Samsung Galaxy S27 Ultra : సామ్‌సంగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ S27 సిరీస్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లోని టాప్ ఎండ్ మోడల్ అయిన Galaxy S27 Ultra ప్రాసెసర్ విషయంలో నెలకొన్న గందరగోళానికి దాదాపు తెరపడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ఫోన్‌లో సామ్‌సంగ్ సొంత ఎక్సినోస్ 2700 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చనే ప్రచారం జరిగింది. అయితే తాజా లీకుల ప్రకారం సామ్‌సంగ్ మరోసారి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఎక్సినోస్ వర్సెస్ స్నాప్‌డ్రాగన్.. అసలు కథ ఇదే!
గత అక్టోబర్‌లో Galaxy S27 Ultra ప్రాసెసర్ విషయంలో కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ ఫోన్ కోసం సామ్‌సంగ్ తన సొంత Exynos 2700 చిప్‌సెట్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం స్నాప్‌డ్రాగన్ కొత్త ఫ్లాగ్‌షిప్ చిప్‌లో వేడెక్కే సమస్యలు ఉన్నాయనే ప్రచారం.
గతంలోనూ సామ్‌సంగ్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. 2015లో స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ వేడెక్కుతున్నట్లు సమస్యలు రావడంతో Galaxy S6 సిరీస్‌లో అన్ని మార్కెట్లకు Exynos 7420 చిప్‌సెట్‌ను ఉపయోగించింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే చర్చ మొదలైంది.
అయితే ఈసారి ఎక్సినోస్‌కు మరో ప్రయోజనం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సామ్‌సంగ్ అంతర్గత బెంచ్‌మార్క్ పరీక్షల్లో Exynos 2700 చిప్‌సెట్, Snapdragon 8 Elite Extreme Gen 6 కంటే మల్టీకోర్ CPU పరీక్షల్లో, అధిక ఒత్తిడితో కూడిన GPU పరీక్షల్లో 15 నుంచి 20 శాతం మెరుగైన పనితీరు కనబరిచినట్లు ప్రచారం జరుగుతోంది.
స్నాప్‌డ్రాగన్‌లో వేడెక్కే సమస్యలపై క్వాల్‌కామ్ క్లారిటీ
మరోవైపు తన కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లలో వేడెక్కే సమస్యలు ఉన్నాయనే ప్రచారాన్ని క్వాల్‌కామ్ ఖండించింది. కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాన్ మెక్‌గైర్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. Snapdragon 8 Elite Gen 6లో ఎలాంటి వ్యవస్థాగత థర్మల్ సమస్యలు లేవని స్పష్టం చేశారు. దీంతో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌పై నెలకొన్న అనుమానాలకు క్వాల్‌కామ్ తెరదించే ప్రయత్నం చేసింది.
Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్ మాత్రమే!
తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ yeux1122 నేవర్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం.. సామ్‌సంగ్ Galaxy S27 Ultra విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలోనూ Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌తో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.అంతేకాకుండా కొత్తగా రానున్న Galaxy S27 Pro మోడల్‌లో కూడా Snapdragon 8 Elite Gen 6 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు లీకులు చెబుతున్నాయి.
మిగతా మోడళ్లలో మాత్రం డ్యూయల్ చిప్ వ్యూహం!
Galaxy S27, Galaxy S27+ మోడళ్ల విషయంలో మాత్రం సామ్‌సంగ్ తన పాత వ్యూహాన్నే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
– అమెరికా, కెనడా, చైనా, జపాన్: Snapdragon 8 Elite Gen 6
– ఇతర అంతర్జాతీయ మార్కెట్లు: Samsung Exynos 2700
అంటే టాప్ మోడల్ అయిన S27 Ultra విషయంలో ఎలాంటి రాజీ పడకుండా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అన్ని దేశాల్లోనూ అందించనున్నట్లు సమాచారం.
Galaxy S27 Ultra ప్రాసెసర్ విషయంలో ఎక్సినోస్‌కు అవకాశం దక్కుతుందని భావించిన సమయంలో తాజా లీకులు ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. అయితే సామ్‌సంగ్ ఇప్పటివరకు ఈ వివరాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతానికి లీకులుగానే చూడాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు Galaxy S27 సిరీస్ ప్రాసెసర్లపై ఉత్కంఠ కొనసాగనుంది.