Chandrababu Pawan Kalyan Meeting: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. పట్టు బిగించాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. పుంజుకోవాలని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ తరుణంలో ఎత్తుకు పైఎత్తులు అన్నట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు గంటల పాటు వారి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి భోజనం కూడా చేశారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా అభివృద్ధి పై చర్చించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో తనకు స్వేచ్ఛ కల్పించిన, తాను అడిగిన నిధులు కేటాయిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపినట్లు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అయితే రెండు గంటలపాటు భేటీ జరిగిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులు చర్చించి ఉంటారని అర్థమవుతోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* తాజా పరిస్థితుల నేపథ్యంలో..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ప్రభుత్వం నుంచి ఏ చిన్న లోపం కనిపించినా దానిని హైలెట్ చేస్తోంది. కూటమిపై అదే పనిగా విమర్శలు చేస్తోంది. టీటీడీ నెయ్యి కల్తీ ఘటన పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్ తర్వాత కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడిన రాజకీయం అందరికీ తెలిసిన విషయమే. ఇంకోవైపు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యవహార శైలి కూడా హార్ట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా కూటమిని ఇరకాటంలో పెట్టింది. చాలా రకాల రాజకీయ పరిణామాలు ఏపీలో వివాదాస్పదంగా మారాయి. కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సీఎం చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తమ మధ్య అభివృద్ధి చర్చ జరిగింది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే నెల రోజుల వ్యవధిలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇది రెండోసారి. తప్పకుండా రాజకీయ అంశాలపై చర్చ జరిగి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి.
* పవన్ ప్రధాన పాత్ర..
ఏపీలో కూటమి కట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). టిడిపిని బిజెపికి దగ్గర చేసింది కూడా ఆయనే. సీట్ల పంపకాలు, మంత్రి పదవుల పంపకాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో కూడా పవన్ ఉదారంగా వ్యవహరించారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూరం చేయడమే కాదు.. మరోసారి అధికారంలోకి రాకుండా చూడాలన్నదే తన టార్గెట్ అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖ తీసుకుంటారని అంతా భావించారు. కానీ తనకు ఇష్టమైన గ్రామీణ అభివృద్ధితో పాటు అటవీ శాఖను ఎంచుకున్నారు. పర్యావరణ శాఖను సైతం నిర్వర్తిస్తున్నారు.
* నిధుల మళ్లింపు లేకుండా..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు.. సంక్షేమ పథకాలకు మళ్లించారు. రకరకాల పద్దులకు మళ్లించగలిగారు. కానీ పవన్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో కేంద్రం నుంచి వచ్చిన ప్రతి పైసాను.. గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సీఎం చంద్రబాబు కూడా మినహాయింపులు ఇచ్చారు. దీంతో అభివృద్ధి చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందించాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. వేలకోట్లతో పనులు జరిపిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ నిధులతో.. కేవలం ఉపాధి పనులే కాకుండా.. గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఎంతో మంచి పేరు వస్తోంది. అయితే తనకు ఇంత స్వేచ్ఛ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఆయనతో భేటీ అయినట్లు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కానీ నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తప్పకుండా దీని వెనుక రాజకీయ అజెండా ఉందన్న అనుమానాలు ఉన్నాయి. కానీ సాధారణ భేటీ గానే ఆ ఇద్దరు నేతలు చెబుతున్నారు.