Andhra Pradesh Rajya Sabha Elections 2026: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యులు జూన్ 21న పదవీ విరమణ చేయనున్నారు. అందుకే ఇప్పుడు ఎన్నికల కమిషన్ వారి స్థానంలో కొత్త వారి ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధపడింది. కూటమికి ఏకపక్షంగా బలం ఉండడంతో.. వారి ఖాతాలోనే ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు పడనున్నాయి. అయితే ఆశావహులు చాలామంది ఉన్నారు. కానీ 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక కు శ్రీకారం చుట్టింది కూటమి. అయితే అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. కానీ ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో సీనియర్లు సైతం పదవులు ఆశిస్తున్నారు.
* నలుగురి పదవీ విరమణ..
ఏపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, సానా సతీష్ పదవి విరమణ చేయనున్నారు. అయితే ఇందులో సతీష్ టీడీపీకి చెందిన నేత. ఏడాది కిందట ఆయన రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. అప్పట్లోనే మరోసారి రెన్యువల్ ఇస్తామని టిడిపి నాయకత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు టిడిపికి రెండు.. జనసేన, బిజెపికి చెరో ఒక రాజ్యసభ పదవి ఇస్తామన్న ఒప్పందం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన టిడిపికి రెండు పదవులు దక్కనున్నాయి. అందులో ఒక్కటి సానా సతీష్ కు ఖరారు అయింది. మిగతా పదవి కోసం పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. అనూహ్యంగా భారత్ బయోటెక్ అధిపతి ఎల్లా కృష్ణా పేరు వినిపిస్తోంది. మరోవైపు గల్లా జయదేవ్ సైతం రేసులో ఉన్నారు. యనమల రామకృష్ణుడు తో పాటు వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తోంది. జూనియర్ల కోటాలో చింతకాయల విజయ్ సైతం రాజ్యసభ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
* తెరపైకి అల్లు అరవింద్..
జనసేనకు( janasena ) సంబంధించి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఆది నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు లింగమనేని రమేష్. ప్రముఖ పారిశ్రామిక వ్యాప్తంగా ఉన్న ఆయన 2024 ఎన్నికల్లో జనసేనకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. పైగా సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కూడా. అయితే మరోవైపు అల్లు అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ మొగ్గు మాత్రం లింగమనేని రమేష్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. తొలి రాజ్యసభ పదవి జనసేనకు. అందుకే పవన్ కళ్యాణ్ ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
* అన్నామలై పేరు..
భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్రం నుంచి ఆ పార్టీలో ఆశావహులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఏపీ నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందిన నేత అన్నామలైను రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం ఉంది. ప్రస్తుత తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయడం లేదు. అందుకే ఏపీ నుంచి రాజ్యసభ పదవి ఇచ్చి ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు పారిశ్రామిక కోటాలో పరిమళ్ నత్వానికి మరో ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. మరి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయో చూడాలి.