Heritage Foods fine: టీటీడీ ( Tirumala Tirupati Devasthanam)లడ్డుకు సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూటమి గట్టిగానే పట్టు బిగిస్తోంది. నేషనల్ మీడియా సైతం దీనిని తప్పుపడుతోంది. పవిత్రమైన తిరుమల లడ్డూను మసకబార్చడమే కాకుండా వితండవాదం చేయడం ఏమిటనేది నేషనల్ మీడియాలో ఇప్పుడు చర్చ. ఇటువంటి తరుణంలో గత రెండు రోజులుగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ పై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష రూపాయలు జరిమానా విధించింది అన్నది ఈ ప్రచార సారాంశం. పెరుగులో వెన్న శాతం తగ్గిందని.. అందుకే జరిమానా విధించినట్లు సాక్షిలో సైతం పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. ఈ తరుణంలో హెరిటేజ్ యాజమాన్యం స్పందించింది. దీనిపై పూర్తిగా స్పష్టత ఇచ్చింది.
క్రాస్ చెక్ లో తేలిందిలా..
ఆహార భద్రతకు( food safety) సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ జాతీయస్థాయిలో పనిచేస్తుంది. తప్పకుండా ఆహార పదార్థాల కల్తీ విషయంలో కఠినంగా ఉంటుంది. హెరిటేజ్ అనేది ఆహార పదార్థాల తయారీ పరిశ్రమ కాబట్టి.. హెరిటేజ్ ఫుడ్స్ ను తనిఖీ చేసింది. ఈ క్రమంలో తనిఖీల్లో పెరుగులో వెన్న శాతం తగ్గినట్లు గుర్తించింది. గత ఏడాది డిసెంబర్ 18న హెరిటేజ్ కు నోటీసులు జారీ చేసింది. లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే ఇటువంటి విషయాల్లో క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. హెరిటేజ్ విషయంలో అదే వెసులుబాటు వినియోగించుకుంది. వెంటనే తమ పెరుగు ఉత్పత్తులను అత్యుత్తమ ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించింది. వాటిలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని రిపోర్ట్ లో తేలింది. వెంటనే హెరిటేజ్ యాజమాన్యం గురు గ్రామ్ లోని ఫుడ్ సేఫ్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది. ఈ పెరుగులో వెన్న శాతం తగ్గిందన్న విచారణ పూర్తయ్యే వరకు జరిమానా ఆదేశాలను నిలిపివేసింది. ఇప్పటివరకు జరిగింది ఇదే.
ఫుల్ క్లారిటీ
ఇదే విషయంపై హెరిటేజ్ యాజమాన్య ప్రతినిధి.. ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ( chief operating officer)సాంబమూర్తి ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తప్పు దోవ పట్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే హెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలు సేకరించేటప్పుడు సరైన పద్ధతి పాటించకపోవడం వల్లే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వద్ద తప్పుడు నివేదికలు వచ్చాయని.. మరోవైపు తాజాగా అత్యుత్తమ ల్యాబ్ లలో హెరిటేజ్ పెరుగును పరిశీలిస్తే ఎఫ్ఎస్ఎస్ఏ విధించిన నిబంధనల కంటే ఎక్కువగా వెన్న శాతం ఉందని తేలినట్లు హెరిటేజ్ వర్గాలు చెబుతున్నాయి.