Chandrababu: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల అవకతవకలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. చార్జ్ షీట్లో సంచలన అంశాలను కోర్టుకు నివేదించింది సిట్. అయితే దీనిపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. గతంలో ఏం జరిగింది అనే దానిపై క్షుణ్ణంగా వివరించారు. ఇప్పటికే డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణ చేస్తోంది. శాసనమండలిలో సైతం ఆ పార్టీ హడావిడి నడుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనం పై మాట్లాడారు. అవకతవకలు ఏ స్థాయిలో జరిగాయో వివరించే ప్రయత్నం చేశారు.
* ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో..
ఏపీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిస్థాయిలో వివరాలను ముందు ఉంచడం విశేషం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ వ్యవస్థ ఏర్పాటు అయింది. రాష్ట్రాన్ని నడిపించే ఉన్నతాధికారులను ఎంపిక చేసి అత్యున్నత వ్యవస్థ ఇది. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల అయింది. దాదాపు 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన వారిలో 325 మందిని అప్పట్లో షార్ట్ లిస్ట్ చేశారు. సాధారణంగా పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీస్ ఎస్కార్ట్ తో తరలిస్తారు. కానీ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలను మూడు చోట్ల మూల్యాంకనం జరిపారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు సభలో తెలిపారు.
* కోర్టు ఆదేశాలు కు విరుద్ధంగా..
సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం జరపాలి. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా ఆదేశించింది. డిజిటల్ వ్యాల్యూషన్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించారు. కానీ హైకోర్టు మాత్రం మాన్యువల్ ప్రకారం జరపాలని తేల్చి చెప్పింది. కానీ ఏపీ ప్రభుత్వం సరిదిద్దుకోలేదు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, సబ్జెక్టు నిపుణులు దిద్దాల్సిన గ్రూప్1 మెయిన్స్ పేపర్లను.. కనీస అర్హత లేని ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు, భవన నిర్మాణ కార్మికులకు దిద్దించారని తెలిపారు చంద్రబాబు. కోర్టు ఆదేశాలు ఉండగానే ఆగమేఘాలమీద ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవకతవకలకు పాల్పడిందని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.