Shravana Masam Gopuja : శ్రావణమాసం అనగానే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈనెల మొత్తంలో పూజలు, వ్రతాలు కనిపిస్తాయి. ఆలయాలతో పాటు ఇళ్లల్లో కూడా ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది. శ్రావణమాసం అనగానే మహిళలు కొన్ని ప్రత్యేక వ్రతాలు చేస్తారు. వీటిలో వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం తో పాటు గోపూజ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. గోపూజ చేయడం వల్ల ఐశ్వర్యంతో పాటు అన్ని రకాల శుభాలు కలుగుతాయని కొందరు పండితులు చెబుతున్నారు. మరి ఈ గోపూజ ఎలా చేయాలి? సమీపంలో గోవులు లేకపోతే ఏం చేయాలి? పూర్తి వివరాలతో ఆసక్తికరమైన కథనం..
హిందూ పురాణం ప్రకారం.. పాలసముద్రం చిలికినప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే సమయంలో ఐదు గోవులు కూడా వచ్చినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ఐదింటిని సుభద్ర, నంద, సుశీల, సురభి, బహుళ అనే పేర్లతో పిలుస్తారు. లక్ష్మీ తో పాటు ఈ గోవులను పూజించడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయని పురాణం తెలుపుతుంది. అయితే గోపూజను ఎలా చేయాలి?
సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటి ముందర గోవు వచ్చి నిలబడుతుంది. అయితే కొందరు ఈ గోవును దూరం చేసుకుంటారు. ఈ శ్రావణమాసం మొత్తంలో ఇలా ఇంటికి వచ్చిన గోవును సాదరంగా ఆహ్వానించి.. గోవు నెత్తిపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పాదాలకు తెల్ల పూలు, జిల్లేడు పుష్పాలతో పూజ చేయాలి. ఈ సమయంలో ఓం సురభ్యే నమః అనే మంత్రాన్ని 21సార్లు జపించాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో అక్షింతలు, పూలు వేసి గోవు పాదాల వద్ద అర్ఘ్యం ఇవ్వాలి.
అయితే సమీపంలో గోవులు లేకున్నా కూడా గోవు పూజ చేయవచ్చు. గోవు చిత్రపటాన్ని ఇంటిలోకి తీసుకువచ్చి.. దానిని అలంకరించాలి. ఇక్కడ కూడా తెల్ల పూలు, జిల్లేడు పూలను సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి తీపి కలిగిన పదార్థాలతో నైవేద్యం పెట్టవచ్చు. ఆ తర్వాత అదే మంత్రాన్ని జపించాలి.
శ్రావణమాసంలో ఏ రోజు అయినా ఈ పూజ చేయవచ్చు. గోవు పూజ చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. ఈ పూజ చేస్తే కుటుంబం సంతోషంగా ఉంటుందని.. ఆయురారోగ్యాలతో కొనసాగుతారని చెబుతారు. అంతేకాకుండా కోరికలు తీరని వారు ఈ పూజ చేసినా కూడా అనుకున్నది సాధిస్తారని పండితులు చెబుతున్నారు. అందువల్ల శ్రావణంలో ఏ ఒక్కరోజు అయినా గోపూజ చేసిన ప్రయత్నం చేయాలి.