Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదా? అంతలా ఆయనపై కేసులు నమోదయ్యాయా? వాటి తీవ్రత అధికంగా ఉందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి కల్తీపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబు అరెస్టయ్యారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబు పై 36 కేసులు నమోదైనట్లు వైసీపీ చెబుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అంబటి రాంబాబు. ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇప్పట్లో అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కేసుల తీవ్రత పెంచినట్లు వైసిపి ఆరోపిస్తోంది. దాని పైనే ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది.
* రోజుల తరబడి రిమాండ్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్న క్రమంలో రోజుల తరబడి వారు రిమాండ్ ఖైదీలుగా ఉండిపోతున్నారు. కోర్టులకు వెళ్లిన వారికి బెయిల్ లభించడం లేదు చాలా రోజుల వరకు. మరోవైపు వివిధ కేసుల్లో చిక్కుకున్న నేతలు విషయంలో కూటమి ప్రభుత్వం సైతం న్యాయపరమైన మినహాయింపులు ఇస్తోంది. న్యాయస్థానాలకు వెళ్లి బెయిల్ దక్కించుకునేలా వారికి అవకాశాలు ఇస్తోంది. కానీ పక్కా ఆధారాలతో వారిని అరెస్టు చేస్తుండడంతో త్వరితగతిన వారికి బెయిల్ లభించడం లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో సైతం అలానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30కి పైగా కేసులు అంబటి రాంబాబు పై నమోదు చేసినట్లు వైసీపీ చెబుతోంది. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది.
* ఆగ్రహంగా కూటమి శ్రేణులు.
ఏపీ సీఎం చంద్రబాబును( CM Chandrababu) దూషించిన కేసులో గుంటూరు జిల్లా నల్లపాడు లో అంబటి రాంబాబు పై కేసు నమోదయింది. ఇదే కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఒకవేళ ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించినా.. మిగతా కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అంబటి రాంబాబు విషయంలో కూటమి పార్టీల శ్రేణులు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. వాస్తవానికి ఆయన అరెస్టు ఉండదని అంతా ప్రచారం నడిచింది. ఎందుకంటే మిగతా మాజీ మంత్రుల విషయంలో అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. అంబటి రాంబాబు విషయంలో సైతం అప్పటి సాగునీటి శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కానీ అంబటి అరెస్టుకు ఎప్పుడు ప్రయత్నాలు జరగలేదు. కానీ ఎప్పుడూ తన అరెస్టు గురించి మాట్లాడి రెచ్చగొట్టేవారు అంబటి రాంబాబు. దమ్ముంటే తనపై కేసులు నమోదు చేసుకోవాలని.. అరెస్టులు చేయాలని సవాల్ చేసేవారు. లోకేష్ రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదని ఎద్దేవా చేసేవారు. అంతటితో ఆగకుండా ఏకంగా నడిరోడ్డుపై సీఎం చంద్రబాబు పై బూతులు తిడుతూ మాట్లాడారు. దీనిని మాత్రం కూటమి శ్రేణులు సహించలేకపోతున్నాయి. మరోవైపు అంబటి రూపంలో కాపు రాజకీయం చేయాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే అంబటి రాంబాబు విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.