Poodi Srihari Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓ గా కూడా పనిచేశారు. తాడేపల్లి లో నివాసం ఉంటున్న శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. సీఎం చంద్రబాబు కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసుల్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది షాక్. ఇటీవల అరెస్టుల పర్వం తగ్గింది అనుకున్న తరుణంలో మళ్లీ శ్రీహరి అరెస్టుతో పరిస్థితి వేడెక్కింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. తరువాత ఈ సోషల్ మీడియా పోస్టుల తాకిడి తగ్గింది. కానీ ఇటీవల పోస్టులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేసిన శ్రీహరి ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం ద్వారా మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు సంకేతాలు పంపారు.
* సీఎం పై పోస్టులు..
పూడి శ్రీహరి ( Poodi Srihari )సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో శ్రీహరి పోస్టులు పెట్టించారని ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్ పోస్టింగులు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందడంతో చిత్తూరు జిల్లాలో ఆయనపై కేసు నమోదు అయింది. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన మొబైల్ తో పాటు ల్యాబ్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పూడి శ్రీహరి. ఆయన అరెస్టుతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఎందుకు అరెస్టు చేశారు? ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు తెలియక ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు అరెస్టు చేసినట్లు స్పష్టతనిచ్చారు.
* జగన్ పాదయాత్రలో సేవలు..
స్వతహాగా జర్నలిస్ట్ అయిన పూడి శ్రీహరి గతంలో చాలా మీడియా సంస్థల్లో పని చేశారు. 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర చేసిన సమయంలో శ్రీహరి కీలకంగా వ్యవహరించారు. మీడియాకు సంబంధించిన వ్యవహారాలను అప్పట్లో చక్కదిద్దేవారు. జగన్ పాదయాత్ర పై అడుగడుగునా అంతరంగం పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ఆయన సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఆర్ఓ గా కీలక బాధ్యతలు అప్పగించారు. 2024లో వైసీపీ ఓడిపోయిన తరువాత ఆయనకు మీడియా విభాగం బాధ్యతలు కట్టబెట్టారు. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఆ బాధ్యతలు చూస్తున్నారు శ్రీహరి. అటువంటి వ్యక్తి అరెస్టు కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
