Pawan Kalyan angry on MLAs: సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుతారా? లేకుంటే మార్చేయమంటారా? అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని.. తమంతా కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి ఇలాంటి పనులు ఏంటని పవన్ ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్లు ప్రచారం నడుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని.. పార్టీ పనితీరు మార్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలతోనే పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపినట్లు జనసేన వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
బెదిరింపులపై ఫిర్యాదులు
జనసేనలో చాలామంది నేతలను తీసుకున్నారు. వారికి టిక్కెట్లు ఇచ్చారు పవన్. అయితే అప్పటివరకు ఉన్న రాజకీయాలకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు స్థానిక పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు పవన్ వద్దకు వచ్చాయి. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత పరిశ్రమ యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ యాజమాన్యాలన్నీ జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందుకే పవన్ ఈ సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే మాత్రం తన పని తాను చేసుకో పోతానని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ చేయరు.. చేస్తే ఓర్వలేరు.. ఆర్టీడీపై కొత్త ఏడుపు!
ఇటీవల సీఎం చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చేలా అవినీతికి పాల్పడడం ఏమిటని.. తనకు సైతం ఫిర్యాదులు వచ్చాయి అన్న విషయాన్ని బయటపెట్టారు పవన్. ఇక్కడితో దీనిని ఆపారా లేదా? లేకుంటే మాత్రం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెచ్చుకుంటానని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ విరుచుకుపడేసరికి జనసేన ఎమ్మెల్యేలు సైతం ఓకింత ఆందోళనకు గురైనట్లు సమాచారం . అయితే సదరి ఎమ్మెల్యేల పనితీరుతో పాటు పవన్ కళ్యాణ్ కు నేరుగా ఫిర్యాదులు ఉండడం వల్లే ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
సభ్యత్వాల తీరుపై ఆగ్రహం..
జనసేన సభ్యత్వాలపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారు. పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. కానీ సభ్యత్వాలు పరిస్థితి చూస్తుంటే మాత్రం వెనుకబాటు కనిపిస్తోంది. ఇలా ఉంటే పార్టీని ఎలా విస్తరిస్తామని.. టికెట్లు ఎక్కువగా ఎలా తీసుకుంటామని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే రాష్ట్రస్థాయిలో చాలామంది నేతలు గట్టిగానే పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు కానీ.. పార్టీ విస్తరణ దిశగా వారు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. పార్టీ సభ్యత్వం పై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పవన్. మొత్తానికైతే పరిస్థితి ఏదో చెయ్యి దాటుతున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పనిచేయని ఎమ్మెల్యేలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పుడు పవన్ ఆగ్రహం ద్వారా తెలుస్తోంది. మున్ముందు పరిణామాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…
