Health scheme for APSRTC employees: ఏపీ ప్రభుత్వం( AP government ) దూకుడు మీద ఉంది. చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైసిపి ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హక్కులు దక్కలేదు. ముఖ్యంగా ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ విషయంలో సరిగ్గా అమలు జరగలేదు. పథకం అమలును పర్యవేక్షించే కమిటీలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు చోటు లేకుండా పోయింది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంఘాలకు రాష్ట్రస్థాయి ఉద్యోగుల పథకం అమలు పర్యవేక్షణ కమిటీలో చేర్చాలన్న డిమాండ్ ఉంది. దానిపై తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.
రెండు సంఘాలకు చోటు..
ఆర్టీసీ ఉద్యోగులకు( RTC employees) సంబంధించిన ఆరోగ్య పథకం ఈ హెచ్ ఎస్ పర్యవేక్షణ కమిటీలో రెండు ఆర్టీసీ సంఘాలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా వారు చేస్తున్న విజ్ఞప్తి మేరకు ఎంప్లాయిస్ యూనియన్ తో పాటు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్కు ఈ కమిటీలు స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. వారందరికీ ఈ హెచ్ ఎస్ పథకం అమలు అవుతోంది.
Also Read: వద్దన్న అదానీ సోలార్ కు జై కొట్టిన కూటమి సర్కార్!
విలీన సమయంలో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. కానీ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈ హెచ్ ఎస్ విషయంలో మాత్రం సరైన మార్గదర్శకాలు రూపొందించలేదు. ముఖ్యంగా పర్యవేక్షక కమిటీలో ఉద్యోగులకు స్థానం దక్కలేదు. దీంతో ఈ పథకం విషయంలో సలహాలు సూచనలు అందించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే సమయంలోనే కమిటీల్లో యూనియన్లకు స్థానం కల్పించాలని కోరారు. అయితే ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఆ అవకాశం ఇచ్చింది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.