Dalavai Ramadevi: ఏపీలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత వర్ల రామయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవి ఎంపికయ్యారు ఏపీ క్యాబినెట్లో సైతం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం లోక్భవన్ కు ఆ ఫైలును పంపించారు. వర్ల రామయ్య పార్టీలో సుపరిచితులు. సీనియర్ నాయకుడు కూడా. ప్రస్తుతం టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఆర్టీసీ చైర్మన్గా వ్యవహరించారు. 2009లో తిరుపతి లోక్సభ నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
* సాధారణ మహిళా నేత..
వర్ల రామయ్య విషయంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు కానీ.. దళవాయి రమాదేవి విషయానికి వస్తే మాత్రం ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఆమె అనంతపురం జిల్లాకు చెందిన మహిళా నేత. వడ్డెర సామాజిక వర్గానికి చెందినవారు. అనంతపురం పార్లమెంటు టిడిపి అంగన్వాడి సంఘం అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆమె కుటుంబానికి టిడిపితో సుదీర్ఘ అనుబంధం ఉంది. గత 22 సంవత్సరాలుగా రమాదేవి కుటుంబం టిడిపి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం 47 వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు రమాదేవి. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచవి చూశారు. 2024 ఎన్నికల్లో అనంతపురంలో టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ విజయానికి కృషి చేశారు. ఆమె భర్త సైతం టిడిపి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.
* చాలామందికి ఇలానే..
ఎమ్మెల్సీగా రమాదేవి ఎంపికపై బలమైన చర్చ నడుస్తోంది. ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న రమాదేవి అభ్యర్థిత్వాన్ని ఎవరు ఊహించలేదు. గతంలో ఇటువంటి అవకాశాలు చాలామంది దక్కించుకున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష సైతం అంగన్వాడీ కార్యకర్తగానే ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. ఘన విజయం సాధించారు. రంపచోడవరం నియోజకవర్గంలో టిడిపి గెలిచిన దాఖలాలు లేవు. అటువంటిది అంగన్వాడీ కార్యకర్తను రంగంలోకి దించి విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు రమాదేవి ఎంపిక కూడా అనూహ్యo. వెనుకబడిన వడ్డెర కులానికి చెందినవారు ఆమె. ఓ బీసీ మహిళా నేతను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.