YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి లో( Y S Jagan Mohan Reddy ) ఎంత మాత్రం మార్పు రావడం లేదు. ఈ మాట వైసీపీ సీనియర్ల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే పార్టీ నడిపే తీరు ఇది కాదన్నది మెజారిటీ శ్రేణుల అభిప్రాయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే రకం కాదు. ఇది ఆ పార్టీ సీనియర్లకు సైతం తెలుసు. అసెంబ్లీకి హాజరు విషయంలో సీనియర్లు ఒకవైఖరితో ఉంటే.. జగన్మోహన్ రెడ్డి మరోవైఖరితో ఉన్నారని స్పష్టం అవుతుంది. తాజాగా బడ్జెట్ సమావేశాలకు 11 నిమిషాల పాటు హాజరై బయటకు వెళ్లిపోవడం అనేది.. పార్టీకి భారీగా డామేజ్ చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కోసం ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభియోగాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై ఉన్నాయి. దానిని గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి సభను బహిష్కరించడం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ చేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* ప్రతిపక్ష హోదా రాలేదని..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. అందుకే ఆ ధీమాతోనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారు. కానీ 40% ప్రజలు కోరుకున్న మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు లేకుండా పోతున్నాయి. అసెంబ్లీకి సహేతుకమైన కారణం చూపి రావడం లేదు. కేవలం ప్రతిపక్ష హోదాతో ముడిపెట్టి రాకపోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. గతంలో చంద్రబాబుకు సభలో ఘోరమైన అవమానం జరిగింది. అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు ఆయన ఓపికగానే సభకు వచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేసినా.. చంద్రబాబు మాత్రం సభను అంటిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే వ్యక్తిగత దాడికి దిగారు అప్పుడే శపధం చేసి బయటకు వచ్చేసారు. దానిని ప్రజలు గుర్తించారు.
* అవమానిస్తారనే భయంతోనే..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయాన్ని గ్రహించుకోవాలి. అసలు ఆయన సభలో ఒక్క మాట అంటే ఒక్క మాట వినిపించారా? ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే రోజు తడబడ్డారు. ఆ పరిస్థితి చూసి ప్రతి ఒక్కరూ గుర్తించారు. అలా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయిన ఆయన ప్రతిపక్ష హోదాను ఇవ్వకపోవడాన్ని పరిగణలోకి తీసుకుని సభకు రావడం మానేశారు. సభకు వస్తే అవమానాలు ఎదురవుతాయని చెప్పి అలా రావడం మానేశారు ఒక అనుమానం. అయితే చంద్రబాబు మాదిరిగా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆయనను దారుణంగా అవమానించారు. దానిని ప్రజలంతా చూశారు. కానీ అవమానాలను ఊహించుకొని జగన్ సభకు వెళ్లడం లేదు. దానిని ప్రజలు గుర్తించే ఛాన్సే లేదు. జగన్ మాత్రం శాశ్వతంగా సభ బహిష్కరణ అని చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో మాత్రం సభకు వచ్చి వెళ్ళిపోతున్నారు. అంటే అనర్హత వేటు పడుతుందని అలా చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ప్రజల్లోకి ఈ విషయమే బలంగా వెళ్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల ఆవేదన కూడా అదే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే పరిస్థితిలో లేరన్నది ఆ పార్టీ సీనియర్లకు తెలుసు.