Vallabhaneni Vamsi Mohan: చాలామంది స్నేహితులు వేరువేరు రాజకీయ పార్టీల్లో ఉంటారు. కానీ స్నేహితులుగా కొనసాగుతుంటారు. అటువంటి దృశ్యమే కృష్ణాజిల్లా విజయవాడలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వల్లభనేని వంశీ మోహన్ తో పాటు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా.. వారి స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణ మాత్రం టిడిపిలో ఉన్నారు. పరస్పరం ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న వీరు మాత్రం విమర్శలు చేసుకోరు. తరచూ కలుసుకుంటారు. తాజాగా కలుసుకున్నారు వల్లభనేని వంశీ మోహన్, వంగవీటి రాధాకృష్ణ లు. అయితే ఆ ఇద్దరు నేతలు కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటి కథ అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.
* హుందాగా రాధా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విభేదించి టిడిపిలోకి వచ్చారు వంగవీటి రాధ. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించి వైసీపీలోకి వెళ్లారు వల్లభనేని వంశీ. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు వంశీ. అయితే వల్లభనేని వంశీ మోహన్ వివాదాస్పద నేతగా మారిపోయారు. గతంలో పనిచేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదించి టిడిపిలోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ మాత్రం చాలా హుందాగా నడుచుకున్నారు. గతంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు కూడా అటువంటి జోలికి పోలేదు.
* గత కొద్ది రోజులుగా గ్యాప్..
మొన్ననే జైలుకు వెళ్లి వచ్చారు వల్లభనేని వంశీ మోహన్. దాదాపు 150 రోజులపాటు జైల్లో ఉండి పోయారు. కానీ ఆ సమయంలో వల్లభనేని వంశీ మోహన్ పరామర్శకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు అదే వల్లభనేని వంశీ మోహన్ రాధాకృష్ణను కలిశారు. స్నేహితుడి కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు రాధాకృష్ణ ఇంటికి వెళ్లగా ఆత్మీయంగా స్వాగతం పలికారు. రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. త్వరలో ఆయనకు పదవి ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాధా ఇంటికి వల్లభనేని వంశీ మోహన్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వారిద్దరూ కలిసిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది సోషల్ మీడియా ద్వారా. దీంతో తెర వెనుక ఏం జరుగుతోంది అనే చర్చ నడుస్తోంది. అయితే ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదని… సాధారణంగా కలిసేందుకు వంశీ వచ్చారని రాధాకృష్ణ అనుచరులు చెబుతున్నారు. అయితే గతంలో వంగవీటి రాధాకృష్ణన్ వైసీపీలోకి తీసుకెళ్లేందుకు వల్లభనేని వంశీ మోహన్ తో పాటు కొడాలి నాని చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ రాధాకృష్ణ మాత్రం టిడిపిలోనే కొనసాగుతూ వచ్చారు.