Amaravati Capital: అమరావతికి( Amravati capital ) ఆదిలోనే ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో.. ఇప్పుడు అదే స్థాయిలో శుభవార్తలు అందుతున్నాయి. అమరావతికి అన్ని విధాలా కలిసి వస్తున్నాయి పరిస్థితులు. మొన్నటికి మొన్న అమరావతికి చట్టబద్ధత లభించింది. ఏకైక రాజధానిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు కేంద్రం రక్షగా నిలవడంతో అమరావతి దూసుకెళ్తోంది. తాజాగా నిధుల విడుదల విషయంలో ప్రపంచ బ్యాంకు పూర్తిగా స్పష్టతనిచ్చింది. ఎటువంటి అనుమానాలకు తావు లేదని.. అమరావతికి మాది భరోసా అన్నట్టు కీలక ప్రకటన చేసింది. అమరావతి పూర్తయ్యే వరకు తమ అండదండలు ఉంటాయని కూడా చెబుతోంది ప్రపంచ బ్యాంక్. అమరావతి తో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా కావాల్సింది అదే.
* కేంద్రం అండదండలు..
గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం( central government) అమరావతికి అండగా నిలబడింది. మూడోసారి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది ఏపీకి. అలా తొలి కేంద్ర బడ్జెట్ లోనే అమరావతికి 15 వేల కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేసింది కేంద్రం. అయితే అది కేవలం అప్పు మాత్రమేనని విపక్షాలు అనుమానించడం ప్రారంభించాయి. అప్పు కాదు అది కేంద్రం షూరిటీ ద్వారా వచ్చిన నిధులు అని స్పష్టత వచ్చింది. మరోవైపు అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా విధాలుగా అడ్డంకులు సృష్టించింది. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని గ్రహించిన ప్రపంచ బ్యాంకు నిధులను సర్దుబాటు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు కీలక ప్రకటన చేసింది..
* ఈ నెలాఖరుకు మరిన్ని నిధులు..
ఇప్పటివరకు అమరావతి ఫేజ్ 1 పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు( World Bank) ఇప్పటివరకు 340 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేసింది. ఏప్రిల్ చివరి నాటికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు తో కలిపి ప్రపంచ బ్యాంకు 150 మిలియన్ డాలర్ల నిధులు వెచ్చించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం కింద ఈ నిధుల విడుదల జరుగుతోంది. ఈ రుణం పై వడ్డీ రేటు 8 నుంచి 8 శాతం వరకు ఉండవచ్చని.. ఇది అంతర్జాతీయ మార్కెట్ రేట్లపై ఆధారపడి మారుతుందని అధికారులు చెబుతున్నారు.
* శరవేగంగా మౌలిక వసతుల కల్పన..
అమరావతికి భారీగా నిధులు వస్తుండడం పై రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి మొత్తం 1600 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకారం తెలిపాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా తనవంతుగా రూ.1400 కోట్లు విడుదల చేయనుంది. ఈ నిధులతో అమరావతిలో ప్రధాన మౌలిక సదుపాయాలైన రహదారులు, గృహ నిర్మాణం, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. వరదలు వస్తే అమరావతి ముంపునకు గురవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో వరదల నివారణ పనులు చేపడుతున్నారు. వీటికి సంబంధించి 35 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తానికి అయితే అమరావతికి ఇప్పుడు శుభ ఘడియలు నడుస్తున్నాయి.