Samsung Galaxy S27 Ultra : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫోన్ల మధ్య పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కెమెరా, ప్రాసెసర్‌తో పాటు ర్యామ్, స్టోరేజ్ వేగం కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S27 విషయంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రో, అల్ట్రా మోడళ్లలోనే అత్యాధునిక ర్యామ్, స్టోరేజ్ టెక్నాలజీని అందించేందుకు సిద్ధమవుతున్నట్లు లీకులు చెబుతున్నాయి.
నాలుగు మోడళ్లతో గెలాక్సీ S27 సిరీస్?
వచ్చే ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈసారి మూడు కాకుండా ఏకంగా నాలుగు మోడళ్లను తీసుకురావచ్చని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గెలాక్సీ S27, S27+, S27 ప్రో, S27 అల్ట్రా పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్లోకి రావచ్చని సమాచారం. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన Meeco ఆన్‌లైన్ కమ్యూనిటీలో టిప్‌స్టర్ Vampire King వెల్లడించిన వివరాలు ఈ సిరీస్‌పై అంచనాలను మరింత పెంచాయి.
ర్యామ్ విషయంలోనూ ప్రీమియం వ్యూహం!
లీకుల ప్రకారం.. గెలాక్సీ S27, S27+ మోడళ్లలో 12GB LPDDR5x ర్యామ్‌ను అందించవచ్చు. ఈ రెండు ఫోన్లు 256GB, 512GB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.
అయితే గెలాక్సీ S27 ప్రో, S27 అల్ట్రా మోడళ్ల విషయంలో శాంసంగ్ మరింత అధునాతన టెక్నాలజీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లు 12GB+256GB, 12GB+512GB, 16GB+1TB వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అన్ని వేరియంట్లకు ఒకే రకమైన ర్యామ్, స్టోరేజ్ ఇవ్వకుండా అత్యంత ఖరీదైన మోడళ్లకు మాత్రమే LPDDR6 ర్యామ్, UFS 5.0 స్టోరేజ్‌ను కేటాయించనున్నట్లు లీకులు వెల్లడిస్తున్నాయి.
1TB వేరియంట్లకే అసలైన స్పీడ్!
గెలాక్సీ S27 ప్రోలో 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్‌కు మాత్రమే LPDDR6 ర్యామ్, UFS 5.0 స్టోరేజ్ లభించవచ్చని సమాచారం. ఇక గెలాక్సీ S27 అల్ట్రాలో 12GB+512GB, 16GB+1TB వేరియంట్లకు ఈ అత్యాధునిక టెక్నాలజీ అందించవచ్చని తెలుస్తోంది.
దీంతో సాధారణ వేరియంట్లతో పోలిస్తే టాప్ మోడళ్లలో యాప్స్ వేగంగా ఓపెన్ కావడం, భారీ ఫైళ్ల బదిలీ, మల్టీటాస్కింగ్ వంటి పనుల్లో మెరుగైన పనితీరు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి లీకుల ఆధారంగా వస్తున్న సమాచారం మాత్రమే. శాంసంగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రాసెసర్, కెమెరాల్లోనూ భారీ అప్‌గ్రేడ్?
గెలాక్సీ S27 అల్ట్రాలో Snapdragon 8 Elite Gen 6 Extreme for Galaxy చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చని ప్రచారం జరుగుతోంది. గెలాక్సీ S27 ప్రోలోనూ కొన్ని అంతర్జాతీయ మార్కెట్లకు ఇదే ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉందట. ఇతర మార్కెట్లలో Exynos 2700 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఇక సాధారణ S27, S27+ మోడళ్లలో Exynos 2700 ప్రాసెసర్ ఉండొచ్చని తెలుస్తోంది.
కెమెరా విభాగంలోనూ అల్ట్రా మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్లకు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చని లీకులు చెబుతున్నాయి. అయితే S27 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు కొత్త హారిజాంటల్ కెమెరా ఐలాండ్ డిజైన్‌ను తీసుకురావచ్చని సమాచారం.
కొత్త ఫోన్లలో ధరకు తగ్గ టెక్నాలజీనా?
శాంసంగ్ తీసుకోబోతున్న ఈ వ్యూహం ఫ్లాగ్‌షిప్ మార్కెట్లో కొత్త చర్చకు తెరతీస్తోంది. కేవలం ఎక్కువ ర్యామ్ ఇవ్వడమే కాకుండా, ర్యామ్ వేగం, స్టోరేజ్ టెక్నాలజీలోనూ వేరియంట్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అత్యాధునిక ఫీచర్లు టాప్ వేరియంట్లకే పరిమితమైతే వాటి ధరలు కూడా పెరిగే అవకాశముంది. అధికారిక లాంచ్ వరకు ఈ వివరాలను ప్రాథమిక అంచనాలుగానే చూడాలి.