాల మనుగడ ప్రమాదంలో పడింది. ఈ గబ్బిలాలు జీవవైవిధ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందవల్లే వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీటి సంరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.