Apple iPhone Duo : స్మార్ట్‌ఫోన్ వినియోగంలో యూజర్లకు సౌకర్యాన్ని పెంచేందుకు యాపిల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ముఖ్యంగా తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌తో సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్న సంస్థ.. ఇప్పుడు లాక్‌స్క్రీన్ విషయంలోనూ మరో కీలక మార్పును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే మరిన్ని వివరాలను తెలుసుకునేలా రెండు అదనపు విడ్జెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో విడుదలయ్యే iOS 27 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ కనిపించే అవకాశం ఉందనే ప్రచారం టెక్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
లాక్‌స్క్రీన్‌పైనే మరింత సమాచారం!
ప్రస్తుతం ఐఫోన్ లాక్‌స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న విడ్జెట్లతో యూజర్లు వాతావరణం, క్యాలెండర్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఫోల్డబుల్ ఐఫోన్ వినియోగదారులకు ఈ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా యాపిల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ pdfu (@itspdfu) వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘కాంప్లికేషన్ కాలమ్’ (Complication Column) పేరుతో కొత్త విడ్జెట్ లేఅవుట్‌ను యాపిల్ పరీక్షిస్తోంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే లాక్‌స్క్రీన్ కుడివైపు రెండు చిన్న గుండ్రటి విడ్జెట్లు అదనంగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఉండే ఫ్లాష్‌లైట్, కెమెరా షార్ట్‌కట్‌లకు పైన వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న విడ్జెట్ల వరుస కూడా యథావిధిగా కొనసాగుతుంది. అంటే ఒకే లాక్‌స్క్రీన్‌పై గతంలో కంటే ఎక్కువ సమాచారాన్ని చూసే అవకాశం యూజర్లకు లభించనుంది.
iOS 27.1లో కీలక ఆధారాలు?
టిప్‌స్టర్ వెల్లడించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యాపిల్ అంతర్గతంగా ఉపయోగించే iOS 27.1 సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్‌కు సంబంధించిన ప్రస్తావన కనిపించిందట. అయితే ప్రస్తుతం ఇది యాక్టివ్‌గా లేదని సమాచారం. దీంతో యాపిల్ ఈ లేఅవుట్‌పై ప్రయోగాలు చేస్తుండవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఫీచర్ కేవలం ఐఫోన్ డ్యూ కోసమే తీసుకొస్తుందా? ఇతర ఐఫోన్లకు కూడా అందిస్తుందా? అనేది ఇంకా స్పష్టత లేదు. అలాగే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై కూడా అధికారిక సమాచారం లేదు.
ఇప్పటికే ఫోల్డబుల్ ఐఫోన్‌కు కొత్త ఫీచర్లు
మరోవైపు iOS 27.3 బీటా అప్‌డేట్ ద్వారా ఐఫోన్ డ్యూ (iPhone Duo)లో యాపిల్ కొన్ని కొత్త సదుపాయాలను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఫోన్ మడతపెట్టిన స్థితిలో ఉన్నప్పుడు ఫ్రంట్ కెమెరా ద్వారా అన్‌లాక్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఒకటి. అలాగే ఫోన్‌ను మడతపెట్టగానే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యేలా ‘Close to Lock’ సెట్టింగ్‌ను కూడా పరిచయం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే ఈ ఫోల్డబుల్ ఫోన్ కోసం 2 లక్షలకు పైగా ఆప్టిమైజ్ చేసిన యాప్స్‌కు సపోర్ట్ ఉన్నట్లు యాపిల్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో సంస్థ ఉన్నట్లు కనిపిస్తోంది.
ఐఫోన్ డ్యూ 2పై కూడా భారీ అంచనాలు!
ఇదిలా ఉంటే యాపిల్ తదుపరి తరం ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూ 2ను 2027 శరదృతువులో విడుదల చేసేందుకు సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ఇందులో టెలిఫోటో కెమెరా, మరింత సన్నని, తేలికైన డిజైన్‌తో పాటు యాక్షన్ బటన్‌ను తీసుకురావచ్చని లీకులు చెబుతున్నాయి.
బయటి డిస్‌ప్లేకు ఫేస్ ఐడీ సపోర్ట్ అందించే అంశాన్ని కూడా యాపిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫీచర్ ఐఫోన్ డ్యూ 2లో కాకుండా 2028లో రానున్న ఐఫోన్ డ్యూ 3లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
ఫోల్డబుల్ ఫోన్ అంటే కేవలం పెద్ద స్క్రీన్ మాత్రమే కాకుండా, రోజువారీ వినియోగంలోనూ కొత్త అనుభూతిని అందించాలనే దిశగా యాపిల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌స్క్రీన్‌పై అదనపు విడ్జెట్ల ఆలోచన చిన్న మార్పులా కనిపించినా.. ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి లీకులు, నివేదికల ఆధారంగానే ఉన్నాయి. యాపిల్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.