Akka web series review : నేరాలతో ముడిపడిన కథలు అనగానే.. మనకు గన్స్ చేతిలో పట్టుకుని తిరిగే మగవాళ్ళు కనిపిస్తారు. అధికారం కోసం.. డబ్బు కోసం పోరాడే బృందాలు మనకు కనిపిస్తాయి. కానీ మహిళలు ఈ అవతారం ఎత్తితే.. ఏకంగా వారు నేరమయ సామ్రాజ్యాలను ముందుకు నడిపిస్తే.. ఆ కథ ఎలా ఉంటుంది.. ఇలాంటి ఆలోచన కొత్తగా ఉంది కదా.. సరిగ్గా ఇదే ఆలోచనతో ఒక వెబ్ సిరీస్ రూపొందింది.. ఆ సిరీస్ పేరు అక్క.. కీర్తి సురేష్.. రాధిక ఆప్టే వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదు ఎపిసోడ్లతో రూపొందింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది.. నటీనటుల నటన ఎలా ఉంది.. ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకు.. ఈ రివ్యూ లో చూద్దాం..
కథ ఎలా ఉందంటే..
1980 కాలం నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో పేర్నూరు అనే ప్రాంతంలో ఈ కథ మొదలవుతుంది. ఇక్కడ 800 సంవత్సరాలుగా మహిళలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. మలేమార్.. హెర్కడి.. పర్పే లాడి ప్రాంతాలకు చెందిన మహిళలు తమ సామ్రాజ్యాలను ముందుకు నడిపిస్తూ ఉంటారు. అక్కడ వీరిని అక్క అని గౌరవంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మేల్ డామినేషన్ సొసైటీ ఉండదు. ఫిమేల్ డామినేషన్ సొసైటీ ఉంటుంది. పైగా వారసత్వం అనేది తల్లి నుంచి కూతురికి లభిస్తుంది. ఇక్కడ ఈ వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుంది. అక్రమ వ్యాపారాలు.. స్థానికంగా ఉండే రాజకీయాలు.. ప్రజల మీద సాగించే పట్టు.. ఇవన్నీ కూడా మహిళల ఆధ్వర్యంలో సాగుతూ ఉంటాయి.
మలేమార్ సామ్రాజ్యంలో భవాని (కీర్తి సురేష్) కీలక నాయకురాలిగా ఉంటారు. ఈమె తన ప్రాంతం మీద పట్టు సాధించాలని లక్ష్యంతో ఉంటుంది. ఈ సమయంలో ముంబై మాఫియా నుంచి రుద్ర (రాధిక ఆప్టే) పేర్నూరు ప్రాంతానికి వస్తుంది. అక్కడ మహిళల చేతుల్లో ఉన్న అధికారాన్ని దెబ్బ కొట్టి.. తాను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో రుద్ర, భవాని మధ్య పోరు తీవ్రంగా మారుతుంది. కుట్రలు.. ప్రతీకారాలు.. ద్రోహాలు వీరిద్దరి మధ్య సర్వసాధారణంగా మారిపోతాయి. చివరికి ఈ సామ్రాజ్యంలో ఎవరు పట్టు సాధించారు అనేది.. సిరీస్ చూస్తే తెలుస్తుంది.
ఎలా సాగింది అంటే
ఈ సిరీస్లో దర్శకుడు పురుషుల కంటే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చాడు. రాజకీయ నాయకులుగా.. గ్యాంగ్ స్టర్లుగా.. వ్యూహకర్తలుగా మొత్తం మహిళలు కనిపిస్తారు. అధికారాన్ని దక్కించుకోవడానికి.. ప్రజల మీద పట్టు సాధించడానికి.. వారు వేసే ఎత్తులు.. రచించే వ్యూహాలు కథలో కొత్తదనాన్ని చూపిస్తుంటాయి.
దర్శకుడు ధర్మరాజ్ శెట్టి పేర్నూర్ అనే ఒక ఊహ ప్రపంచాన్ని తెరమీద చూపించిన విధానం చాలా బాగుంది. పాత్రలకు సంబంధించిన కాస్ట్యూమ్.. వారు మాట్లాడే మాటలు.. ఆచార వ్యవహారాలు చాలా భిన్నంగా ఉన్నాయి. మహిళల పాత్రలను అతడు అత్యంత బలంగా రాసుకున్నాడు. అతడు రాసుకున్నట్టుగానే నటీమణులు కూడా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి మహిళకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండే విధంగా దర్శకుడు సిరీస్ నడిపించిన విధానం చప్పట్లు కొట్టిస్తుంది పురుషులతో పాటుగా తలపడిగలిగే శక్తివంతమైన తీరులో పాత్రలను రూపొందించడం దర్శకుడి పనితీరుకు నిదర్శనం.
ఇంట్రెస్టింగ్ వరల్డ్ బిల్డ్ చేసిన డైరెక్టర్.. అదే స్థాయిలో స్ట్రాంగ్ స్టోరీని రాసుకుంటే ఈ సిరీస్ మరో లెవెల్ లో ఉండేది. మొదటి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయాలకు.. ప్రాంతాల నేపథ్యానికి.. ఆధిపత్య పోరుకు సరిపోయాయి. అయితే సంఘర్షణ ఎక్కడ మొదలైంది.. ఎలా మొదలైంది అనే విషయాలను చెప్పడానికి దర్శకుడు కాస్త సమయం ఎక్కువ తీసుకున్నాడు. కొత్త పాత్రలు రావడం.. కుట్రలు తెర మీదకి కనిపించడం.. వాటి వెనుక ఉన్న భావోద్వేగాలు అంతగా ఆకట్టుకోవు.
చివరి రెండు ఎపిసోడ్లలో యాక్షన్ కాస్త మోతాదు మించింది. ద్రోహాలు.. ప్రతీకారం వంటివి కొత్తగా ఉండడంతో స్టోరీ వేగాన్ని అందుకుంటుంది. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం ల్యాగ్ అయ్యాయి అనిపిస్తాయి. మహిళలు తమ ఆధిపత్యంలో ఈ సామ్రాజ్యాన్ని కొనసాగించడం వంటి ఆలోచన కొత్తగా ఉంది. అయితే అందులో ఉన్న లోపాలు.. అధికారాన్ని దక్కించుకోవాలనే కోరిక.. మహిళల మధ్య జరిగే పోరాటం. కృతకంగా అనిపిస్తుంది. వాస్తవానికి వీటి వెనుక ఉన్న అసలు విషయాలను ఇంటెన్సిటీగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు అనిపిస్తుంది.
భవాని పాత్రలో కీర్తి సురేష్ ఆకట్టుకుంది.. చేతిలో అధికారాన్ని పెట్టుకోవడం.. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం.. అసలు ఏమాత్రం రాజీ పడని నాయకురాలిగా ఆమె ఆకట్టుకుంది. బాడి లాంగ్వేజ్.. తుపాకిని పట్టుకునే విధానం.. చూపుల్లో క్రూరం.. మాట్లాడే మాటలు గంభీరత.. ఈ పాత్రకు బలాన్ని తీసుకొచ్చాయి. అదే ఈమెకు తగ్గట్టుగానే కథనం మరింత బలంగా ఉండి ఉంటే భవాని పాత్ర తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది.
రుద్ర పాత్రలో రాధిక తనదైన నటనతో అలరించారు. తన ప్రత్యర్ధులను ఢీకొట్టే తీరు.. వ్యూహాలను అమలు చేసే విధానం ఆమె పాత్రకు కొంత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. రుద్ర నేపథ్యం.. ఆమె ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది.. దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటి వంటి వాటిని బలంగా చూపించి ఉంటే రుద్ర పాత్ర మరింత గొప్పగా ఉండేది. తన్వి అజ్మీ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది. అయితే ఈ సిరీస్ స్కేల్ పెద్దగా ఉండడంతో మిగతా పాత్రధారులకు అంతగా ప్రాధాన్యం లభించలేదు.
టెక్నికల్ విషయాలను పరిశీలిస్తే జాన్ స్టీవార్డ్ ఎడ్యురీ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలకు సరికొత్త బలం అందించింది. కీలక సమయంలో సన్నివేశాలు తీవ్రతను ప్రేక్షకులకు ఎంగేజింగ్ లాగా చూపించడంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉపయోగపడింది. పేర్నూర్ ప్రపంచం సరికొత్తగా ఆవిష్కరించడంలో కెమెరా పనితనం కనిపించింది. భారీ సెట్స్.. ఆర్ట్ వర్క్ సరికొత్త విధంగా కనిపించాయి. పాత్రల కాస్ట్యూమ్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి.
అయితే కొన్ని సందర్భాలలో పాత్రల మాట తీరు.. ఉపయోగించే వాహనాలు.. ఆయుధాలు వంటివి అత్యంత ఆధునికంగా కనిపిస్తాయి. అందువల్లే ప్రేక్షకులు ఈ సిరీస్ సాగుతున్న కాలాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఐదు ఎపిసోడ్లు మాత్రమే ఉన్న ఈ సిరీస్ లో ఇంకా కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది..
మొత్తంగా చూస్తే అక్కలో మంచి కథ ఉంది. దాని తగ్గట్టుగానే మిగతా విషయాలు ఉన్నాయి. ఆధిపత్యం.. దానికోసం పోరాటం చేసే ఇద్దరు మహిళలు.. కుట్రలు.. ప్రతీకారం వంటి అంశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తాయి. అయితే ఇన్ని బాగున్నప్పటికీ ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కీర్తి సురేష్ నటన.. రాధిక పాత్ర.. పిరియాడిక్ విధానంలో రూపొందించిన సెటప్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ఫోటోగ్రఫీ వంటివి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తాయి. అయితే ప్రతి ఎపిసోడ్లో ఉత్కంఠ ఉండాలి.. బలమైన భావోద్వేగాలు చూడాలి.. ఊహించని మలుపులతో ఎంగేజింగ్ అవ్వాలి అనుకుంటే మాత్రం కాస్త నిరాశ పడక తప్పదు.