BMW F 450 GS Sport ప్రముఖ లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BMW Motorrad భారత మార్కెట్లో మరో కొత్త అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది. తన మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ F 450 GS సిరీస్‌లో కొత్తగా BMW F 450 GS Sport వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.5.90 లక్షలుగా నిర్ణయించింది. స్పోర్ట్ సస్పెన్షన్, ప్రత్యేకమైన రేసింగ్ రెడ్ కలర్ ఫినిషింగ్ ఈ కొత్త వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బేస్, ఎక్స్‌క్లూజివ్, GS ట్రోఫీ వేరియంట్లకు ఇది నాలుగో వేరియంట్‌గా చేరింది.
నాలుగు వేరియంట్లలో BMW F 450 GS
కొత్త స్పోర్ట్ వేరియంట్‌ను ఎక్స్‌క్లూజివ్, GS ట్రోఫీ మోడళ్ల మధ్య స్థానంలో తీసుకొచ్చింది BMW. టాప్ ఎండ్ GS ట్రోఫీతో పోలిస్తే స్పోర్ట్ వేరియంట్ ధర రూ.25 వేలు తక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ బైక్ ధరలు ఇలా ఉన్నాయి.
– BMW F 450 GS Base – రూ.5.35 లక్షలు
– BMW F 450 GS Exclusive – రూ.5.55 లక్షలు
– BMW F 450 GS Sport – రూ.5.90 లక్షలు
– BMW F 450 GS Trophy – రూ.6.15 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్)
కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడు బేస్ వేరియంట్ ధర రూ.4.70 లక్షలు, ఎక్స్‌క్లూజివ్ ధర రూ.4.90 లక్షలు, GS ట్రోఫీ ధర రూ.5.30 లక్షలుగా ఉండేది. ఆ తర్వాత ధరలు పెరగడంతో ప్రస్తుతం బేస్ మోడల్ ధర రూ.5.35 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
ఇంజిన్, పవర్.. అదిరిపోయే పనితీరు
BMW F 450 GS Sportలో 420cc లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఇదే ఇంజిన్‌ను మిగతా వేరియంట్లలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 8,750rpm వద్ద 48bhp గరిష్ఠ పవర్‌ను, 6,750rpm వద్ద 43Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
ఈ అడ్వెంచర్ బైక్ అన్‌లాడెన్ బరువు 178 కిలోలుగా ఉంది. సీటు ఎత్తు 845mmగా పేర్కొన్నారు. సుదూర ప్రయాణాలు, హైవే రైడింగ్‌తో పాటు ఆఫ్‌రోడ్ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు.
స్పోర్ట్ సస్పెన్షన్.. కొత్త రైడింగ్ మోడ్‌లు
కొత్త BMW F 450 GS Sportలో ప్రధానమైన మార్పు స్పోర్ట్ సస్పెన్షన్. బేస్, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లతో పోలిస్తే మరింత స్పోర్టీ రైడింగ్ అనుభూతిని అందించేలా దీన్ని రూపొందించారు. అంతేకాకుండా Gear Shift Assistant Pro ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీని ద్వారా అనుకూల పరిస్థితుల్లో క్లచ్ ఉపయోగించకుండానే గేర్లను మార్చుకోవచ్చు.
ఇందులో Riding Modes Pro ఫీచర్ కూడా ఉంది. ఇప్పటికే ఉన్న Rain, Road, Enduro రైడింగ్ మోడ్‌లకు అదనంగా Enduro Pro మోడ్‌ను అందించారు. ఆఫ్‌రోడ్ ప్రయాణాల్లో రైడర్లకు మరింత నియంత్రణ, మెరుగైన రైడింగ్ అనుభూతిని అందించడమే ఈ మోడ్ లక్ష్యం.
GS ట్రోఫీతో పోలిస్తే ఏంటి తేడా?
స్పోర్ట్, GS ట్రోఫీ వేరియంట్లు రెండింటిలోనూ స్పోర్ట్ సస్పెన్షన్, Riding Modes Pro ఫీచర్లు ఉన్నాయి. అయితే GS ట్రోఫీ మోడల్‌లో BMW Easy Ride Clutch సిస్టమ్‌ను అందిస్తుండగా, స్పోర్ట్ వేరియంట్‌లో ఈ ఫీచర్ లేదు. ఇందులో సంప్రదాయ క్లచ్‌తో పాటు Gear Shift Assistant Pro సదుపాయం ఉంటుంది.
అదేవిధంగా GS ట్రోఫీలో అల్యూమినియం ఇంజిన్ గార్డ్, టింటెడ్ Rallye విండ్‌స్క్రీన్ ఉన్నాయి. స్పోర్ట్ వేరియంట్‌లో మాత్రం క్లియర్ Rallye విండ్‌స్క్రీన్, బ్లాక్ హ్యాండ్‌గార్డ్స్, ఆఫ్‌రోడ్ ఫుట్‌పెగ్స్, ప్లాస్టిక్ ఇంజిన్ గార్డ్ అందించారు.
రేసింగ్ రెడ్ కలర్ ప్రత్యేక ఆకర్షణ
కొత్త వేరియంట్‌లో Racing Red కలర్‌ను ప్రత్యేకంగా అందించడం మరో విశేషం. ఈ రంగు స్పోర్ట్ వేరియంట్‌కు మాత్రమే ప్రత్యేకం. మిగతా డిజైన్ విషయానికి వస్తే X ఆకారంలో ఉండే LED హెడ్‌ల్యాంప్, ముందు భాగంలో బీక్ డిజైన్, నిటారుగా ఉండే అడ్వెంచర్ బైక్ స్టాన్స్‌ను యథాతథంగా కొనసాగించారు.
BMW F 450 GS Sport.. స్పోర్ట్ సస్పెన్షన్, అధునాతన రైడింగ్ మోడ్‌లు, గేర్ షిఫ్ట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. GS ట్రోఫీలోని కొన్ని కీలక ఫీచర్లను కోరుకునే, అయితే Easy Ride Clutch అవసరం లేని రైడర్లకు ఈ కొత్త వేరియంట్ మరో ప్రత్యామ్నాయంగా నిలవనుంది. రూ.5.90 లక్షల ధరతో మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ బైక్ విభాగంలో BMW తన పోటీని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది.