Chandrababu reveals facts about Heritage: గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో టీటీడీ లడ్డు కు సంబంధించి నెయ్యి కల్తీ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై అధికార విపక్షం మధ్య గట్టి యుద్ధమే నడుస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారించింది. అయితే సీఎం చంద్రబాబు చెప్పినట్టు జంతు కొవ్వు లేదు కదా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో హెరిటేజ్ కోసమే ఇలా చేస్తున్నారు అంటూ కొత్త ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఇందాపూర్ డైరీ తో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. అయితే దీనికోసం శాసనమండలిలో చర్చ కోసం పట్టు పట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో చర్చకు అవకాశం కల్పించింది. సభకు రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేసింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సభకు హాజరయ్యేందుకు ఎవరు ముందుకు రాలేదు.
సుదీర్ఘ వివరణ..
ప్రస్తుతం శాసనసభలో చర్చ సాగుతోంది హెరిటేజ్ పై. దీనిపై చంద్రబాబు సుదీర్ఘంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్డిడిబి రిపోర్టు ఆధారంగానే తాను నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేశానని.. అసలు 2022 నుంచి ఏం జరిగింది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. సభ ముందు పెట్టారు. హెరిటేజ్ తన కుటుంబ సంస్థ అని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ఉత్పత్తులను ఎన్నడూ ప్రభుత్వ శాఖలు తీసుకోలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో భారతి సిమెంట్స్ ను ప్రభుత్వ నిర్మాణాల కోసం ఉపయోగించిన వైనాన్ని కూడా ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి ప్రక్షాళనకు పూనుకున్నామని.. అప్పుడే నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిందని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దర్యాప్తు బృందాన్ని నియమిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కోరిందని చంద్రబాబు గుర్తు చేశారు.
జరిగింది ఇది..
గత కొన్ని నెలలుగా సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టిందని.. నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చిందని.. చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని.. అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తరఫున ఒక ఏకసభ్య కమిషన్ నియమించామని.. దానిపై కూడా సుబ్రహ్మణ్యస్వామితో పిటీషన్ వేయించిన విషయాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పులు చేసి.. విచారణను అడ్డుకోవాలని.. ప్రభావితం చేయాలని.. ప్రయత్నాలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికక్కడే అడ్డంకులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. చేసిన తప్పిదాలే ఆ పార్టీకి ఇప్పుడు శాపంగా మారాయని చెప్పుకొచ్చారు.
ఇండాపూర్ పై వివరణ
అసలు హెరిటేజ్ అనే అంశాన్ని ఆత్మరక్షణలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. ఇండాపూర్ అనేది ప్రముఖ డైరీలకు కో మ్యానుఫ్యాక్చరింగ్ అందిస్తూ ఉంటుందని.. అందులో హెరిటేజ్ ఒకటని చెప్పుకొచ్చారు చంద్రబాబు. హెరిటేజ్ అనేది తన కుటుంబ సంస్థ అని చెప్పిన చంద్రబాబు.. ఏ ప్రభుత్వ శాఖలో కూడా హెరిటేజ్ ఉత్పత్తులను వినియోగించుకున్న దాఖలాలు లేవని తేల్చి చెప్పారు. సభ ముందు పూసకు గుచ్చినట్లు చెప్పారు. అయితే సభకు వచ్చి దీనిపై వాదనలు వినిపించాల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత చింతకాయ మాదిరిగా.. సభకు వచ్చేందుకు ఇష్టపడలేదు. రేపు శాసనమండలిలో సైతం హెరిటేజ్ పై సుదీర్ఘ వాదనలతో పాటు చర్చలు జరిగే అవకాశం ఉంది. అక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి ఆత్మ రక్షణలో పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.